One Chip Challenge: స్పైసీ చిప్స్‌ తినకూడదా? చనిపోతారా..?

14 Sep, 2023 17:05 IST|Sakshi

చిన్నారుల దగ్గర నుంచి పెద్దలు వరకు సరదాగా కాలక్షేపంగా తినే చిరుతిండ్లలో చిప్స్‌ ఒకటి. అవంటే.. అందరూ ఇష్టంగా లాగించేస్తారు. అవి తినొద్దు! లివర్‌కి మంచిది కాదన్నా.. పిల్లలే కాదు పెద్దలు కూడా చిన్నపిల్లల్లా..ఒక్కసారి తింటే ఏం కాదులే అంటూ లాగించేస్తారు. అంతలా ప్రజలు ఈ చిప్స్‌ని ఇష్టంగా తింటుంటారు. ఇటీవల నెట్టింట రకరకాల ఛాలెంజ్‌లను చూస్తున్నాం. సెలబ్రెటీల దగ్గర నుంచి సామాన్యుల వరకు అందరూ ఈ ఛాలెంజ్‌లను చేసేందుకు తెగ ఉత్సాహం కనబరుస్తున్నారు కూడా. అవి మంచివి అయితే పర్లేదు. ప్రాణాంతకమైనవి అయితేనే సమస్య. ఇక్కడొక చిన్నారి కూడా అలాంటి ఛాలెంజ్‌ని తీసుకుని ప్రాణాలపైకి తెచ్చుకున్నాడు. ఆ చిన్నారి ఆ ఛాలెంజ్‌ని తీసుకున్నాక గానీ తెలియలేదు స్పైసీ చిప్స్‌ తింటే చనిపోతారని. వాట్‌? ఇది నిజమా? అని షాకవ్వకుండా. ఈ ఘటన యూఎస్‌లోని మసాచుసెట్స్‌లో జరిగింది. 

వివరాల్లోకెళ్తే..మాసాచుసెట్స్‌కి చెందిన హారస్‌ వోలోబా అనే 14 ఏళ్ల బాలుడు ఆన్‌లైన్‌ చక్కర్లు కొడుతున్న స్పైసీ చిప్స్‌ ఛాలెంజ్‌ని తీసుకున్నాడు. అది తిన్న కొద్దిగంటలకే తీవ్రమైన కడుపునొప్పితో గిలగిలలాడిపోయాడు. హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా.. ఫలితం శూన్యమే అయ్యింది. ఆస్పత్రికి వెళ్లాక ఆ బాలుడి పరిస్థతి మరింతగా విషమించి మృతి చెందాడు. అతను తీసుకున్న స్పైసీ ఫుడ్‌ ఛాలెంజ్‌లో తినాల్సిన చిప్స్‌ ప్రపంచంలోనే అత్యంత స్పైసీ చిప్స్‌ అట. దాని ప్యాకింగ్‌ కవర్‌పై కూడా అత్యంత ఘాటైనా మిరియాలతో చేసినవని గర్భిణీ స్త్రీలు, ఇతర సమస్యలున్న పెద్దలు వీటికి దూరంగా ఉండాలని ఓ హెచ్చరికి కూడా ఉంటుందట.

ఐతే ఆ బాలుడి కుటుంబ సభ్యులు మాత్రం ఈ చిప్స్‌ తిన్నాక మా అబ్బాయి అస్వస్థతకు గురై చనిపోయాడంటూ గొడవచేశారు. ఆ చిప్స్‌ని బ్యాన్‌ చేయాలని గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చారు కూడా. ఈ స్పైసీ చిప్స్‌కి సంబంధించి తొలి ప్రాణాంతక కేసు కూడా ఇదే. ఈ ఘటనతో అక్కడ కొన్ని పాఠశాల వద్ద ఈ చిప్స్‌ అమ్మకాలను బ్యాన్‌ చేశారు కూడా. ఈ స్పైసీ చిప్స్‌ ప్యాకెట్‌ కేవలం రూ.830/లకే మార్కెట్లో దొరుకుతుంది.

తాము ఇచ్చిన హెచ్చరికను పట్టించకుండా తినడం వల్లే ఇలా జరిగిందని ఆ ప్యాకెట్లు ఉత్పత్తి చేసే కంపెనీ వాదించడం గమనార్హం. ఇక అధ్యయనాల్లో కూడా అందులో వాడే ఘాటూ మిరియాల పొడి తీవ్రమైన గుండె సంబంధిత రుగ్మతలకు దారితీసే అవకాశం ఉందని తేలింది. ఇక ఆ బాలుడు చిప్స్‌ వల్లే చనిపోయాడన్నది అధికారికంగా నిర్థారణ కాలేదు.  పోస్ట్‌మార్టం తదనంతరం వాస్తవాలు తెలియాల్సి ఉంది. ఏదీఏమైనా ఇలాంటి జంక్‌ ఫుడ్స్‌ పిల్లలకు ఇచ్చేటప్పుడూ కాస్త పెద్దలు ఆలోచించటం మంచిది. ఇంట్లో తయారు చేసి ఇవ్వండి గానీ మార్కెట్లో దొరికే చిప్స్‌ జోలికి వెళ్లకపోతేనే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

(చదవండి: ఎంతపనైపాయే! పొరపాటున నాలుక కరుచుకుంది..అంతే ఊపిరాడక..)

మరిన్ని వార్తలు