మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలంటే..

4 Apr, 2022 08:35 IST|Sakshi

ఇది కథ కాదు  

మనిషికి ఆధ్యాత్మిక చింతన కలగాలంటే, మనసు నిర్మలంగా ఉండాలి. ఐహిక చింతన ఉన్నంతకాలం, ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ. ఒక చీమ తన ఆహార అన్వేషణలో పొరపాటున ఒక ఉప్పు సీసాలో దూరింది. ఇంతలో ఆ సీసా మూత వేసివేయడం జరిగింది. అలా ఆ చీమ అందులో బందీ అయిపోయింది. తినడానికి ఏమీ లేక అప్పుడప్పుడు ఆ ఉప్పునే తింటూ కాలక్షేపం చేయసాగింది. మరొక చీమ పంచదార డబ్బాలో చేరి అందులో పంచదారను తింటూ ఎంతో ఆనందంగా జీవించసాగింది. 

అదృష్టవశాత్తూ ఒకసారి ఉప్పు సీసా మూత తీయడం జరిగింది. వెంటనే, ‘బతికేనురా జీవుడా’ అనుకుంటూ అందులోని చీమ బయటకు వచ్చేసింది. కానీ, సరైన ఆహారం లేక ఆ చీమ చిక్కి శల్యమైపోయింది. ఇంతలో అది పంచదార డబ్బాలో ఉన్న చీమ కంటబడింది. వెంటనే ఆ చీమ ‘ఏం మిత్రమా అలా అయిపోయేవు? క్షేమమేనా?’ అని అడిగింది. ‘ఏం క్షేమం? అంతా క్షామమే’ అంటూ మొదటి చీమ తన గోడునంతా వెళ్ళబోసుకుంది. అది వినగానే రెండవ చీమ దానిని తన నివాసమైన పంచదార డబ్బాలోకి తీసుకెళ్ళి పంచదారను తినమంది. చిత్రం. ఆ మొదటి చీమ అతి మధురమైన పంచదారనే ‘వెగటుగా ఉంది’ అంది. 

రెండవ చీమకు ఆశ్చర్యమేసింది. కారణం అంతు బట్టలేదు. ఎందుకైనా మంచిదని మొదటి చీమ నోరు తెరిచి అందులో ఉన్న ఉప్పు కణాలను తీసేసింది. అంతే! అంతవరకూ వెగటుగా అనిపించిన పంచదార అప్పుడు తియ్యగా అనిపించింది ఆ మొదటి చీమకు. అలాగే మనిషిలో పంచవికారాలు ఉన్నంతకాలం ఆధ్యాత్మిక చింతన వెగటుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం వాటిని విడనాడతామో అప్పుడే మనం ఆధ్యాత్మిక చింతనలోని అఖండ ఆనందాన్ని అనుభవించగలం.  – బ్రహ్మాకుమార్‌ రాజేష్‌  

మరిన్ని వార్తలు