సముద్రం ఇచ్చే సందేశం

7 Jun, 2021 09:12 IST|Sakshi

భగవాన్‌ బుద్ధుణ్ణి‘సత్తాదేవ మనుస్సానం’ అంటారు. అంటే పండితులకూ, పామరులకూ శాస్త అని. శాస్త అంటే గురువు. ఆబాలగోపాలానికీ అర్థమయ్యేట్లు చెప్పగల దిట్ట, నేర్పరి. తాత్త్విక విషయాల్ని చెప్పేటప్పుడు సరైన ఉపమానాల్ని చూపి సులభంగా అర్థమయ్యేలా చెప్పగల మహా గురువు. మనిషి పరిపూర్ణతని చెప్తూ ఆయన సముద్రాన్ని ఉపమానంగా చెప్పిన తీరు అమోఘం. 

ఒకనాడు బుద్ధుడు శ్రావస్తి నగరానికి తూర్పుదిక్కున విశాఖమాత నిర్మించిన పూర్వారామం లో ఉన్నాడు. అప్పుడు పరిపూర్ణతని గురించి మౌద్గల్యాయనునితో చెప్తూ ‘మౌద్గల్యా’ సముద్రానికి ఎనిమిది ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి సాగరానికున్న అద్భుత గుణాలు, అవి మనిషికీ ఉండాలి’ అన్నాడు. 
‘భగవాన్‌! అవేమిటో తెలియజేయండి’ అన్నాడు మౌద్గల్యుడు.

‘మౌద్గల్యా! వాటిలో మొదటిది: సముద్రంలో దిగుతున్నప్పుడు ఒకేసారి లోతు రాదు. క్రమేపీ దాని లోతు పెరుగుతూ ఉంటుంది. అలాగే మనిషి కూడా తన జ్ఞానాన్ని క్రమేపీ సాధించుకోవాలి. ఒక్కసారే వచ్చిపడాలి అనుకోకూడదు. నెమ్మదిగానే క్రమంలో జ్ఞానలోతులు చూడాలి. నేను చెప్పే జ్ఞానం కూడా అంతే! అది క్రమంగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందిస్తుంది’ అన్నాడు.

‘భగవాన్‌ అద్భుతం’ అన్నాడు మౌద్గల్యాయనుడు. ‘అలాగే... సముద్రం ఎంత హోరుపెట్టినా, అలలు ఎగసి పడుతున్నా, ఎప్పుడూ అది తన చెలియలికట్ట దాటదు. మన మనస్సూ అలాంటి స్థితినే కలిగి ఉండాలి. నా ధర్మం అలాంటి స్థిర చిత్తాన్ని కలిగిస్తుంది. భిక్షూ! సముద్రాన్ని పరిశీలించు. అదెప్పుడూ తనలో చనిపోయిన జీవుల్ని, కుళ్ళిన శవాల్ని ఉంచుకోదు. ఒడ్డుకు నెట్టేస్తుంది. అలాగే... నా ధర్మం కూడా మనస్సులోని చెడు తలపుల్ని నెట్టేస్తుంది. మనం కూడా చెడ్డ ఆలోచనల్ని అలా నెట్టేయాలి. ఇక నాలుగో ప్రత్యేకత... నదులన్నీ సముద్రంలోకి చేరాక వాటి పేరూ, తీరూ, ఉనికీ కోల్పోతాయి. అన్నీ ఒకటే అయిపోతాయి. మనుషులు కూడా జాతి, మత, కుల ప్రాంతీయ భేదాలు మరచి ఒక్కటై పోవాలి. నా ధర్మం అలాంటి సమసమాజాన్ని నిర్మిస్తుంది.

‘‘ఓ భిక్షూ! ఎన్ని నదులు వచ్చి కలసినా, ఎంతెంత వర్ష కుంభవృష్టి కురిసినా సముద్రం రవ్వంత పెరగదు. మనలో ప్రజ్ఞ కూడా అలాగే ఉండాలి. నా ధర్మంలో ఎందరు నిర్వాణం పొందినా అది ఎప్పటికీ నిండిపోదు. నిర్వాణం పొందేవారికి ఎప్పుడూ అవకాశం ఉంటూనే ఉంటుంది. ఇక సముద్రానికి ఉన్న మరో విశేషం విను, ఎక్కడైనా సముద్రానికి ఒకే రుచి ఉంటుంది. అలాగే నా ధర్మంతో కలిగే ధర్మరుచి కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది. మౌద్గల్యా! మణులకూ, రత్నాలకూ, పగడాలకూ, శంఖులకూ సముద్రం నిలయం. ప్రతి మనిషీ అలాంటి సుగుణాల్ని తనలో నింపుకోవాలి. నా ధర్మంలోని పంచశీల, అష్టాంగ మార్గం దశపారమితులు, ఆర్యసత్యాలు అలాంటి మణులే!

ఇక సముద్రానికున్న మరో విశేషగుణం– దాపరికం లేని తత్వం. మన మనస్సు అలాగే ఉండాలి. దాపరికం ఉన్నవాడు మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాడు. దాపరికం లేనివాడు తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటాడు. నా ధర్మం కూడా మనిషిని, మనస్సుని అలా నిష్కల్మషం చేస్తుంది. 
ఈ ఎనిమిది విశేషణాల్ని మనం సముద్రంనుండి నేర్చుకోవాలి. మనల్ని మనం తీర్చి దిద్దుకోవాలి. మౌద్గల్యాయనా!’’ అన్నాడు బుద్ధుడు.
‘‘అద్భుతం, అమోషం, అద్వితీయం... భంతే!’’ అంటూ మౌద్గల్యాయనుడు బుద్ధునికి ప్రణమిల్లాడు.
– డా. బొర్రా గోవర్ధన్‌

మరిన్ని వార్తలు