Bones Box Mystery Story: బాక్స్‌ ఆఫ్‌ బోన్స్‌.. ఇప్పటికీ మిస్టరీగానే..!

26 Jun, 2022 13:39 IST|Sakshi

అది 1992 మార్చి 30. అమెరికాలోని వ్యోమింగ్‌లోని థర్మోపోలిస్‌లో నివాసముంటున్న న్యూవెల్‌ సెషన్స్‌ ఇంట్లో ఉన్నట్టుండి గందరగోళం మొదలైంది. న్యూవెల్, అతడి స్నేహితులు కలసి.. ఓ పాత ట్రంకు పెట్టె తాళాన్ని పగలగొడుతున్నారు. గత ఆరేళ్లుగా అందులో ఏముందనే వారి కుతూహలం.. ఆ పనికి ఉసిగొల్పింది. తాళం ఊడింది. తలుపు తెరుచుకుంది. పాక్షికంగా కప్పిన ప్లాస్టిక్‌ కవర్‌ను తీసి చూస్తే.. అందులో ఒక బ్యాగ్‌.. ఆ బ్యాగ్‌లో ఓ మనిషి అస్థిపంజరం విడి భాగాలు ఉన్నాయి. అంతా షాక్‌. ఒక్కమాటలో చెప్పాలంటే గజగజా వణికిపోయారు. ఆ షాక్‌లోనే న్యూవెల్‌ భార్య డైసీ.. ‘ఇప్పుడు ఏం చేద్దాం’ అంది. ‘గొయ్యి తవ్వి పూడ్చిపెట్టడం బెటర్‌’ అన్నారంతా. అది మరింత నేరం కావచ్చని డైసీ హెచ్చరించింది. దాంతో న్యూవెల్‌.. ఆ ట్రంక్‌ పెట్టెను అక్కడ వదిలిపోయిన తన స్నేహితుడు గాబీ కోసం పరుగుతీశాడు.

గాబీ ఎదురు పడగానే.. ట్రంక్‌ పెట్టె గురించి ఆరా తీసి.. అతడి హావభావాలను గమనించాలనుకున్నాడు. గాబీ 1986లో న్యూవెల్‌కి ఓ షెడ్‌ని అప్పగించాడు. వెళ్తూ వెళ్తూ కొన్ని వస్తువుల్ని అందులో వదిలేసి వెళ్లాడు. వాటిలో ట్రంకు పెట్టె ఒకటి. వదిలేసిన వస్తువుల్ని తీసుకెళ్లడానికి గాబీ చాలా సార్లు షెడ్‌కు వచ్చాడు కానీ..ఆ ట్రంక్‌ పెట్టెను తీసుకెళ్లే ప్రయత్నమైతే చెయ్యలేదు. ‘ఎందుకు?’ అని న్యూవెల్‌ అడగనూ లేదు. ఇప్పుడు గాబీని కలసిన న్యూవెల్‌.. ‘షెడ్‌లో నువ్వు వదిలిపెట్టిన ట్రంక్‌ పెట్టె గుర్తుందా?’ అని అడిగాడు. ‘గుర్తుంది.. కానీ దాన్ని నేనెప్పుడూ తెరవలేదు. కొన్నప్పుడే దాని తాళంచెవి మిస్‌ అయ్యింది. డమ్మీ కీస్‌తో చాలా సార్లు ట్రై చేశా.. కానీ ఓపెన్‌ కాలేదు..’ అంటూ ఎలాంటి తొణుకూ బెణుకూ లేకుండా సమాధానమిచ్చాడు గాబీ.

అందులో మనిషి అస్థిపంజరం ఉందని న్యూవెల్‌ చెప్పగానే.. ‘వేళాకోళాలు వద్దు బ్రదర్‌’ అంటూ పెద్దగా నవ్వాడు గాబీ. తాను తమాషా చేయడం లేదని నమ్మించడానికి న్యూవెల్‌కి చాలా సమయమే పట్టింది. అయితే గాబీ సమాధానాల మీద న్యూవెల్‌కి నమ్మకం కుదరలేదు. వెంటనే న్యూవెల్‌.. జాన్‌ లమ్లీ అనే అధికారి సాయాన్ని కోరాడు. అతడి సమక్షంలోనే వివిధ పరీక్షల కోసం అస్థిపంజరం ల్యాబ్‌కి తరలింది. ఎడమ పుర్రెలో, ఎడమ భుజంలో బుల్లెట్స్‌ ఉన్నట్లు ఎక్స్‌రేలు తేల్చాయి. దాంతో పుర్రె ఆకారాన్ని బట్టి చనిపోయిన వ్యక్తి ఊహచిత్రాలను గీయించి .. విడుదల చేశారు పోలీసులు. దీనిపై పత్రికలు కూడా ప్రత్యేక శ్రద్ధచూపించాయి.

లమ్లీ వెంటనే.. గాబీని కలసి, తన స్టైల్‌లో ప్రశ్నించాడు. అప్పుడు కూడా గాబీ తడబడలేదు. ‘చాలా సార్లు పెట్టె ఓపెన్‌ చేయడానికి ప్రయత్నించాను. కానీ కుదర్లేదు. దాన్ని ఎక్కడ కొన్నానో గుర్తులేదు. కానీ.. అది 1973 నాటి పెట్టె’ అని బదులిచ్చాడు. దాంతో వెంటనే లమ్లీ.. అస్థిపంజరాన్ని చెయెన్నేలోని వ్యోమింగ్‌ స్టేట్‌ క్రైమ్‌ ల్యాబ్‌కు అప్పగించాడు. అక్కడి ల్యాబ్‌ అధికారి శాండీ మేస్‌.. ఆ అస్థిపంజరం ఒక పురుషుడిదని, సుమారు 5.9 పొడవు ఉంటాడని తేల్చాడు. అప్పుడే దర్యాప్తు చేస్తున్న అధికారులకు.. గాబీ మిసిసిపీలో ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త అందింది. దాంతో ఈ హత్యకు గాబీకి కచ్చితంగా సంబంధం ఉందని తేలినా.. గాబీ లేకుండాపోవడంతో ట్రంక్‌ పెట్టె కేసుకు బ్రేక్‌ పడినట్టయింది.

అప్పట్లో లయోవా వాసి షెల్లీ స్టాట్లర్‌(16), ఆమె తండ్రి ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘బహుశా ఆ అస్థిపంజరం మీ తాత జోసెఫ్‌ ముల్వానీది కావచ్చ’ని స్టాట్లర్‌ తండ్రి పదేపదే అనుమానించాడు. అయితే అప్పట్లో స్టాట్లర్‌ పెద్దగా పట్టించుకోలేదు. ఏళ్లు గడిచేకొద్ది.. స్టాట్లర్‌కు తన కుటుంబ చరిత్రపై ఆసక్తి పెరిగింది. ఒకసారి తన అమ్మమ్మ మేరీ అలైస్‌.. తన భర్త జోసెఫ్‌ ముల్వానీని తన కొడుకు జాన్‌ డేవిడ్‌ మోరిస్‌ చంపేసి ఉంటాడని బాధపడింది. తన తాత గురించి ఎన్నో ఎంక్వైరీలు చేసిన స్టాట్లర్‌కు 2017 వచ్చేసరికి.. ఆ అస్థిపంజరం తన తాత జోసెఫ్‌దేననే నమ్మకం బలపడింది. వెంటనే తన తల్లి కేథరిన్‌ డీఎన్‌ఏతో సరిచూడాలని అధికారులకు సిఫారసు చేసింది. అదే ఏడాది అక్టోబర్‌ 19న కేథరిన్‌ నుంచి డీఎన్‌ఏ నమూనా తీసుకున్నారు అధికారులు. అనుకున్నట్లే ఆ అస్థిపంజరం జోసెఫ్‌ ముల్వానీదే కావడంతో జాతీయస్థాయిలో ఈ కేసు మరోసారి వార్తలకు ఎక్కింది. జోసెఫ్‌ ముల్వానీ ఎవరో కాదు.

1941 నాటి ఇల్లినాయిస్‌ నేషనల్‌ గార్డ్‌లోని 130వ పదాతిదళంలో సభ్యుడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో పసిఫిక్‌ థియేటర్‌కి పోరాటయోధుడిగా వెళ్లాడు. తర్వాత కాలిఫోర్నియాలో రైల్‌రోడ్‌ వర్కర్‌ అయ్యాడు. మేరీ అలైస్‌ను వివాహం చేసుకున్నాడు. కేథరిన్, ఓఓ, పాట్రిక్‌ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మరి మోరిస్‌ ఎవరు? మేరీ అలైస్‌ మొదటి భర్త కొడుకే జాన్‌ డేవిడ్‌ మోరిస్‌. 1963లో జోసెఫ్‌ లయోవాలో ఇల్లు కొని, అందులోకి కుటుంబంతో సహా మాకాం మార్చాడు. ఉన్నట్టుండి జోసెఫ్‌ అదృశ్యమయ్యాడు. అప్పుడే 16 ఏళ్ల మోరిస్‌.. జోసెఫ్‌ను హత్య చేసి పాతిపెట్టి ఉంటాడని, ఆ తర్వాత తవ్వి శరీరభాగాలను పెట్టెలో పెట్టి..  థర్మోపోలిస్‌ తీసుకుని వెళ్లి ఉంటాడని స్టాట్లర్‌ కుటుంబం భావించింది.

ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. మోరిస్, గాబీ ఒక్కరే కావడం. మోరిస్‌ ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో చలామణీ అయ్యాడని దర్యాప్తులో తేలింది. దాంతో గాబీ ఆత్మహత్య కూడా ఒక డ్రామా కావచ్చనే అనుమానాలు బలపడ్డాయి. అయితే నిజం బయటపడక మునుపే.. న్యూవెల్‌(ట్రంక్‌ పెట్టె ఓపెన్‌ చేసిన వ్యక్తి) 2003న, 2009లో మేరీ అలైస్‌(జోసెఫ్‌ భార్య) కన్నుమూశారు. 2019 మార్చి 29న వ్యోమింగ్‌లోని బల్లార్డ్‌ ఫ్యునరల్‌ హోమ్‌లో జోసెఫ్‌ కుటుంబ సమక్షంలో పూర్తి సైనిక స్మారక లాంఛనాలతో గౌరవప్రదంగా జోసెఫ్‌ అంత్యక్రియలు జరిగాయి. మొత్తానికీ ఈ కథలో గాబీ అలియాస్‌ మోరిస్‌ ఏమయ్యాడు? అసలు స్టెప్‌ ఫాదర్‌ అయిన జోసెఫ్‌ను ఎందుకు చంపాడు? అనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది.
 ∙సంహిత నిమ్మన
చదవండి: Alzheimers Disease: ఇవి కూడా అల్జైమర్స్‌ లక్షణాలేనట!!

మరిన్ని వార్తలు