11 ఏళ్లకే ప్రపంచ మేధావులనే మించిపోయిన బుడతడు

11 Sep, 2022 07:35 IST|Sakshi

ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్న బుడతడి వయసు పట్టుమని పదకొండేళ్లు. బ్రిటన్‌కు చెందిన ఈ బాలుడి పేరు కెవిన్‌ స్వీనే. ఇతడి వయసు కొంచెమే గాని, తెలివితేటలు చాలా ఘనం. ఐక్యూలో ఏకంగా ఐన్‌స్టీన్‌ను, స్టీఫెన్‌ హాకింగ్‌ను సైతం అధిగమించి, అంతర్జాతీయ మేధావులంతా అవాక్కయ్యేలా చేసిన ఘనత ఇతడిది. ఐక్యూ పరీక్షల్లో 162 స్కోర్‌ సాధించి, ఐన్‌స్టీన్, స్టీఫెన్‌ హాకింగ్‌లను తలదన్నడంతో కెవిన్‌కు అంతర్జాతీయ మేధావుల సంస్థ ‘మెన్సా ఇంటర్నేషనల్‌’ నుంచి ప్రత్యేక ఆహ్వానం లభించింది.

‘మెన్సా ఇంటర్నేషనల్‌’లో సభ్యత్వం దక్కాలంటే, ఐక్యూ కనీసం 98 లేదా అంతకు మించి ఉండాలి. ఎడిన్‌బరోలో గత జూలై 16న జరిగిన ఐక్యూ పరీక్షకు హాజరైన కెవిన్, ఇందులో 162 స్కోర్‌ సాధించాడు. ఇదివరకు ఈ పరీక్షలో ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌ 160 స్కోర్‌ సాధించగా, ఐన్‌స్టీన్‌ ఎప్పుడూ ఈ పరీక్షకు హాజరవలేదు. అయితే, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఐన్‌స్టీన్‌ ఐక్యూ కూడా 160 ఉండేది.

చదవండి: ఎక్కువసేపు కూర్చునే ఉంటారా? ఈ సమస్యలు తెలిస్తే.. స్థిమితంగా కూర్చోలేరేమో! 

మరిన్ని వార్తలు