Bullettu Bandi Song: వధువు వరస మారుతోంది...

27 Aug, 2021 01:01 IST|Sakshi

ట్రెండ్‌

పెళ్లికూతుళ్లు సంప్రదాయాలను తిరగ రాస్తున్నారు. పెళ్లిపీటల మీద తల దించుకుని ఉండటం.. కాబోయే భర్త ఎదుట సిగ్గుల మొగ్గ కావడం.. అత్తారింటికి వెళ్లేప్పుడు కన్నీరు మున్నీరుగా ఏడ్వడం.. ఈ ‘సంప్రదాయ ధోరణి’ కాదని పెళ్లి రోజున పూర్తి ఉత్సాహంగా ఉంటున్నారు. జీవితంలో ముఖ్యమైన రోజును అణువణువు ఆనందమయం చేసుకోజూస్తున్నారు. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అని పాడుతూ డాన్స్‌ చేస్తున్నారు. అంతేనా? అత్తారింటికి పక్కన భర్తను కూచోబెట్టుకుని డ్రైవ్‌ చేస్తున్నారు. నిజంగా వీరు కొత్త పెళ్లికూతుళ్లే.

నాలుగు రోజుల క్రితం, ఆగస్టు 22న ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఒక పెళ్లి జరిగింది.
వధువు సనా షబ్నమ్, వరుడు షేక్‌ ఆమిర్‌. ఇప్పుడు వధువు అత్తారింటికి వెళ్లాలి. సాధారణంగా ఆ సమయంలో పెళ్లిమంటపం గంభీరంగా ఉంటుంది. పెళ్లికూతురి తల్లిదండ్రులు భావోద్వేగాలకు లోనవుతారు. ఇన్నాళ్లు పెంచి పోషించిన బంగారు తల్లి ఇప్పుడు తమ నుంచి వేరుపడి కొత్త జీవితంలోకి అడుగు పెడుతోంది కనుక ఆమె వైవాహిక జీవితం బాగుండాలని ఒక ఆకాంక్ష, ఆమె అక్కడ ఎలా ఉండ బోతోందోననే ఆందోళన... ఇవన్నీ వాతావరణాన్ని బరువెక్కిస్తాయి. పెళ్లికూతురు బొరోమని తన వాళ్లను పట్టుకుని ఏడుస్తుంది. పెళ్లికొడుకు సర్ది చెప్పి బండి ఎక్కిస్తాడు... సాధారణంగా జరిగే ఈ రివాజు మొత్తం ఆ రోజు ఆ పెళ్లిలో ఏమీ జరగలేదు.

పెళ్లి ఇంటి దగ్గర బయట ఉన్న మహీంద్రా ఎస్‌.యు.వి వరకూ పెళ్లి కూతురు హుషారుగా నడిచి వచ్చింది. డ్రైవింగ్‌ సీట్లో కూచుంది. భర్త ఆమిర్‌ను పాసింజర్‌ సీట్లో కూచోబెట్టుకుంది. ‘వెళదామా... అత్తారింటికి’ అని బండి స్టార్ట్‌ చేసింది. బంధుమిత్రులందరూ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే పెళ్లికూతురి ఉత్సాహాన్ని ప్రోత్సహించారు. కశ్మీర్‌ లోయలో ఇలాంటి ‘విదాయి’ (అంపకాలు) ఎవరూ చూడలేదు. కాని పెళ్లికూతురు సనా షబ్నమ్‌ గతంలోని స్టీరియోటైప్‌ను బ్రేక్‌ చేసింది.

‘నేను కశ్మీర్‌ పెళ్లిళ్ల మూస పద్ధతిని మార్చాలనుకున్నాను. సనా నన్ను కూచోబెట్టుకుని డ్రైవ్‌ చేయడం తన జీవితంలోని ముఖ్యరోజున విశేషం అవుతుందని భావించాను. ఆమె నన్ను కూచోబెట్టుకుని నడపడాన్ని ప్రోత్సహించాను. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చుగాని చాలామంది మెచ్చుకున్నారు’ అని సనా భర్త ఆమిర్‌ అన్నాడు. అతడు వృత్తిరీత్యా అడ్వకేట్‌. బారాముల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు కూడా. 

కశ్మీర్‌ ముస్లింలలో సంప్రదాయాల పట్ల కట్టుబాటు ఉన్నా అక్కడ స్త్రీలు ఆధునికంగా ఆలోచించడాన్ని ఆహ్వానిస్తున్నారని ఈ ఉదంతం వెల్లడి చేస్తోంది.

అయితే నెల క్రితం కలకత్తాలో జరిగిన ఇలాంటి సంఘటనే ‘జండర్‌ మూస’ను బద్దలు కొట్టినట్టయ్యింది. సాధారణంగా భార్య జీవితానికి మార్గం చూపేవాడు భర్తే అవుతాడు సగటు పురుషస్వామ్య భావజాలంలో. భర్త ప్రతిదాన్ని లీడ్‌ చేస్తే భార్య అనుసరించాలి. ఇది పెళ్లయిన నాటి నుంచి సమాజం మొదలెడుతుంది.


అంపకాల్లో పెళ్లికూతురి తండ్రి తన కుమార్తె చేతిని అల్లుడి చేతిలో పెట్టి ‘జాగ్రత్త నాయనా... ఎలా చూసుకుంటావో’నని ఎమోషనల్‌ అవుతాడు. సమాజం ఇంత ముందుకు వెళ్లినా స్త్రీలు తమ సామర్థ్యాలను నిరూపిస్తున్నా భార్యను భర్త మీద ఆధారపడే వ్యక్తిగా సంకేతం ఇచ్చే ‘అంపకాలను’ ఎందుకు తిరస్కరించకూడదు అని కోల్‌కతాకు చెందిన వధువు స్నేహా సింగ్‌ అనుకుంది. పెళ్లి అయ్యాక భారీ పెళ్లి లహెంగాలో భర్త సౌగత్‌ ఉపాధ్యాయను బండిలో కూచోబెట్టుకుని అత్తారింటికి బయలుదేరింది. ఇది దేశంలో చాలా వైరల్‌ వీడియో అయ్యింది.

‘ఇలా చేయాలని నెల క్రితమే నేను అనుకుని సౌగత్‌ను అడిగాను. అతడు సంతోషంగా అంగీకరించాడు. అయితే ఆ తర్వాత ఆ సంగతి పెళ్లి కంగారులో మర్చిపోయి నేను పాసింజర్‌ సీట్లో కూచుంటే నువ్వు నడుపుతానన్నావుగా అని అతడే గుర్తు చేశాడు. నిజానికి సౌగత్‌ను కూచోబెట్టుకుని బండిలో తిప్పడం పెళ్లికి ముందు నుంచే నాకు అలవాటు. ఆ పనే ఇప్పుడూ చేశాను. అతని డ్రైవింగ్‌ నాకు భయం కూడా అనుకోండి’ అని నవ్వింది స్నేహా.

ఇరవై ముప్పై ఏళ్ల క్రితం కమ్యూనికేషన్‌ వ్యవస్థ, ట్రాన్స్‌పోర్టేషన్‌ సరిగా ఉండేవి కాదు. అత్తారిల్లు పక్క ఊళ్లోనే అయినా దూరం అయినా రాకపోకలు మాటా మంతి అంతగా సాగేవి కావు. ఉత్తరాలనే నమ్ముకోవాల్సి వచ్చేది. పైగా ఆనాటి ఆడపిల్లలు సరైన చదువుకు, ఉపాధికి నోచుకోక భవిష్యత్తంతా అత్తారింటి మంచి చెడ్డల మీద ఆధారపడి ఉండేవారు. అందువల్ల పెళ్లి సమయాలలో పెళ్లికూతుళ్లు ఆందోళనగా, ఉద్వేగంగా, సమాజ పోబడికి తగ్గట్టు బిడియంగా ఉండేవారు. కాని ఇప్పుడు ఎంత దూరం వెళ్లినా, అమెరికాలో ఉన్నా అనుక్షణం తన వాళ్లకు కనపడుతూ వినపడుతూ ఉండే వీలు ఉంది. ఒక్కరోజు తేడాలో ఎంత దూరం అయినా ప్రయాణించవచ్చు. అబ్బాయి అమ్మాయిల మధ్య పెళ్లికి ముందు కొద్దో గొప్పో మాటలు నడిచి పెళ్లి నాటికి స్నేహం కూడా ఏర్పడుతోంది. అందుకే ఇప్పుడు పెళ్లిళ్లలో పూర్తిగా కొత్త ఆలోచనల పెళ్లికూతుళ్లు కనిపిస్తున్నారు.

ఇటీవల తెలంగాణలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన వధువు సాయి శ్రీయ వరుడు అశోక్‌తో అంపకాల సమయంలో అత్తారింటికి సంతోషంగా వెళుతూ ప్రైవేటు గీతం ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ పాటకు చేసిన నృత్యం దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో సాయి శ్రీయ తన భర్తను చూస్తూ సంతోషంగా డాన్స్‌ చేస్తుంటే భర్త కూడా ఎంతో ముచ్చట పడుతూ చూడటాన్ని జనం మెచ్చుకున్నారు. ఆ జంటను ఆశీర్వదించారు.

నిన్న మొన్నటి వరకు అబ్బాయికి విందులో ఏది ఇష్టం, మంటపం ఏది బుక్‌ చేయమంటాడు, పెళ్లి ఎలా జరగాలంటాడు వంటి ప్రిఫరెన్సు దక్కేది. ఇప్పుడు అమ్మాయికి ఏది ఇష్టం, ఏం కావాలంటోంది, ఏది ముచ్చపడుతోంది అని అడిగి అంగీకరించే పరిస్థితికి నేటి ఆడపిల్లలు వీలు కల్పిస్తున్నారు.

సంతోషాల ఎంపికలో ఆమెకూ సమాన భాగం దొరికితే ఆ వివాహం మరెంతో సుందరం కదా.

మరిన్ని వార్తలు