ధర్మ సందేహం

25 Sep, 2020 11:02 IST|Sakshi

నాకు రుద్ర నమకం, చమకం వంటివి రావు. రోజూ ఓ వెండి శివలింగాన్ని పూజిస్తుంటాను. అయితే రుద్రంతో తప్ప శివుని పూజించకూడదని, అసలు శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోరాదని కొందరంటున్నారు. నిజమేనా?
– పిచ్చిక జ్ఞాన సుబ్రహ్మణ్యం, కాకినాడ

మీరు విన్నవి సరైనవి కావు. శివలింగాన్ని ఇంటిలో ఉంచుకుని పూజించడం ఐశ్వర్యకరం. రుద్ర నమకాదులతో అభిషేకించడం, పూజించడం మంచిది. అలాగని రుద్రనమకాదులతోనే పూజించాలన్న నిబంధన ఏమీ లేదు. శివనామాలు చెప్పుకుంటూ అభిషేకించవచ్చు. అష్టోత్తర శతనామాలతోనూ అభిషేకించవచ్చు. ఏదీ రానప్పుడు ‘శివాయ నమః అనో, నమఃశివాయ అనో పూజించడం కూడా సత్ఫలితాలనే ఇస్తుంది. బోళాశంకరుడు, భక్తవశంకరుడు, భక్త సులభుడు అయిన శివుడు అభిషేక ప్రియుడు. తన భక్తులు తనను నోరారా నమశ్శివాయ అని పూజిస్తే చాలు... ప్రసన్నుడవుతాడు. నిత్యం ఇంట్లో శివార్చన జరగడం మంచిదే. శివపూజ అందరూ చేయవచ్చు. అయితే బాణలింగం, స్ఫటికలింగం, సాలగ్రామం వంటి వాటికే ఎక్కువ నియమాలు, విధులూ ఉన్నాయి. అవి యోగ్యులైన గురువుల సాయంతోనే స్వీకరించాలి. అవి లేకున్నా వెండి లింగాన్ని అర్చించడం మంచిదే.     
– బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

♦ప్రశ్నోత్తర భారతం..
లక్క ఇంటి కథ
1. ఎవరు యువరాజు అయ్యారు?
2. పాండవులను చూసిన దుర్యోధనుడు ఏ విధంగా ఉన్నాడు?
3. దుర్యోధనుడు ఏమని ఆలోచన చేశాడు?
4. తన దురాలోచన గురించి ఎవరెవరిని సంప్రదించాడు?
5. శకుని ముఖ్యమంత్రి ఎవరు?
6. కణికుడు ఏం చేస్తాడు?
– నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ

జవాబులు:
1. ధర్మరాజు యువరాజు అయ్యాడు. సార్వభౌముని గౌరవం పొందాడు. పాండవులు పరాక్రమవంతులు అయ్యారు.
2. దుర్యోధనుడు సహించలేకపోయాడు. అతనిలో అశాంతి ప్రవేశించింది. నిదుర పట్టలేదు.
3.  పాండవులను హతమార్చాలనుకున్నాడు. అందుకోసం పన్నాగాలను గురించి ఆలోచించాడు.
4. శకుని. కర్ణుడు  మొదలైన వారిని సంప్రదించాడు.
5. కణికుడు
6. దుర్యోధనుడికి రాజకీయ ఉపాయాలను బోధిస్తాడు.

♦అమృత సూక్తులు
కొంచెం తెలిసి ఉండి కూడా అన్నీ తెలిసినట్లు నటించడం నీచుల లక్షణం 
సంతోషం మంచి నుంచి కలుగుతుంది. చెడు నుంచి కలిగేది పైకి సంతోషంగా అనిపించినను అనంతరం అదిదుఃఖంగానే మారుతుంది. 
ప్రేమ వల్ల కోపాన్ని, మంచి వల్ల చెడును, ధర్మం చేత లోభాన్ని, విచారణ చేత మోహాన్ని, సత్యం చేత అబద్ధాన్నీ జయించాలి. 
సజ్జన సహవాసమే ఎల్లప్పుడూ చేయవలెను. ఒకవేళ సజ్జన సహవాసం లభించని యెడల ఎటువంటి సహవాసమూ చేయకుండుట మేలు. 
స్వల్పమైన ముత్యాల కోసం మనిషి ఎటువంటి కష్టానికైనా ఓర్చి ప్రాణహానికైనా తెగించి ఘోరమైన సముద్రంలో మునిగి వాటిని పొందుతాడు. కాని అనంతమైన, అనల్పమైన భగవదనుగ్రహం కోసం ఏ కష్టాలూ పడనవసరం లేదు.  కేవలం భక్తిశ్రద్ధలు, సాటి మనుషుల యెడల ప్రేమ, పరోపకార గుణం కలిగి ఉంటే చాలు. 

మరిన్ని వార్తలు