వారి మాట సలహా కాదు, శాసనం

25 Sep, 2020 11:26 IST|Sakshi

వాగ్భూషణం

గింజ రాతి మీద ఉంటే వర్షం పడ్డా మొలకెత్తదు. అది భూమిలో ఉంటే ఒక్క వానకే మొలకెత్తుతుంది. అలా అసలు మనిషికి ఉండాల్సిన ప్రథమ లక్షణం నేను అవతలి వాళ్ళు చెప్పిన మాట వింటాను, అది సహేతుకంగా ఉంటే, నాకు వృద్ధిని కల్పించేది అయితే తప్పకుండా పాటిస్తాననే గుణం ఉండాలి. కొందరి విషయంలో మాత్రం నీ బుద్ధితో విచారణ ఉండకూడదు. వారు నా మంచికి చెప్పారా, చెప్పలేదా అని నీ జీవితం మొత్తం మీద ఆలోచించాల్సిన అవసరం లేని వాళ్ళు ముగ్గురున్నారు. వారు ఎప్పుడు ఏం చెప్పినా నీ అభ్యున్నతి కోరి చెబుతారు తప్ప నిన్ను పాడుచేయడానికి వారి ప్రాణం పోయినా చెప్పరు. ఎవరా ముగ్గురు? తల్లి, తండ్రి, గురువు. అందుకే వాళ్ళ మాట శాసనమే తప్ప సలహా కాదు. దానిని చెవి ఒగ్గి వినగలగాలి. అలా వినని వాడిని ఉద్ధరించడం ఎవరికీ సాధ్యం కాదు.

శ్రీరామాయణంలో రావణాసురుడికి మొదట మారీచుడు చెప్పాడు..‘‘సులభాః పురుషా రాజన్‌ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య, వక్తా శ్రోతా చ దుర్లభః’’–అని. ఈ లోకంలో ఎవడు ఎలా పోతే మనకేం. ఏవో నాలుగు మాటలు పొగిడేస్తే గొడవ వదిలిపోతుంది. మనకేం కాదు. మనతో స్నేహంగానే ఉంటాడు. అయినా మనం చెబితే మాత్రం వాడు వింటాడా...వద్దు చెప్పొద్దు. వాడు ఎలా పాడయిపోతే మనకెందుకు, పొగిడేస్తే సరి... అని మాట్లాడేవాళ్లు ఈ లోకంలో కోటాను కోట్లమంది ఉంటారు రావణా ! నువ్వు తప్పు చేస్తున్నా సరే, చాలా మంచి మార్గం.. అలాగే ఉండండి... అని చెప్పేవాళ్ళు దొరుకుతారు. నీ అభ్యున్నతిని కోరి మాట కఠినంగా అనిపించినా నీ క్షేమం కోసం మాట్లాడేవాడు దొరకనే దొరకడు. ఒకవేళ దొరికినా వినేవాడు ఉండడు. 

మారీచుడు అంత చెప్పినా వినలేదు, తోడబుట్టినవాడు కుంభకర్ణుడు చెప్పాడు, విభీషణుడు, సుగ్రీవుడు, తల్లి కైకసి, మంత్రులు చెప్పారు. సీతమ్మ తల్లి చెప్పింది –‘‘మాట విను. నీ వారియందు మనసు పెట్టుకో. ధర్మమయి పోతుంది. పరకాంతలందు మనసు ఉంచకు. పట్టి కుదిపేస్తుంది.’ అని చెప్పింది ... వినలేదు.. చివరకు యుద్ధభూమిలో నిట్టనిలువునా ఏ రథం కూడా లేకుండా నిలబడిపోయిన రావణుడిని చూసి–‘‘పో.. అంతఃపురానికి .. రేపు రా’ అన్నాడు రామచంద్ర మూర్తి. ఆ ఒక్కసారయినా మనసు మార్చుకుని మళ్ళీ తన తప్పు తాను తెలుసుకుని మంచి మాటలు గుర్తు చేసుకుని ఉండి ఉంటే... ఎలా ఉండేదో.. కానీ రావణుడు వినలేదు. ‘‘నా దగ్గరకొచ్చి ‘రామా! నేను నీవాడను’అని పడిపతే రక్షిస్తాను’’ అన్నాడు రాముడు. ‘నేనెన్నటికీ వినను’ అన్నందుకు పర్యవసానం ఏమయిందో తెలుసు కదా!. చివరకు పది తలలు తెగిపడిపోయాయి. కట్టుకున్న భార్య మండోదరి వచ్చి ‘‘ఓరి పిచ్చివాడా ! నిన్ను రామచంద్రమూర్తి సంహరించాడని లోకం అనుకుంటున్నది. కానీ నిన్ను సంహరించినవాడు రామచంద్రమూర్తి కాదు... నీ ఇంద్రియ లౌల్యం. మాట వినని తనమే నిన్ను నిలువునా చంపేసింది’’ అన్నది.

నిజంగా మన మంచిని కోరి పరుషంగా ఉన్నా... అంత ధైర్యంగా చెప్పగలిగిన వాడు దొరికితే... వాడి ఆర్తిని అర్థం చేసుకుని వినగలిగినవాడు దొరికితే అది లోకకళ్యాణమే. కృష్ణుడు చెప్పాడు–అర్జునుడు విన్నాడు–భగవద్గీత లోకానికి అందింది. పరీక్షిత్తు అడిగాడు–శుకుడు చెప్పాడు–భాగవతం లోకానికి పనికొచ్చింది. యుద్ధభూమిలో అగస్త్యుడు చెప్పాడు– రాముడు విన్నాడు–ఆదిత్య హృదయం సకల భక్తజనావళిని ఆదుకుంటున్నది. ఇవన్నీ ఎప్పుడు.. అసలు వినేవాడు ఒకడుంటే కదూ..!!!
 
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా