ఆరాధ్య ప్రత్యర్థి

1 Nov, 2020 08:24 IST|Sakshi
మేరీ కోమ్, జరీన్‌

నిఖత్‌ జరీన్‌ తెలంగాణ అమ్మాయి. బాక్సర్‌. 24 ఏళ్లు. నిజామాబాద్‌. 2019లో మేరీ కోమ్‌తో తలపడి ఓడిపోయింది. ముందు అనుకున్న విధంగా ఒలింపిక్స్‌ జరిగి ఉంటే.. జరీన్‌ మీద గెలిచిన మేరీ కోమ్‌ టోక్యోకి వెళ్లి ఉండేవారు. కోమ్‌కి, జరీన్‌కి అప్పట్లో జరిగిన పోటీ 51 కేజీల బౌట్‌. ఆరుసార్లు వరల్డ్‌ ఛాంపియన్‌ అయిన కోమ్‌.. జరీన్‌ని తేలిగ్గా పడగొట్టేశారు. అసలు వాళ్ల మధ్య ఆ పోటీ జరగాల్సిందే కాదు. అప్పటికే ట్రయల్స్‌ ఏమీ లేకుండానే ఒలింపిక్స్‌కి మేరీ కోమ్‌ సెలక్ట్‌ అయి ఉన్నారు. జరీన్‌ వచ్చి ‘అలా ఎలా చేస్తారు? ట్రయల్‌ జరగాల్సిందే. అవకాశం న్యాయంగా రావాలి. సీనియర్‌ అని రాకూడదు’ అని వాదించింది. అధికారులకు తప్పలేదు. ఇద్దరికీ మ్యాచ్‌ పెట్టారు. జరీన్‌ 1–9 తో ఓడిపోయింది. రింగులోనే కోమ్‌కి షేక్‌హ్యాండ్‌ ఇవ్వబోయింది. హగ్‌ కూడా చేసుకోబోయింది. ‘హు..’ అని కోమ్‌ ఆమెను పట్టించుకోకుండా రింగ్‌ దిగి వెళ్లిపోయారు. అప్పట్నుంచీ వీళ్లిద్దరికీ పడటం లేదని అంటారు.

మళ్లీ ఇప్పుడెవరో అదే విషయం జరీన్‌ని అడిగారు. ‘పడకపోవడం అంత పెద్దదాన్ని కాదు. ఆమె నా ఆరాధ్య బాక్సర్‌. ఒలింపిక్స్‌లో కోమ్‌ పతకం సాధించాలని ఆశిస్తున్నా’ అంది జరీన్‌. ఇప్పుడు జరీన్‌ 2022 లో జరిగే కామన్‌ వెల్త్, ఏషియన్‌ గేమ్స్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తోంది. ఢిల్లీలో కోమ్‌కి, జరీన్‌కి జరిగిన ఆ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ ట్రయల్‌ బౌట్‌ లో.. జరీన్‌కు షేక్‌హ్యాండ్, హగ్‌ నిరాకరించడంపై కోమ్, ‘ఇలాంటి స్వభావం ఉన్నవారు నాకు నచ్చరు‘ అన్నారు. ‘కానీ సెలక్షన్‌ న్యాయంగానే జరగాలి. అందుకే నేను పోటీ కోసం పట్టుపట్టాను‘ అని జరీన్‌. జరీన్‌ కరెక్ట్‌ అనిపిస్తోంది. అయితే కోమ్‌ కూడా డైరెక్ట్‌ ఎంట్రీకి పట్టుపట్టలేదు. బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయం అది. కోమ్‌ని ట్రయల్స్‌ లేకుండానే సెలెక్ట్‌ చేయాలని.

మరిన్ని వార్తలు