బుద్ధిలేని పెళ్లికొడుకా... ఈ పెళ్లి నాకొద్దు

10 Jun, 2021 01:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

1980–90ల కాలంలో పెళ్లిమంటపంలో ‘ఆపండి’ అన్న కేక వినపడితే వధువు తరఫువారు అదిరిపోయేవారు– ఎక్కడ పెళ్లి ఆగిపోతుందోనని.ఇప్పుడు రోజులు మారాయి. ‘ఆపండి’ అన్న కేక వధువే వేస్తోంది. తనకు తాళి కట్టబోతున్నవాడు బుద్ధిలేని వాడని చివరి నిమిషంలో తెలుసుకున్నా నిర్మొహమాటంగా పెళ్లి కేన్సిల్‌ చేసేస్తోంది. రెండో ఎక్కం కూడా రానివాణ్ణిచ్చి చేస్తారా అని ఒక పెళ్లికూతురు, తాగి వచ్చినందుకు ఒక పెళ్లికూతురు, గుట్కా తిన్నందుకు ఒక పెళ్లికూతురు ఆ పెళ్లికొడుకులను పెళ్లి మంటపాల్లోనే రిజెక్ట్‌ చేశారు. దేశంలో పెళ్లికూతుళ్లు చేస్తున్న ఈ హెచ్చరిక పెళ్లికొడుకులకు ఏం పాఠం చెబుతోంది?

ఉత్తరప్రదేశ్‌లో స్త్రీల వెనుకబాటుతనం గురించి కథనాలు వింటూ ఉంటాం. కాని ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల పెళ్లికూతుళ్లు ఏం చేశారో చూడండి.
పెళ్లి అంటే మగాడు ఒక సొంత సంస్థను స్థాపించుకుంటూ ఉన్నట్టు, దానికి అతడు యజమాని కాబోతున్నట్టు, తన కింద ఒక ఉద్యోగిని భార్య పేరుతో తీసుకుంటున్నట్టు భావించే పెళ్లికొడుకులు ఇంకా ఉన్నట్టయితే వారికి కాలం చెల్లిందని ఈ ఉదంతాలు చెబుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు అమ్మాయిలు అక్కడి అబ్బాయిల వైఖరి, కుసంస్కారం, వ్యక్తిత్వాలను ఈసడించుకుంటున్నారని అర్థమవుతూ ఉంది. ‘ఎవరో ఒక అయ్య నన్ను కరుణిస్తే చాలు’ అని యువతులు అనుకునే రోజులు పూర్తిగా పోయాయి. ఒక పరస్పర గౌరవ ప్రజాస్వామిక స్థాయిలో ఇరువురూ జీవితం మొదలెట్టాలని యువతులు అనుకుంటున్నారు. దాని ప్రతిఫలమే ఈ ఉదంతాలు.

డిమాండ్లు అదుపులో
పెళ్లి అంటే డిమాండ్లు చేసే స్థాయిలో మగపెళ్లి వారు, డిమాండ్లు నెరవేర్చే ఆగత్యంలో ఆడపెళ్లివారు ఉన్నట్టు భావించే రోజులు కూడా ఇక మీదట పెద్దగా చెల్లుబాటయ్యేలా లేవు. ‘ఎవరి కోసం’ అని మగపెళ్లివారు అనుకుంటే ‘నువ్వు తప్ప గతి లేక మాత్రం కాదు. నువ్వు కాకపోతే నీ కంటే మెరుగైనవాడు మరొకరు దొరుకుతాడు’ అని వధువులు నిర్మొహమాటంగా మెడలోని దండ తీసి అవతలికి కొడుతున్నారు. బెంగళూరులో ఒక పెళ్లిలో మగపెళ్లివారు ‘మటన్‌ బిరియానీకి ఒప్పుకుని విందులో చికెన్‌ బిరియానీ పెడతారా’ అని అడిగినందుకు పెళ్లికూతురు పెళ్లి కేన్సిల్‌ చేసేసింది. గత సంవత్సరం ఒరిస్సాలోని కటక్‌ జిల్లాలో మగపెళ్లి వారు తమకు తగినంత మాంసం కూర పంపలేదని పేచీకి దిగారు. ఆడపెళ్లివారికి ఇది చాలా ఇబ్బంది కలిగించింది. పెళ్లికూతురు పెళ్లి కేన్సిల్‌ చేసి మగపెళ్లివారికి ఇక ఏ కూరా పెట్టేది లేదని తెగించి చెప్పింది.

అంతా అర్థమయ్యి
ఈ దేశంలో ‘పెళ్లి’ అనే వ్యవస్థ ఎలా పని చేస్తుంది... అందులో స్త్రీలు ఎంత శ్రమ చేయాలి... ఎంత పరిమితుల్లో ఉండాలి... ఎంత స్వీయ జీవితాన్ని కోల్పోవాలి... ఇవన్నీ గతంలో ఆడపిల్లలు ఒక తప్పనిసరి జీవితభాగంగా భావించి చేసేవారు. ఇప్పటి యువతులు అవన్నీ అర్థం చేసుకుని వాటిని తాము భరించడానికి సిద్ధంగా ఉన్నా కాబోయే భర్త, అతని కుటుంబం తనకూ తన కుటుంబానికి ఇచ్చే విలువ, గౌరవం గురించి పర్టిక్యులర్‌గా ఉన్నారు. ‘నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని వినక తప్పదు’ అని నేటి యువతులు చాలా గట్టిగా చెబుతున్నారు. ‘ఆమె అభిప్రాయాలు నేను వినాలట’ అని తల ఎగరేసేవారు కొన్నాళ్లు సంబంధాలు రిజెక్ట్‌ చేసుకుంటూ పోయి ఆ తర్వాత పెళ్లి కాకుండా మిగులుతున్న ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.

నీ ఇష్టం కాదు
‘నేను తాగుతాను. తిరుగుతాను. ఇల్లు పట్టించుకోకుండా ఉంటాను. సమయానికి ఇంత జీతం తెచ్చి మొహాన కొడతాను’ అనే భావనతో అబ్బాయిలు ఉండి అలాంటి జీవితంతో పెళ్లిని ఆలోచిస్తూ ఉంటే వారికి గడ్డుకాలం వచ్చినట్టేనని అర్థం చేసుకోవాలి. ‘నో’ చెప్పే యువతుల కాలం ఇది. పెళ్లిపీటల మీద ‘నో’ చెప్పించుకునే విధంగా నా వ్యవహార శైలి ఉందా అని ఆలోచించుకోక తప్పని ఈ కాలాన్ని వారు స్వీకరిస్తారనే ఆశిద్దాం.
 

పెళ్లికూతురు – 1: జూన్‌ ఐదున ఉత్తరప్రదేశ్‌లోని బాలియా ప్రాంతంలోని మిశ్రోలి అనే చిన్న పల్లెలో పెళ్లి. అంతా సజావుగానే ఉంది. పెళ్లికొడుకు ఊరేగింపు కల్యాణమంటపానికి చేరుకుంది. పెళ్లికూతురు పెళ్లికొడుకును గమనించింది. పెళ్లికొడుకు గుట్కా తింటున్నాడు. మరి కాసేపట్లో పెళ్లి ఉంటే గుట్కా తింటూ వచ్చిన పెళ్లికొడుకును ఏం చేయాలి? ఒకటి... అది మర్యాద కాదు. రెండు... అది ఎంత వ్యసనం కాకపోతే తింటాడు. ‘నాకీ పెళ్లి వొద్దు’ అని పెళ్లికూతురు అడ్డం తిరుక్కుంది. ఇరుపక్షాలు ఆమె వాదనకు ముందు హతాశులైనా తుదకు అంగీకరించారు. పెళ్లి ఆగిపోయింది. ఇచ్చిపుచ్చుకున్న వన్నీ తిరిగి ఇచ్చి పుచ్చుకున్నారు.

పెళ్లికూతురు – 2: మే రెండోవారంలో ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో ధూమ్‌ధామ్‌గా పెళ్లి. వరుడు భారీ ఊరేగింపుతో కల్యాణమంటపానికి చేరుకున్నాడు. ముహూర్తానికి ఇంకా టైముంది. పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇరు పక్షాల బంధువులు, ఊరి పెద్దలు అందరూ పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. హటాత్తుగా పెళ్లికూతురు ‘రెండో ఎక్కం చెప్పు’ అని పెళ్లికొడుకును అడిగింది. అంతా నిశ్శబ్దం ఆవరించింది. పెళ్లికొడుకు రెండో ఎక్కం చెప్పలేకపోయాడు. పెళ్లికూతురు లేచి నిలబడి పెళ్లికొడుకు తరఫు వాళ్లతో ‘ఇక ఇళ్లకు పోండి. ఈ పెళ్లి జరగదు’ అంది. ఇరుపక్షాల వాళ్లు చాలా చెప్పి చూశారు. పెళ్లికూతురు వింటేనా?

పెళ్లికూతురు – 3: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో తిక్రీ అనే గ్రామంలో జూన్‌ 5న పెళ్లి. వధువు రైతు కూతురు. వరుడు, అతని బంధువులు ఊరేగింపు గా వచ్చారు. అయితే అంతా తాగి ఉన్నారు. పెళ్లికూతురు తరఫు వాళ్లు అది గమనించి నొసలు చిట్లించినా సరేలే అని ఊరుకున్నారు. అయితే ‘వరమాల’ వేయించుకునే సమయంలో మత్తులో ఉన్న పెళ్లికొడుకు సీన్‌ క్రియేట్‌ చేశాడు. పెళ్లికూతురు తనతో డాన్స్‌ చేయాలన్నాడు. చేయకపోతే కోపగించుకున్నాడు. పెళ్లికూతురు ఇక సహించలేదు. అందరినీ పార్శిల్‌ చేసి వెనక్కు పంపించేసింది. కుర్రాడు లబోదిబోమన్నా లాభం లేకపోయింది.

– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు