అకుశలాలు చివరికి దుఃఖాన్నే తెచ్చిపెడతాయి..

15 Jul, 2021 07:10 IST|Sakshi

ధమ్మపథం

కుశల కర్మలు అంటే మంచి పనులు. అకుశల కర్మలు అంటే చెడ్డ పనులు. ప్రతి మనిషి మనస్సులో, ఆలోచనల్లో ఈ రెండూ ఉంటాయి. పుట్టుకతోనే ‘వీరు మంచివారు’ ‘వీరు చెడ్డవారు’ అని విభాగించుకుని పుట్టరు. వ్యక్తిగా, సామాజికంగా పెరిగిన కొద్దీ మనలో ఈ భావాలు పెరుగుతాయి. కుశల ధర్మాలు మనకి శాంతిని ఇస్తాయి. అకుశలాలు చివరికి దుఃఖాన్నే తెచ్చిపెడతాయి.

అయితే మనిషి దుఃఖంలేని కుశల మార్గంలోనే నడవడం ఏదోఒక క్షణంలోనో, రోజులోనో జరిగే పని కాదు. ఎంత సాధన చేసి మంచిగుణాలు అలవర్చుకున్నా ఏదో క్షణంలో బుద్ధుడు చెప్పినట్లు చిటికె వేసినంత కాలంలో– అకుశలం వచ్చి ఆవహించేస్తుంది. కాబట్టి మనిషి కుశల చిత్తంతో మెలగాలంటే నిరంతరం అదే ధ్యాసలో ఉండాలి. నడవాలి. 
ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఎందరో భిక్షువులు ఎంతెంతో సాధన చేసినవారు కూడా ఆ చిటికెల కాలంలోనే దారి తప్పేవారు. ఈ విషయంలో ఎందరో బుద్ధుని దగ్గరకు వచ్చి...
‘భగవాన్‌! మా చిత్తాన్ని నిలుపుకోలేకపోతున్నాం. ఏదో క్షణంలో చెడ్డ భావాలు వచ్చి పడుతున్నాయి.

వానినుండి ఎలా బైటపడగలం’’ అని అడిగేవారు. అప్పుడు బుద్ధుడు... ‘మీరు అందుకోసం నిరంతరం పది సాధనా మార్గాల్లో ఉండాలి’ అంటూ వాటి గురించి చెప్పాడు. అప్రమత్తంగా ఉండటం, సోమరితనంతో గడపడం, అతిగా కోరుకోవడం, ఎంత లభించినా ఇంకా, ఇంకా కావాలి అనే అసంతృప్తి  నిరంతరం నిర్లక్ష్యంగా ఉంచే అజాగ్రత్త, ఏ విషయాన్నైనా లోతుగా గ్రహించకపోవడం వల్ల కూడా అవగాహనాలేమి, చెడ్డవారి స్నేహం, వీటితోపాటుగా జాగరూకతను నిరంతరం పెంచుకోకపోవడం చెడ్డవారిని అనుసరిస్తూ, అకుశల కర్మలే శిక్షపొందుతూ ఉంటే.. ఈ పది కార్యాల వల్ల మనిషితో అకుశల ఆలోచనలు పెరుగుతాయి. అకుశల ఆచరణలు జరుగుతాయి.

అలాంటి వానికి సంపద నష్టం, కీర్తి నష్టం, ప్రజ్ఞ నష్టం, సకలం నష్టం. దీనివల్ల దుఃఖం. అలాగే కుశల ధర్మాలు పెరగాలంటే ప్రమత్తతను వీడి అప్రమత్తతతో సోమరితనాన్ని వదిలి ఉండాలి. పట్టువదలని సాధనలో ఉండాలి. అధిక కోర్కెల్ని వదిలి, బతకడానికి సరిపడు మితమైన కోర్కెలు (అల్పేచ్ఛ) కలిగి ఉండాలి. సంతృప్తి కలిగి, జాగరూకతతో మెలగాలి. ప్రతి విషయం పైనా మంచి అవగాహన పెంపొందించుకోవాలి.

మంచిని చేకూర్చే మంచి మిత్రులతోనే స్నేహం చేయాలి. మంచివారిని అనుసరించాలి. మంచి కర్మల శిక్షణ పొందాలి. ఈ పది కార్యాల వల్ల మనిషిలో కుశల ఆలోచనలు పెరుగుతాయి. కుశల ధర్మాలు ఉద్భవిస్తాయి. కుశలాచరణ కలుగుతుంది. అలాంటి వారికి సంపద నష్టం కాదు. కీర్తికి నష్టం రాదు. ప్రజ్ఞ దిగజారిపోదు. దుఃఖం దరికే రాదు. అని చెప్పాడు బుద్ధుడు. ఇలా ప్రతి వ్యక్తి తనను తాను తీర్చిదిద్దుకుంటే, అది వ్యక్తికి, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి మేలు అని బోధించిన తధాగత బుద్ధునికి జేజేలు! 
– డా. బొర్రా గోవర్ధన్‌ 

మరిన్ని వార్తలు