పుస్తక పఠనం ప్రాధాన్యం తెలుసా? ఇలా చదవడం ఎంతో మేలు

9 Aug, 2021 00:41 IST|Sakshi

పుస్తకాలు ప్రపంచాన్ని చూపించే గవాక్షాలు

మనల్ని కాళ్ళు కదపనీయక, ఇల్లు కదలనీయక  కొత్త  ప్రపంచంలో విహరింపచేసి కొత్త కొత్త  అనుభవాలను, అనుభూతులను మనకు పంచి మన పరిణతికి, మనోవికాసానికి దోహదం చేసే  అద్భుత మార్గదర్శకాలు. మనకు సంతోషాన్నిచ్చి, మన బాధను పంచుకునే మన చక్కని నేస్తాలు పుస్తకాలు.

ఇప్పుడైతే పుస్తకాలు విరివిగా అందరి చేతుల్లోకి వస్తున్నాయి. కొన్నేళ్ల కిందట, పుస్తకాలు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. వార పత్రికలలో ధారా వాహికలను క్రమం తప్పకుండా చదివే అలవాటున్న వారు, నవలలు, కథలు చదివే అభిరుచి ఉన్నవారు, కొనుక్కోలేక గ్రంథాలయాలలో తెచ్చుకుని చదివేవారు. గృహిణులు, సరుకులు కట్టిన కాగితం పొట్లాలమీద ఉండే వార్తలు, కథలు కూడా వంటిల్లు సర్దుకుంటూ ఆసక్తిగా చదివేవారు. పఠ నాభిలాష అంత బాగా ఉండేది.

రచయితలు గతించిపోవచ్చు. కాని, పుస్తకాలు నశించవు. శ్రీనాథ, పోతనాది కవులను మనమెవరం చూడలేదు. వాళ్ళ గ్రంథాలు వెలువడి శతాబ్దాలు గడిచేయి. అయినా మనం ఇప్పటికీ చదువుతూనే ఉన్నాం. ఆ గ్రంథాల నుంచి స్ఫూర్తిని పొందుతూనే వున్నాము. వాటిలోని సందేశాలను, నీతులను అనుసరిస్తూనే వున్నాము.

శ్రవణం, భాషణం, పఠనం, లిఖితం అనే నాలుగు అభివ్యక్తి నైపుణ్యాలలో పఠన కళ ఒకటి. పుస్తకాలను చదవటం ఒక కళ. వేగంగా చదవాలి. అర్థం చేసుకుంటూ చదవాలి. ప్రారంభించి కొన్ని పేజీలు చదవగానే అది ఉపయోగపడేదేనా, కాలక్షేపానికా అన్నది గ్రహించగలగాలి. ఏవి చదవాలి, ఎలా చదవాలి, ఏవి చదవకూడదు అనేది తెలిసి వుండటం కూడా పఠన కళలో భాగమే! ఎన్ని పుస్తకాలు చదివాము అన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా చదివాం, ఎంత లోతుగా చదివామన్నది ముఖ్యం. చదివిన ఒక వాక్యమైనా క్షుణ్ణంగా, లోతుగా చదవాలి. అపుడే మన మనస్సులో అవి నిలిచిపోతాయి.

‘కొన్ని పుస్తకాలను స్పృశించి వదిలేయాలి, కొన్ని జీర్ణించుకోవాలి, కొన్ని నెమరు వేసుకోవాలి’ అని అన్నాడు ప్రసిద్ధ ఆంగ్ల రచయిత బేకన్‌. పుస్తకాలు ఎలా చదవాలో మహాకవుల, మేధావుల జీవిత చరిత్రలు, డైరీల నుండి గ్రహించవచ్చు.

చిరిగిన చొక్కానైనా తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో’ అనే సూక్తి మనందరకు తెలుసు. కాని, నేటి యువత çపద్ధతి ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. బాగా చదివే అలవాటున్నవారిని పుస్తకాల పురుగు అంటారు. అలాంటివారు నిజంగానే తమ డబ్బును బట్టలకు కాకుండా పుస్తకాలు కొనటానికే ఖర్చు చేస్తారు.

పుస్తకాలు పాఠకుణ్ణి ఊహలోకంలో, అద్భుత జగత్తులో విహరింపజేస్తాయి. మనను తమతో ప్రయాణింప చేస్తాయి. సంఘటనలు ఆయా ప్రాంతాలకు తమతో తీసుకువెళ్లిపోతాయి. చదువుతున్న సన్నివేశానికి మనం దృశ్య రూపాన్ని కల్పించుకుంటాం.

పుస్తకాలు చదవటం శ్వాస పీల్చటం లాంటిది. శ్వాస ఆడకపోతే ప్రాణం నిలవదు. పుస్తకాలు అంతే! ఒక పుస్తకం, ఒక కలం, ఒక ఉపాధ్యాయుడు... ఇవి ఈ ప్రపంచాన్నే మార్చగలవు. ఆస్తులు పోవచ్చు, భవనాలు కూలిపోవచ్చు, కాని పుస్తకాలు నశించవు.

పుస్తకాలు లేని ఇల్లు ఆత్మ లేని శరీరం లాంటిది. అశాంతిమయ క్షణాల్లో, నిరాశా నిస్పృహలలో, ఒంటరి తనంలో పుస్తకమే నిజమైన నేస్తం. ప్రాణ స్నేహితులు కూడా ఒకొక్కసారి విభేదాలు వచ్చి మనతో విడిపోవచ్చు. కాని, పుస్తకాలు అనే స్నేహితులు మన సుఖ దుఃఖాలలో మనకు తోడు. ఎంతో వెన్నుదన్ను. ముఖ్యంగా మన బాధలో, మనని ఎప్పుడూ విడిచి పెట్టవు. మౌన మిత్రులు. మనలోని లోపాలను దిద్ది మంచి దారిలో పెడతాయి. మనలో మంచి ప్రవర్తనను ప్రోది చేసే అద్భుత సాధనాలు. శాశ్వతమైన స్నేహితులు.

పుస్తకాలు జ్ఞానమనే నిధికి తాళాల్లాంటివి. సంతోషమనే ఇంటికి తలుపు లాంటివి. పుస్తకాలకు పెట్టిన ప్రతిపైసా మంచి పెట్టుబడే. పుస్తకాలు జీవితంలో కొత్తకోణాలను చూపిస్తాయి. ఎలా జీవించాలో మనకు నేర్పిస్తాయి. ఆశావహ దృక్పధాన్ని పెంచుతాయి. మెదడును వికసింప చేసి, స్వతంత్ర ఆలోచనా శక్తిని, విశ్లేషణా సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. సత్యాన్ని శోధింప చేస్తాయి. మేధావి రచయితలు వారి రచనల ద్వారా ఎప్పుడూ జీవించే ఉంటారు.

ప్రతి వారికి సొంతం గ్రంధాలయం ఉండాలి. ఇది విలాసం కోసం, ప్రదర్శన కోసం కాదు. జీవితంలో ఇదీ ఒక అవసరం. కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు, ఒక నిఘంటువు, ఒక విజ్ఞాన సర్వస్వం లేని ఇల్లు వెలుతురు రావటానికి కావలసిన కిటికీలు లేని ఇల్లు లాంటిది.

ప్రపంచపు గొప్ప సాహిత్యాన్ని చదవటం వల్ల పద సంపద విస్తృతమవుతుంది. వేగంగా పెరిగిపోతున్న వయసులో ఒత్తిడుల నుంచి తప్పించుకోవటానికి గొప్ప ఆధారం పుస్తకాలు.

ఎలా చదవాలి?
ఒక పెన్సిల్‌ చేత్తో పట్టుకుని, ముఖ్యమైన వాక్యాల కింద గీత గీస్తూ, అర్థం చేసుకుంటూ చదవాలి. అప్పుడు ఆ పుస్తకంలో హృదయాన్ని వేగంగా సమీక్షించగలమని మేధావులు చెప్పారు. ప్రతిరోజూ ఎంతో కొంత చదవాలి. అది క్రమంగా ఓ అలవాటుగా మారిపోతుంది. రాత్రి పడుకునే ముందు మంచి పుస్తకం ఒక అరగంట చదివితే మనసు ప్రశాంతత పొందుతుంది. మంచి నిద్ర పడుతుంది.
పుస్తక పఠనం అలసటలో, ఆవేదనలో, ఆర్తిలో, సుఖంలో, సంతోషంలో ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. పిల్లలకు బాల్యం నుంచే పుస్తకాలు చదవటం అలవాటు చేస్తే వాళ్ళ జీవితంలో అది స్థిర పడిపోతుంది.

♦ పుస్తకాలు చదవటం శ్వాస పీల్చటం లాంటిది. శ్వాస ఆడకపోతే ప్రాణం నిలవదు. పుస్తకాలు అంతే! ఒక పుస్తకం, ఒక కలం, ఒక ఉపాధ్యాయుడు... ఇవి ఈ ప్రపంచాన్నే మార్చగలవు .
♦ సూక్తి సుధ అవకాశాలు సూర్య కిరణాలు వంటివి. వాటిని వీలయినంత త్వరగా దొరక బుచ్చుకోవాలి. ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు.

– డాక్టర్‌ చెంగల్వ రామలక్ష్మి

మరిన్ని వార్తలు