ఇష్టమైన పుస్తకం

1 Dec, 2020 08:20 IST|Sakshi
కూతురితో అమిత్‌ సారిన్‌

ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివినప్పుడు పిల్లల్లో కలిగే ఆనందం, మరో పుస్తకాన్ని చదివేటట్లు ప్రోత్సహిస్తుంది. తమకు ఇష్టమైన పుస్తకాల ప్రపంచంలో పిల్లలను స్వేచ్ఛగా విహరించనివ్వాలి. అక్షరాల సముద్రంలో అలసిపోయే వరకు ఈదనివ్వాలి. ‘పుస్తకాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. జీవితాన్ని మార్చగల శక్తి కలిగిన సాధనం పుస్తకం’. ఈ మాట చెప్పిన అమిత్‌ సారిన్‌ ఒక పుస్తకాల దుకాణం యజమాని. గుర్‌గావ్‌లో ‘కూల్‌ స్కూల్‌’ పేరుతో భారీ పుస్తకాల దుకాణాన్ని నడుపుతున్నాడితడు. అమిత్‌ ఉద్దేశం పుస్తకాలను అమ్ముకోవడం కాదు. పిల్లలను చదువరులుగా మార్చడం. అతడు తల్లిదండ్రులందరికీ పెద్దబాల శిక్ష సూక్తి వంటి మరో మాట కూడా చెప్తున్నాడు. అదేంటంటే... ‘అక్షరం నేర్చుకున్న ప్రతి వ్యక్తిలోనూ చదువరి లక్షణం ఉంటుంది. ‘మా పిల్లలు క్లాసు పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలను పట్టుకోను కూడా పట్టుకోరు. వాళ్ల చేత క్లాసు పుస్తకాలను చదివించడమే గగనం. ఇక కథల పుస్తకాలు కూడా దగ్గరుండి మరీ ఎక్కడ చదివిస్తాం’ అనే తల్లిదండ్రులు ఎక్కువగానే కనిపిస్తుంటారు.

నిజానికి క్లాసు పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలను పట్టుకోకపోవడం పిల్లలలోపం కాదు. తల్లిదండ్రుల వైఫల్యం అంటారు అమిత్‌. తమ పిల్లలు ఏ పుస్తకాలను ఇష్టపడుతున్నారో తెలుసుకోలేకపోవడమే ఇందుకు కారణం. పెద్దవాళ్లు తమకు నచ్చిన పుస్తకాలను కొనిచ్చి పిల్లలను చదవమంటారు. ఆసక్తి కలగని పుస్తకాన్ని చదవడం ఎవరికైనా కష్టమే. అలా చేయకుండా కాల్పనిక సాహిత్యం, జానపద కథలు, చారిత్రక కథనాలు... అన్ని రకాల పుస్తకాలను పిల్లలకు చూపించాలి. పది వాక్యాలు చెప్పే విషయాన్ని ఒక చిత్రం చెబుతుంది. ఆకర్షణీయమైన బొమ్మలున్న పుస్తకాలతో పఠనం మొదలు పెట్టించాలి. పుస్తకం మొత్తం పూర్తి చేయగలిగినట్లు కూడా ఉండాలి. ఒక పుస్తకాన్ని పూర్తిగా చదివినప్పుడు పిల్లల్లో కలిగే ఆనందం, మరో పుస్తకాన్ని చదివేటట్లు ప్రోత్సహిస్తుంది. అసంపూర్తిగా వదిలేసినప్పుడు పుస్తక పఠనం మీద నిరాసక్తత ఆవరిస్తుంది. అందుకే వయసుకు తగినట్లు పుస్తకాన్ని ఎంపిక చేయాలని చెబుతాడు అమిత్‌ సారిన్‌. 

నిజమే... చిన్నప్పుడు దాదాపుగా పిల్లలందరూ ఒక రాజు, ఏడుగురు కొడుకులు, ఏడు చేపల కథను విని ఆస్వాదించి ఉంటారు. కొంచెం పెద్దయిన తర్వాత మయూర రాజ్యంలో ఓ యువతి, రాజకుమారుడు, కీలుగుర్రం కథను కూడా ఆసక్తిగా చదివి ఉంటారు. పది– పన్నెండేళ్లకు వాళ్లకంటూ ఒక అభిరుచి స్థిరపడటం మొదలవుతుంది. వాస్తవ కథనాల అన్వేషణ మొదలు పెట్టవచ్చు. ‘అది కాదు ఇది చదువు’ అంటూ పెద్దవాళ్లు తమకిష్టమైన పుస్తకాన్ని పిల్లల చేతిలో పెడితే  పిల్లల ముఖం వికసించదు సరికదా వాడిపోతుంది. తమకు ఇష్టమైన పుస్తకాల ప్రపంచంలో పిల్లలను స్వేచ్ఛగా విహరించనివ్వాలి. అక్షరాల సముద్రంలో అలసిపోయే వరకు ఈదనివ్వాలి. అమిత్‌ సారిన్‌ చెప్పినట్లు చదువరులు కానివాళ్లు ఉండరు. అక్షరం వచ్చిన ప్రతి ఒక్కరిలోనూ పఠనాభిలాష ఉండి తీరుతుంది. ఆ అభిలాషను సంతృప్తి పరిచే పుస్తకం దొరక్కపోవడం వల్లనే చదువరులు కాలేకపోతున్నారు. 

మరిన్ని వార్తలు