Brain Stroke: పురుషులకే స్ట్రోక్‌ రిస్క్‌ ఎక్కువా? అపోహలు- వాస్తవాలు.. ఈ ఆహారం తీసుకున్నారంటే..

29 Oct, 2022 11:08 IST|Sakshi

World Brain Stroke Day 2022: మెదుడుకు ఆక్సిజన్‌, పోషకాలను తీసుకువెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం లేదంటే మూసుకుపోవడం వల్ల రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో మెదడులోని ఆ భాగంలో కణ మరణానికి దారి తీసి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. 

ఒక్కోసారి ఇది మరణానికి దారి తీయవచ్చు. సాధారణంగా ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండానే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. అక్టోబరు 29న వరల్డ్‌ స్ట్రోక్‌ డే. ఈ ఏడాది.. ప్రాణాన్ని కాపాడుకోవడంలో ప్రతి నిమిషం విలువైనదే అనే థీమ్‌తో(‘Minutes can save lives’ #Precioustime) అవగాహన కల్పిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో.. పక్షవాతానికి దారితీసే పరిస్థితులు, దీని గురించి ప్రజల్లో ఉన్న అపోహలు, వాస్తవాలు, స్ట్రోక్‌కు గురైన పేషెంట్లు తీసుకోవాల్సిన ఆహారం గురించి ఈ కథనం.

బ్రెయిన్‌ స్ట్రోక్‌- రిస్క్‌ ఫ్యాక్టర్స్‌
►ఒబేసిటి
►జన్యుపరమైన లోపాల వల్ల స్ట్రోక్‌ వచ్చే అవకాశం
►అధిక రక్తపోటు
►శరీరంలో కొలెస్ట్రాల్‌ పాళ్లు ఎక్కువగా ఉండటం
►మధుమేహం
►ఆహారపుటలవాట్లు, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం
►పొగ తాగే అలవాటు
►శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం
►మోతాదుకు మించి ఆల్కహాల్‌ సేవించడం
►జీవనశైలి

నివారణ ఎలా?
►జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా బ్రెయిన్‌ స్ట్రోక్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వాటిలో కొన్ని..
►పొగతాగే అలవాటు మానుకోవడం
►ఆల్కహాల్‌ మానేయడం
►రోజూ కాసేపు వ్యాయామం చేయడం
►బరువు పెరగకుండా ఉండటం
►సమతుల్యమైన ఆహారం తీసుకోవడం

అపోహలు- వాస్తవాలు
అపోహ: 1. కేవలం నడివయస్కులు, వృద్ధులకు మాత్రమే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంటుంది.
వాస్తవం: వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం రెట్టింపవుతుంది. ఒబేసిటీ, అధిక రక్తపోటుతో బాధ పడుతున్న 15- 65 ఏళ్ల ఏజ్‌ గ్రూప్‌లో ఎవరైనా దీని బారిన పడే అవకాశం ఉంది.

అపోహ 2. బ్రెయిన్‌ స్ట్రోక్‌ చాలా అరుదుగా వస్తుంది.
వాస్తవం: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతున్న వాళ్ల సంఖ్య దాదాపు 17 మిలియన్లు. అంతేకాదు ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న ఆరోగ్య సమస్యల్లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ది రెండో స్థానం.

అపోహ 3: బ్రెయిన్‌ స్ట్రోక్‌ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
వాస్తవం: మెదుడుకు ఆక్సీజన్‌, పోషకాలను తీసుకువెళ్లే రక్తనాళాలు చిట్లిపోవడం, రక్తప్రసణకు అంతరాయం ఏర్పడటం వల్ల.. రక్తం గడ్డకట్టుకుపోయి మెదడులోని కణాలు చచ్చుబడిపోతాయి.

అపోహ 4: పురుషులకే బ్రెయిన్‌ స్ట్రోక్‌ రిస్క్‌ ఎక్కువ
వాస్తవం: పురుషులతో పోలిస్తే మహిళలే బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువని నిపుణులు అంటున్నారు. హార్మోన్ల అసమతుల్యం కారణంగా తీసుకునే థెరపీలు, గర్భనిరోధక మాత్రలు వాడటం, గర్భం ధరించిన సమయంలో మధుమేహం బారిన పడటం వంటివి ఇందుకు దారి తీసే అంతర్లీన కారణాలుగా చెప్పవచ్చు.

అపోహ 5: ఒక్కసారి బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైతే జీవితాంతం జీవచ్ఛవంలా ఉండాల్సిందే!
వాస్తవం: నేషనల్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌ నివేదిక ప్రకారం బ్రెయిన్‌ స్ట్రోక్‌ బారిన పడిన వారిలో 10 శాతం మంది పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుంది. 25 శాతం మంది బాధితులు పాక్షిక ఉపశమనం పొందుతున్నారు. కొద్దిమంది మాత్రమే జీవితాంతం ఈ సమస్య వల్ల బాధపడుతున్నారు. అయితే, వారు కూడా సరైన థెరపీ తీసుకోవడం ద్వారా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.

ఈ ఆహారం తీసుకోవడం మేలు
పక్షవాతం బారిన పడిన వాళ్లు డైట్‌లో ఈ ఆహార పదార్థాలు చేర్చుకోవడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
►సాల్మన్‌ ఫిష్‌, అవిసె గింజలు(ఫ్లాక్స్‌ సీడ్స్‌), విటమిన్‌ ఈ కలిగి ఉండే విత్తనాలు, గింజలు, అవకాడోలు, కోడిగుడ్లు, ఆలివ్‌ ఆయిల్‌ వాడకం, క్వినోవా(చిరు ధాన్యం), కాల్షియం, ప్రొటిన్‌ అత్యధికంగా కలిగి ఉండే గ్రీక్‌ యోగర్ట్‌, గ్రీన్‌ టీ.

ఈ పండ్ల వల్ల
►వీటితో పాటు బ్లూబెర్రీస్‌, దానిమ్మ పండ్లు, విటమిన్‌ సీ కలిగి ఉండే పండ్లు, ఆపిల్స్‌, టొమాటోలు వంటివి ఆహారంలో చేర్చుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. సాధారణంగా పక్షవాతం వచ్చిన నాలుగున్నర గంటల్లోపు ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకగలిగితే  ప్రయోజనకరంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్న మాట.
నోట్‌: ఆరోగ్యం గురించి అవగాహన కొరకు మాత్రమే ఈ కథనం.

చదవండి: World Stroke Day: మెదడుకు ‘పోటు’.. బ్రెయిన్‌ స్ట్రోక్‌ నుంచి తప్పించుకోండి ఇలా.. 
Custard Apple: సీజనల్‌ ఫ్రూట్‌ సీతాఫలం.. తరచూ తింటున్నారా? ఇందులోని బయోయాక్టివ్‌ అణువుల వల్ల

మరిన్ని వార్తలు