తెలుపు, బ్రౌన్‌ కలర్‌ గుడ్డు: ఈ విషయాలు మీకు తెలుసా?

16 Apr, 2021 14:42 IST|Sakshi

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కకావికలం చేస్తోంది. ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు, వైరస్‌ సోకిన వారు దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు చాలా మంది పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడంపై దష్టిపెడుతున్నారు. ఇందులో గుడ్డు మొదటి వరుసలో ఉంది. సాధారణంగా కోడి గుడ్లను మనం ఎక్కువగా తీసుకుంటుంటాం. ఇందులో బ్రాయిలర్, నాటు కోడి గుడ్లు ముఖ్యమైనవి. ఇవి తెలుపు రంగులో ఉంటాయి. అయితే, వీటికితోడు బ్రౌన్‌  (గోధుమ రంగు) గుడ్లు కూడా మనకు లభిస్తున్నాయి. ఇవి తెల్లటి గుడ్లకంటే మంచివని అంతా భావిస్తుంటారు. వాస్తవానికి రంగుతో సంబంధం లేకుండా, గుడ్డు ఏదైనా సరే పోషకాలు మాత్రం ఒక్కటేనని నిపుణులు చెబుతున్నారు.

ఈ రెండు రకాల గుడ్లలో విటమిన్లు, మినరల్స్‌తో పాటు శరీరానికి అవసరమైన ప్రొటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. రుచి విషయంలో తెలుపు, గోధుమ రంగు గుడ్లలో కొద్ది తేడా ఉన్నప్పటికీ పోషకాలు మాత్రం సమానమే. నిజానికి కోడి గుడ్డు పెంకు ఏ రంగులో ఉన్నా వాటిల్లోని పోషకాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే నాటు కోడి గుడ్డు పరిమాణం కాస్త చిన్నగానూ ఫారం కోడి గుడ్లు కాస్త పెద్దగానూ ఉంటాయి. 

ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌..
కేలరీలు, ప్రొటీన్స్‌, కొలెస్ట్రాల్‌ విషయంలో తెలుపు, గోధుమ రంగు గుడ్లు సమానంగా ఉంటాయి. బ్రౌన్‌ గుడ్లలో మాత్రం ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ పాళ్లు కొంత ఎక్కువగా ఉంటాయి. అది పెద్ద తేడా కాదని నిపుణులు చెబుతున్నారు. తెల్లవైనా, బ్రౌన్‌వి అయినా 100 గ్రాముల గుడ్డులో దాదాపు 13 గ్రాముల ప్రొటీన్స్‌ ఉంటాయి. కానీ బ్రౌన్‌  ఎగ్స్‌ను సేంద్రియ పద్ధతి(ఆర్గానిక్‌)లో ఉత్పత్తి చేయడం వల్ల అందులో పోషకాలు అధికంగా ఉంటాయన్న అపోహతోనే వినియోగదారులు వీటిని కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిజానికి బ్రౌన్‌ ఎగ్స్‌ ఉత్పత్తి తక్కువ కాబట్టే డిమాండ్‌ ఎక్కువని, అందుకే అవి అధిక ధర పలుకుతున్నాయని నిపుణులు అంటున్నారు. 

కోళ్లను బట్టి సైజు...
గుడ్ల సైజు విషయంలో తెల్లవి కాస్త పెద్దగా, బ్రౌన్‌వి కాస్త చిన్నగా ఉంటాయి. గుడ్డు పరిమాణం కోడి సైజును బట్టి ఉంటుంది. అలాగే వేసవిలో పెట్టే గుడ్లు చిన్నవిగానూ, చలికాలంలో పెట్టే గుడ్లు పెద్దవిగానూ ఉంటాయి.

మరిన్ని వార్తలు