డ్రాగన్‌ ప్రూట్‌ కన్నా అధిక పోషక విలువలు..

9 Jun, 2021 20:48 IST|Sakshi

బ్రహ్మజెముడు పండ్లకూ వాణిజ్య విలువ!

బ్రహ్మజెముడు పండ్లతో తాండ్ర తయారీపై ఎస్వీయూకి పేటెంట్‌

బంజరు, ఇసుక నేలల్లో నాటి వదిలేస్తే చాలు.. ఏటేటా పండ్ల దిగుబడి  

నిలువెల్లా ముళ్లుండే మొక్క బ్రహ్మజెముడు.. మెట్ట/ తీర ప్రాంతీయులకు తెలిసిన మొక్కే. బ్రహ్మజెముడు పండ్లు తినదగినవే అని కూడా తెలిసినా.. వీటికీ వాణిజ్యపరమైన విలువ ఉందని డా. చెన్నకేశవరెడ్డి పరిశోధనలు రుజువు చేశాయి. ఒకసారి నాటితే చాలు. తీవ్ర కరువొచ్చినా, తుపాన్లు వచ్చినా తట్టుకొని బతికి పండ్లను అందించే మొక్కలివి అంటున్నారాయన.  

వైఎస్సార్‌ జిల్లా కడప సమీపంలోని ఆలంఖాన్‌ పల్లెలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టిన చెన్నకేశవ రెడ్డి తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్‌లో ఆహార శుద్ధి సాంకేతికత విభాగంలో ఎమ్మెస్సీ చదివారు. ఆ తర్వాత అక్కడే పీహెచ్‌డీ కోర్సులో చేరి బ్రహ్మజెముడు (ఒసన్షియా ఫైకస్‌ ఇండికా) పండ్లతో వివిధ ఆహారోత్పత్తుల తయారీపై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేవీ సుచరిత పర్యవేక్షణలో పరిశోధనలు చేశారు. 


బ్రహ్మజెముడు పండ్ల గుజ్జుతో ప్రూట్‌ బార్‌ (తాండ్ర), బ్రహ్మజెముడు పండ్ల స్క్వాష్‌ (నీటిలో కలుపుకొని తాగడానికి వీలయ్యే గుజ్జు)లను ఫుడ్‌ సేఫ్టీ అథారిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా తయారు చేయటంపై విశేష పరిశోధనలు చేసి సఫలీకృతమయ్యారు. 2012లోనే వీటి తయారీ పద్ధతిపై పేటెంట్ల కోసం దరఖాస్తు చేశారు. ప్రూట్‌ బార్‌ (తాండ్ర) తయారీ పద్ధతిపై పేటెంట్‌ ఇటీవలే మంజూరైంది. స్క్వాష్‌పై పేటెంట్‌ రావాల్సి ఉంది. 

ఈ రెంటితోపాటు.. అత్యంత నాణ్యమైన ఇసుక ఉత్పత్తిపైన, ఆరోగ్యానికి హానికరం కాని హెర్బల్‌ ఆల్కహాల్‌ తయారీ పద్ధతిపైన కూడా పరిశోధనలు పూర్తిచేసి, పేటెంట్ల కోసం దరఖాస్తు చేశారు. 

పులివెందులలోని కాలేజ్‌ ఆఫ్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఏడేళ్లు పార్ట్‌టైమ్‌ టీచర్‌గా పనిచేసిన చెన్నకేశవరెడ్డి  2017లో పీహెచ్‌డీ  పూర్తి చేశారు. ప్రస్తుతం బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ మేనేజ్‌మెంట్‌ (కేంద్ర వాణిజ్య శాఖకు అనుబంధ సంస్థ)లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. 

బ్రహ్మజెముడు పండు ఎరుపు, గులాబి రంగులో ఉంటాయి. వాటితో జామ్స్, స్వాకష్, ఐస్‌క్రీమ్స్, జ్యూస్, జెల్లీలు తయారు చేసుకోవచ్చు.  పండు గింజల నుంచి నూనె కూడా తీయవచ్చు. ఈ మొక్కలో ఎలాంటి హానికర పదార్థాలు లేవని అమెరికన్‌ పుడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ధృవీకరించింది. వీటిని అమెరికన్లు అల్పాహారంగా తీసుకుంటారు.  

బ్రహ్మజెముడు పండు ఉత్పత్తులను ఆహార శుద్ధి పరిశ్రమల్లో ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. 

ఈ పండులో పోషక విలువతో పాటు ఔషధ గుణాలు ఉన్నాయని, కాలేయ వ్యాధులు, క్యాన్సర్‌ వ్యాధి నివారణకు ఇవి దోహదపతాయన్నారు. కార్బొహైడ్రేడ్లు, విటమిన్లు, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. ఇందులోని ఔషధ గుణాలు స్థూలకాయం, మధుమేహం, గ్యాస్ట్రిక్‌ సమస్యలను తగ్గిస్తాయి. 

అంగోలా, మెక్సికో, మొరాకో, సిసిలీ, పొర్చుగల్‌ దేశాల్లో ఈ మొక్కలను సాగు చేస్తున్నారు. మెక్సికోలో జన్యుపరంగా అభివృద్ధి చేసి ముళ్లు లేని బ్రహ్మజెముడు వంగడాన్ని రూపొందించి సాగు చేస్తున్నారు. సౌదీ అరేబియాలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో అనేక ఆహార పదార్థాలు రూపొందించి అందిస్తున్నారు. బీట్‌రూట్‌ అందించే పోషక విలువలను ఇది అందిస్తుంది. కరువు ప్రాంతమైన రాయలసీమలో పంట సాగు, లాభాల ఆర్జన అత్యంత కష్టతరం. ఇలాంటి నేలల్లో బ్రహ్మజెముడు లాంటి పంటల సాగు ద్వారా ఎలాంటి పెట్టుబడీ లేకుండా ఆదాయం పొందవచ్చన్నది డా. చెన్నకేశవరెడ్డి మాట. 
– బూచుపల్లి హరిమల్లికార్జున రెడ్డి, ఎస్వీయూ క్యాంపస్, తిరుపతి


ఎకరానికి 2 వేల ఆకులు నాటాలి!
బ్రహ్మజెముడు.. భూసారం లేని, ఇసుక నేలల్లో, అటవీ భూముల్లో తనంతట తానే పెరిగే కరువు నేలల మొక్క. ఎరువులు, పురుగుమందుల అవసరం లేదు. 2X2 మీటర్ల దూరంలో బోదెలపై నాటుకోవాలి. ఎకరానికి 2 వేల ఆకులు నాటాలి. మూడు ఆకులతో కూడిన కాండాన్ని కత్తిరించి.. కింది ఆకు నేలలోకి వెళ్లేలా నాటాలి. 

ఒక్కసారి నాటితే.. ఎన్నో ఏళ్లపాటు రైతుకు ఆదాయాన్నిచ్చే పంట బ్రహ్మజెముడు. తీవ్ర కరువొచ్చినా.. వరద వెల్లువైనా తట్టుకొని నిలబడగలగడం.. స్థిరంగా ఏడాదికోసారి పండ్ల దిగుబడినివ్వటం దీని విశిష్టత. 

ప్రత్యేకించి నీటి తడులు అవసరం లేదు. వర్షం పడినప్పుడు నీటిని పీల్చుకొని బ్రహ్మజెముడు మొక్క తన ఆకుల్లోనే నీటిని నిల్వ ఉంచుకుంటుంది. ఏ మొక్క ఆకుల్లోనైనా సూక్ష్మ పత్ర రంధ్రాలుంటాయి. ఈ పత్ర రంధ్రాల ద్వారా ఏ మొక్కయినా నీటి తేమను వాతావరణంలోకి వదులుతూ ఉంటుంది. అందుకే ఆ మొక్కలు బతకడానికి నీటి అవసరం ఉంటుంది. బ్రహ్మజెముడు అలా కాదు. పత్రరంధ్రాలు మూసుకుపోయి ఉంటాయి. కాబట్టి నీటి అవసరం కూడా ఈ మొక్కకు తక్కువగానే ఉంటుందని చెన్నకేశవరెడ్డి తెలిపారు. డ్రాగన్‌ ప్రూట్‌ కన్న అధిక పోషక విలువలు కల్గిన బ్రహ్మజెముడు పంటకు ఎలాంటి ఖర్చూ లేదన్నారు.

చిన్న రైతులకు ఉపయోగకరం
వాణిజ్య పంటల సాగుకు పెట్టుబడి అధికంగా పెట్టాలి. తగినంత నీటి వసతి కావాలి. ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయాలి. అయితే, బ్రహ్మజెముడు పంట సాగుకు ఇవేమీ అక్కర్లేదు. బంజరు లేదా ఎడారి భూముల్లోనూ బ్రహ్మజెముడును సాగు చేయొచ్చు. విత్తనాలు కూడా అవసరం లేదు. మొక్క (ఆకులు) భాగాలు తీసి పక్కన పాతితే ఈ చెట్లు పెరుగుతాయి. ప్రతి ఏటా మే–జూన్‌ నెలల్లో పండ్లు కోతకు వస్తాయి. ఒకసారి నాటితే దశాబ్దాల పాటు దిగుబడినిస్తాయి. వీటిని మెక్సికో తరహాలో జన్యుపరంగా అభివృద్ధి చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఎటువంటి పంటలకూ పనికిరాని బంజరు భూముల్లో వీటిని నాటాలి. ప్రతి ఏటా మంచి ఆదాయం వస్తుంది. చిన్న రైతులకు ఉపయోగకరం.  

– డాక్టర్‌ సంగటి చెన్నకేశవరెడ్డి (99856 63785), 
అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ మేనేజ్‌మెంట్, బెంగళూరు 

మరిన్ని వార్తలు