అబ్బాయిల్ని కూడా వివిధ రూపాల్లో..

28 Sep, 2020 08:02 IST|Sakshi

బ్రాడీ జెన్నర్‌ టెలివిజన్‌ పర్సనాలిటీ. మోడల్‌. డిస్క్‌ జాకీ. ఇవేం గొప్ప గానీ.. ఒకప్పుడు అతడు యువకుడు! ఇప్పుడైనా మరీ యువకుడు కాకుండా ఏం పోలేదు. థర్టీ సెవెన్‌లో ఉన్నాడు. సరిగ్గా ఆయనకు తోడుబోయినవాడు స్కాట్‌ డిసిక్‌. అతడికీ ముప్పై ఏడేళ్లు. మీడియా పర్సనాలిటీ. సోషలైట్‌. ఇద్దరిదీ యూఎస్‌. ఈ ఇద్దరికీ తోడుబోయింది ‘గ్రేడియంట్‌’ ఫొటో ఎడిటింగ్‌ యాప్‌. యవ్వనంలో యౌవనస్తుల ఆలోచనలు ఏ ఎగ్జామ్స్‌ టైమ్‌లోనో తప్పితే తక్కిన ఏ కాలంలోనూ ఒక్క క్షణం కూడా స్త్రీలను తప్పుకుని, తల తిప్పుకుని వెళ్లవు. ‘మీకు ఒక వయసు వచ్చిన పిదప భూలోకమున స్త్రీలు సాక్షాత్కరించెదరు. మీరు మీ పనులను పక్కన పెట్టి ఆ స్త్రీలను అదే పనిగా ఆరాధించెదరు’ అని దేవుడు ఆజ్ఞాపించి పురుష జన్మను ప్రసాదించినట్లుగా ఇంట్లో చెప్పిన పనులు కూడా చేయడం మానేసి విధి లేక అన్నట్లుగా స్త్రీల ఆలోచనలతో వీధుల్లో తల మునకలు అవుతుంటారు బాయ్స్‌. ఒకప్పుడు బ్రాడీ జెన్నర్, స్కాట్‌ డిసిక్‌ కూడా ఇలా దైవాజ్ఞానుసారం నడుచుకున్న వాళ్లే. పెళ్లిళ్లు అయ్యాక దైవాన్ని ధిక్కరించి, ఇన్నాళ్లకు మళ్లీ తమ దైవధిక్కార అపరాధాన్ని గ్రహించి అందుకు పరిహారంగా లేటెస్ట్‌గా వచ్చిన ‘గ్రేడియంట్‌’ ఫొటో ఎడిటింగ్‌ యాప్‌కి ప్రమోటర్‌లుగా చేరిపోయారు.

ఆ యాప్‌ ఎంత బాగా పని చేస్తుందో చూడండి. ‘బి’ అనే యౌవనస్తుడికి ‘జి’ అనే గర్ల్‌ ఫ్రెండ్‌ ఉందనుకుందాం. (అనుకోనక్కర్లేని విషయమే అనుకోండి..) ఆ గర్ల్‌ ఫ్రెండ్‌ ఫొటోను ఈ గ్రేడియంట్‌ యాప్‌లో పడేసి ఏ దేశం బటన్‌ నొక్కితే ఆ దేశం అమ్మాయిగా ప్రత్యక్షం అవుతుంది! ఈ మానవలోకంలో 197 దేశాలు ఉన్నట్లు వినికిడి. ‘హు.. ఇవి ఏమాత్రం?’ అని తీవ్ర నిరాశా నిస్పృహలతో చింతాక్రాంతులై పోతున్నారట అబ్బాయిలు.. ఈ యాప్‌లోకి ఎంటర్‌ అయిన కాసేపటికే!! వాళ్ల సంగతి అలా ఉంచితే.. ఈ పనికిమాలిన ‘రేసిస్ట్‌’ యాప్‌ని ప్రమోట్‌ చెయ్యడానికి మీకు బుద్ది లేదా?! అని యవ్వనాపూర్‌ని దాటేసి ఏళ్ల మైళ్లు వచ్చేసినవారు.. బ్రాడీ జెన్నర్, స్కాట్‌ డిసిక్‌ లను పట్టుకుని కడిగేస్తున్నారు. యాప్‌లో అబ్బాయిల్ని కూడా వివిధ రూపాల్లో.. యూరోపియన్లుగా, ఏషియన్లుగా, ఆఫ్రికన్లుగా, ఇండియన్లుగా.. చూసే అప్షన్లు కూడా ఉన్నప్పటికీ అమ్మాయిలసలు వాటి ముఖం కూడా చూడటం లేదట! దేవుడు వాళ్లను.. ‘ఒక వయసు వచ్చిన మీదట మీకు భూలోకమున అబ్బాయిలు ప్రత్యక్షమగుదురు. వారిలో మీకు పురుగులు దర్శనమిచ్చును’ అని బ్లెస్‌ చేసి పంపినట్లున్నాడు! 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా