రివ్యూయర్లూ.. బహుపరాక్‌, తప్పుడు రివ్యూ రాస్తే మరణమే..!

18 Sep, 2022 15:04 IST|Sakshi

సినిమా రిలీజైతే సమీక్షకులు స్టార్లు ఇస్తారు. కాని ఒక సీరియల్‌ కిల్లర్‌ బయల్దేరి ఆ రివ్యూలు రాసే వారిని హత్య చేసి వారి నుదుటిన స్టార్లు ఇస్తుంటే? మనం నమ్మినా నమ్మకపోయినా ‘రివ్యూల మాఫియా’ ఒకటి ఉంది.మంచి సినిమాలు చెత్త రివ్యూలను పొందితే ఆ దర్శకుడికి ఎంత బాధ? అలాంటి వాడు సీరియల్‌ కిల్లర్‌గా మారితే? ఊహ కొంచెం అతిగా ఉన్నా దర్శకుడు బాల్కి ఈ సినిమా తీశాడు.సన్నిడియోల్, పూజా భట్, దుల్కర్‌ సల్మాన్‌ నటించారు.వచ్చే వారమే ‘చుప్‌’ విడుదల.రివ్యూయర్లూ... బహుపరాక్‌! అన్నట్టు నాడు ‘కాగజ్‌ కే ఫూల్‌’ సినిమా మీద చెత్త రివ్యూలు రాయడం వల్ల సినిమాలే మానుకున్న గురుదత్‌కు ఈ సినిమా నివాళి.

బహుశా ఈ సినిమా రివ్యూయర్ల బాధితులందరి ఒక సృజనాత్మక ప్రతీకారం. కష్టపడి నెలల తరబడి సినిమా తీస్తే, రెండు గంటల పాటు హాల్లో చూసి ఆ వెంటనే తీర్పులు చెప్పేసి ‘సినిమా చూద్దామనుకునేవాళ్లను’ ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసే రివ్యూయర్ల మీద బదులు తీర్చుకుందామని ఎవరైనా అనుకుని ఉంటే, కనీసం ఊహల వరకు వారిని సంతృప్తిపరిచే పని దర్శకుడు బాల్కి నెత్తికెత్తుకున్నాడు.

బాల్కి అంటే ‘చీనీ కమ్‌’, ‘పా’, ‘పాడ్‌మేన్‌’ వంటి సినిమాల దర్శకుడు. ఇప్పుడు ‘చుప్‌’ సినిమా తీశాడు. సెప్టెంబర్‌ 23 విడుదల. సన్ని డియోల్, పూజా భట్‌ వంటి సీనియర్లు, దుల్కర్‌ సల్మాన్‌ వంటి యువ స్టార్లు ఈ సినిమాలో ఉన్నారు. ఇది ‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌’. ‘రివెంజ్‌ ఆఫ్‌ ది ఆర్టిస్ట్‌’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్‌. ఇక్కడ ఆర్టిస్ట్‌ అంటే కళాకారుడు అని అర్థం. యూట్యూబ్‌లో ఉన్న ట్రైలర్‌లో సీరియల్‌ హంతకుడు రివ్యూయర్లను చంపడం, వారి నుదుటి మీద స్టార్లు ఇవ్వడం కనిపిస్తుంది.

ఆ సీరియల్‌ కిల్లర్‌ పాత్రను పోషించిందెవరో ఇప్పటికి సస్పెన్స్‌. సన్ని డియోల్‌ మాత్రం పోలీస్‌ ఆఫీసర్‌గా చేశాడు. పూజా భట్‌ నిర్మాతగానో అలాంటి పాత్రగానో కనిపిస్తోంది. దుల్కర్‌ పాత్ర ఏమిటనేది తెలియడం లేదు. రివ్యూయర్‌ను చంపుతున్న సీరియల్‌ కిల్లర్‌ ‘స్టార్లు ఇవ్వడం కాదు. సినిమాను ప్రేక్షకులు అర్థం చేసుకోవడంలో సాయం చేయ్‌. అంతే తప్ప నోటికొచ్చినట్టు రాయడం కాదు’ అంటుంటాడు. అంటే ఇదంతా అరాకొరా జ్ఞానంతో రివ్యూలు రాసేవారి భరతం పట్టడం అన్నమాట.

ఊరికే ఉండాలా?
సినిమా ఎలా ఉన్నా ఊరికే (చుప్‌) ఉండాలా? అలా ఉండాల్సిన పని లేదు. కాని ఒక సినిమాను సరిగ్గా అర్థం చేసుకుని సరిగ్గా వ్యాఖ్యానం చేస్తున్నామా? సినిమాకు మేలు చేసేలా వ్యాఖ్యానం ఉందా... కళాకారుల కళను ఎద్దేవా చేసేలా ఉందా? అనాలోచితంగా వ్యాఖ్యలు చేస్తే అవి సినిమాను దెబ్బ తీస్తే బాధ్యులు ఎవరు? విమర్శ కూడా సినిమా తీసిన వారిని ఆలోచింప చేసేలా ఉండాలి కాని బాధ పెట్టేలా ఉండొచ్చా?

మాటలు పెట్టే బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో ఎవరైనా అంచనా కట్టగలరా? మాటలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. అందుకే ‘తెలిస్తే మాట్లాడండి. లేకుంటే నోర్మూసుకొని ఉండండి’ అనే అర్థంలో బాల్కి ఈ సినిమా తీశాడు. ట్రైలర్‌కి ఒక రివ్యూయర్‌ (లంచం తీసుకుని) చెత్త సినిమాకు నాలుగు స్టార్లు ఇస్తే అలాంటి వాణ్ణి కూడా సీరియల్‌ కిల్లర్‌ చంపుతూ కనపడతాడు. అంటే బాగున్న సినిమాను చెత్త అన్నా, చెత్త సినిమాను బాగుంది అన్నా ఈ సీరియల్‌ కిల్లర్‌ బయలుదేరుతాడన్నమాట.

సోషల్‌ మీడియా చేతిలోకి వచ్చాక ప్రతి ఒక్కరూ రివ్యూయర్‌ అవతారం ఎత్తుతున్నారు. సినిమా వాళ్లు చికాకు పడుతున్నారు. ‘చుప్‌’ చూశాక వీరంతా ఏమంటారో... ప్రేక్షకులు ఏ తీర్పు ఇస్తారో చూడాలి.

గురుదత్‌ బాధకు జవాబు
దర్శకుడు బాల్కి నాటి గొప్ప దర్శకుడు గురుదత్‌కు అభిమాని కావచ్చు. గురుదత్‌ తీసిన ‘కాగజ్‌ కే ఫూల్‌’ (1959) బాక్స్‌ ఆఫీస్‌ దగ్గర డిజాస్టర్‌ అయ్యింది. అది మన దేశంలో తొలి సినిమాస్కోప్‌ చిత్రం. అంతే కాదు గురుదత్‌ తన మేధను, డబ్బును, గొప్ప సంగీతాన్ని, కళాత్మక విలువలను పెట్టి తీసిన చిత్రం.

కాని రిలీజైనప్పుడు విమర్శకులు ఘోరంగా చీల్చి చెండాడారు ఆ సినిమాను. దాంతో ప్రేక్షకులు కూడా సినిమాను అర్థం చేసుకోలేక రిజెక్ట్‌ చేశారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గురుదత్‌ను ఈ ఫలితం చావుదెబ్బ తీసింది. ఆ తర్వాత అతను జడిసి మరే సినిమాకూ దర్శకత్వం వహించలేదు.

కుంగిపోయాడు కూడా. కాని ఆశ్చర్యం ఏమిటంటే కాలం గడిచే కొద్దీ ‘కాగజ్‌ కే ఫూల్‌’ క్లాసిక్‌గా నిలిచింది. దేశంలో తయారైన గొప్ప సినిమాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. తన కాలం కంటే ముందు తీసిన సినిమాగా సినిమా పండితులు వ్యాఖ్యానిస్తారు. ప్రపంచ దేశాల్లో సినిమా విద్య అభ్యసించేవారికి అది సిలబస్‌గా ఉంది.

బాల్కీ అభ్యంతరం అంతా ఇక్కడే ఉంది. ‘కాగజ్‌ కే ఫూల్‌ రిలీజైనప్పుడు విమర్శకులు కొంచెం ఓర్పు, సహనం వహించి అర్థం చేసుకుని ఉంటే గురుదత్‌కు ఆ బాధ, సినిమాకు ఆ ఫలితం తప్పేవి’ అంటాడు. ఆ సినిమాను చంపిన రివ్యూయర్లపై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికన్నట్టుగా ‘చుప్‌’ తీశాడు. గురుదత్‌ సినిమాల్లోని పాటలే ఈ సినిమాలో వాడాడు.

మరిన్ని వార్తలు