బ్రెడ్‌ పిజ్జా ఎలా తయారు చేయాలో​ తెలుసా?

1 Aug, 2021 12:11 IST|Sakshi

బ్రెడ్‌ పిజ్జా
కావలసినవి: బ్రెడ్‌ స్లైసెస్‌ – 6, టొమాటో సాస్‌ – పావు కప్పు, చిల్లీ సాస్‌ – 1 టీ స్పూన్, మిరప కారం – అర టీ స్పూన్‌, గరం మసాలా – అర టీ స్పూన్‌, క్యాప్సికమ్, టొమాటో, ఉల్లిపాయ – ఒక్కొక్కటి చొప్పున, స్వీట్‌ కార్న్‌ – 2 టేబుల్‌ స్పూన్లు (ఉడికించినవి), మొజరెల్లా చీజ్‌ తురుము – 2 టేబుల్‌ స్పూన్లు, బటర్‌ – సరిపడా,  ఆలివ్‌ ముక్కలు – కొన్ని

తయారీ: ముందుగా టొమాటో సాస్‌లో చిల్లీ సాస్, మిరప కారం,  గరం మసాలా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ప్రతి బ్రెడ్‌ స్లైస్‌ మీద ఒక్కో స్పూన్‌ టొమాటో సాస్‌ మిశ్రమాన్ని రాయాలి. వాటిపైన కొద్దికొద్దిగా క్యాప్సికమ్‌ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్‌ కార్న్‌ వేసుకోవాలి. పైన మొత్తం చీజ్‌ తురుముతో ఫిల్‌ చేసుకుని.. పైన ఆలివ్‌ ముక్కలు వేసుకోవాలి. అనంతరం కళాయిలో కొద్దిగా బటర్‌ కరిగించి దోరగా 2 నిమిషాల పాటు మూత పెట్టి బేక్‌ చేసుకోవాలి.

పాస్తా– చికెన్‌ పకోడా
కావలసినవి:  బోన్‌లెస్‌ చికెన్‌ – పావు కప్పు (క్లీన్‌ చేసి, ఉడికించి, తురుము చేసుకుని పెట్టుకోవాలి), పాస్తా – 1 కప్పు (ఉడికించినది), టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – 4 టేబుల్‌ స్పూన్లు చొప్పున (చిన్నగా కట్‌ చేసుకోవాలి), కొత్తిమీర తురుము – 1 టేబుల్‌ స్పూన్, జీలకర్ర, ధనియాల పొడి – 1 టీ స్పూన్‌ చొప్పున, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, చిల్లీ సాస్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, నీళ్లు – సరిపడా, శనగపిండి, బియ్యప్పిండి – పావు కప్పు చొప్పున, నూనె – డీప్‌ ఫ్రైకి చాలినంత

తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో పాస్తా, చికెన్‌ తురుము, టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, జీలకర్ర, ధనియాల పొడి, కారం, తగినంత ఉప్పు, శనగపిండి, బియ్యప్పిండి వేసుకుని నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. అందులో చిల్లీ సాస్‌ వేసుకుని మరోసారి కలుపుకుని.. నూనెలో పకోడాలా వేసుకుని దోరగా వేయించుకోవాలి.

కాజున్‌ స్పైసీ పొటాటోస్‌
కావలసినవి:  బేబీ పొటాటో – 20 (మెత్తగా ఉడికించుకుని, చల్లారాక ఒక్కో పొటాటోను వడ మాదిరి ఒకటే సారి చేత్తో ఒత్తాలి), మాయొనైజ్‌(మార్కెట్‌లో దొరుకుతుంది) – 3/4 కప్పు, టొమాటో సాస్‌ – 1 టేబుల్‌ స్పూన్‌, తేనె, ఆనియన్‌ పౌడర్, గార్లిక్‌ పౌడర్, డ్రై థైమ్, ఒరెగానో  – 1 టీ స్పూన్‌ చొప్పున, మిరప కారం – ఒకటిన్నర టీ స్పూన్‌+గార్నిష్‌కి  కూడా
మిరియాల పొడి – అర టీ స్పూన్, పాలు – 3 టేబుల్‌ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 3 టేబుల్‌ స్పూన్లు, మైదా పిండి – 2 టేబుల్‌ స్పూన్లు, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, కొత్తిమీర తురుము – గార్నిష్‌కి

తయారీ: ముందుగా ఒక చిన్న బౌల్‌లో మొక్కజొన్న పిండి, మైదా పిండి, కొద్దిగా ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో వడలా ఒత్తిన ఒక్కో పొటాటో ముంచి, బాగా పట్టించి నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం.. మాయొనైజ్, టొమాటో సాస్, తేనె, ఆనియన్‌ పౌడర్, గార్లిక్‌ పౌడర్, డ్రై థైమ్, ఒరెగానో, మిరప కారం, మిరియాల పొడి, పాలు, ఉప్పు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుని ఆ మొత్తం మిశ్రమాన్ని వేయించిన పొటాటో వడలపై వేసుకుని సర్వ్‌ చేసుకునే ముందు.. కొద్దిగా మిరప కారం, కొత్తిమీర తురుముతో గార్నిష్‌ చేసుకుంటే సరిపోతుంది.

సేకరణ:  సంహిత నిమ్మన 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు