Breast Feeding: తల్లిలో బిడ్డకు తగినన్ని పాలు పడాలంటే...? 

24 Apr, 2022 13:46 IST|Sakshi

కొత్తగా అమ్మగా మారిన తల్లిలో తగినన్ని పాలు పడకపోతే ఆమె తల్లడిల్లిపోతుంది. ఇలాంటివారు చిన్నారికి సరిపోయినంతగా పాలు పడటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీంతో ఆమె ఆరోగ్యం బాగుపడటంతో పాటు, బిడ్డకూ తగినన్ని పాలు సమకూరతాయి. కొత్తగా తల్లి అయిన మహిళలు తమ ఆహారంలో పాలు, పెరుగు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, నీళ్లు తప్పనిసరిగా తీసుకోవాలి. కొత్త తల్లులు, అలాగే చాలామంది ఇళ్లలోని పెద్దవాళ్లలో ఓ అపోహ ఉంటుంది. సిజేరియన్‌ సహాయంతో బిడ్డను తీసిన మహిళల్లో, ఆ కుట్లు చీము పడతాయనే అపోహతో... వారికి  పప్పుధాన్యాలు ఇవ్వరు. అలాగే ఒంటికి నీరు పడుతుందనే అపప్రధ తో ద్రవపదార్థాలనూ, బిడ్డకు జలుబు చేస్తుందనే అభిప్రాయంతో పండ్లను తిననివ్వరు. దాంతో తల్లికి పాలు సరిగ్గా పడవు సరికదా... ఆమెకు అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశమూ ఉంది. 

ఇక కొందరు తల్లుల్లో తగినన్ని పాలు ఊరకపోవడంతో... బిడ్డకు సరిపడినన్ని పాలు అందించడం కోసం వెంటనే పోతపాలను అలవాటు చేస్తారు. పోతపాలు రుచిగా ఉండటంతో బిడ్డ వాటికి అలవాటు పడటం చాలా సాధారణం. అటు తర్వాత చిన్నారులు తల్లి దగ్గర తాగడానికి ఇష్టపడరు. దాంతో బిడ్డ పాలు తగడం తగ్గించడంతో తల్లి దగ్గర తగినన్ని పాలు ఉత్పత్తి కావడం తగ్గిపోతుంది. ఇలా పాలు ఊరడం తగ్గిపోడానికి ఇది కూడా ఒక కారణమే. బిడ్డకు తల్లిదగ్గరి పాలు సరిపోతున్నాయా లేదా అని తెలుసుకోడానికి ఓ మార్గం ఉంది.

తాగిన తర్వాత బిడ్డ... రెండు నుంచి మూడు గంటల పాటు నిద్రపోతున్నా, రోజు మొత్తంలో ఆరుసార్ల కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తున్నా,  వయసుకు తగినట్లు బరువు పెరుగుతున్నా... తల్లి పాలు బిడ్డకు సరిపోతున్నట్లు లెక్క. ఒకవేళ నిజంగానే అమ్మ దగ్గర బిడ్డకు సరిపడినన్ని పాలు పడనట్లయితే... తల్లి తన ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల పోషకాలు అందేలా మంచి బలవర్థకమైన ఆహారంతోపాటు... అందులో మరీ ముఖ్యంగా నువ్వులు, వెల్లుల్లి, పాలు, కోడిగుడ్లు, కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే  మంచినీళ్లు కూడా ఎక్కువగా తాగేలా చూడాలి. ఆ తర్వాత కూడా బిడ్డకు ఇంకా పాలు సరిపోక పోయినట్లయితే డాక్టర్‌ సలహా తీసుకోవాలి. 

మరిన్ని వార్తలు