బుల్లెట్‌ జర్నల్‌కు నువ్వొస్తవా.. నువ్వొస్తవా! ఇంతకీ ఏమిటిది?

25 Jan, 2023 17:01 IST|Sakshi

BuJo Culture: మొన్నటి ‘హ్యాండ్‌ రైటింగ్‌ డే’ సందర్భంగా చేతిరాత గత వైభవాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ చాలామంది వాపోయారు. ‘మా రోజుల్లో’ అంటూ గతంలోకి కూడా వెళ్లిపోయారు. ‘ఈ తరానికి కీబోర్డ్‌ల టిక్‌టక్‌లు తప్ప, అందమైన చేతిరాతతో అట్టే సంబంధం లేదా?’ అని అడిగితే ‘లేదు’ అని చెప్పడానికి సోషల్‌ మీడియా ట్రెండ్‌ ‘బుల్లెట్‌ జర్నల్‌’ అడ్డొస్తుంది.

బిజో కల్చర్‌లో భాగంగా యూత్‌ పెన్,  కాగితానికి దగ్గరైంది. ఆర్ట్‌ థెరపీగా పేరున్న ‘బుల్లెట్‌ జర్నల్‌’లోని మజాను రుచి చూస్తోంది... బుల్లెట్‌ జర్నల్‌ లేదా బుజో అనేది షెడ్యూలింగ్, రిమైండర్స్, టు–డూ లిస్ట్‌... మొదలైన వాటికి ఉపకరించే పర్సనల్‌ ఆర్గనైజేషన్‌ మెథడ్‌.

రోజు, వారం, నెల, సంవత్సరం... ఇలా షెడ్యూల్‌ చేసుకోవచ్చు. ఒకప్పుడు పెన్‌ లేదా పెన్సిల్‌ మాత్రమే ఉపయోగించి రాసేవారు. ఆ తరువాత క్రియేటివిటీలో భాగంగా రూలర్, కలర్‌ పెన్స్, స్టిక్కర్స్, స్టెన్సిల్స్, వాషి టేప్‌... మొదలైన వాటిని ఉపయోగిస్తున్నారు.

ఇండెక్స్‌ (విషయసూచిక), ర్యాపిడ్‌ ల్యాగింగ్‌ (సింబల్స్‌ ఉపయోగించడం), లాగ్స్‌ (టు–డూ లిస్ట్‌), కలెక్షన్స్‌ (కంటెంట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌), మైగ్రేషన్‌(న్యూ లిస్ట్‌) అనే కీలకమైన టూల్స్‌ దీనిలో ఉంటాయి. షెడ్యూలింగ్, టు–డూ లిస్ట్‌కు మాత్రమే పరిమితమై ఉంటే బుల్లెట్‌ జర్నల్‌కు అంతగా ప్రాధాన్యత ఉండేది కాదు.

ఇదేమీ డైరీ కాదు
ఒకవిధంగా  చెప్పాలంటే మన మనసులోని భావాలు, బాధలు, సంతోషాలు, సంక్షోభాలను అక్షరాల రూపం లో కాగితంపై పెట్టడం. అలా అని ఇదేమీ డైరీ కాదు. పొడవాటి వాక్యాలేవీ ఉండవు. ఉదాహరణకు మై గోల్స్‌. డైరీలో అయితే పెద్ద పెద్ద వాక్యాలు రాసుకుంటారు. అయితే బుల్లెట్‌ జర్నల్‌ పేజీలో మాత్రం ‘మై గోల్స్‌’ అని పెద్ద అక్షరాలతో కలర్‌ పెన్సిల్స్‌ లేదా స్కెచ్‌లతో రాస్తారు.

‘మార్నింగ్‌ రొటీన్‌ ఫర్‌ ఎవ్రీ డే’ అని పెద్ద అక్షరాలతో డిజైన్‌ చేసి బాక్స్‌లు, వృత్తాలలో దీనికి సంబంధించిన పాయింట్స్‌ రాస్తారు. కొందరు బొమ్మలు గీస్తారు. ఉదయాన్నే లేవాలి అనేదానికి సింబల్‌గా అలారమ్‌ బొమ్మ గీస్తారు. బొమ్మలు గీయలేని వారు స్టిక్కర్స్‌ అంటిస్తారు.

‘ఇలా మాత్రమే’ అనే రూల్‌ లేదు. ఒక్కొక్కరి సృజనాత్మకత ప్రకారం అది కొత్త రూపాల్లో కనిపిస్తుంది.
‘మీడియం ఫర్‌ మెడిటేషన్‌’గా కూడా పేరు తెచ్చుకుంది బుల్లెట్‌ జర్నల్‌.
మనసు బాగోలేకపోతే, మానసిక ప్రశాంతత కోసం దీన్ని ఆశ్రయిస్తుంటారు.

రైడర్‌ కరోల్‌ అలా
కొందరి విషయంలో ఇది ట్రబుల్‌ షూటర్‌. ఒక సమస్యకు సంబంధించిన పరిష్కార మార్గాలు ఆలోచించే క్రమంలో బుల్లెట్‌ జర్నల్‌ను వాడుకొని వృత్తాలు, బాక్స్‌లు, బొమ్మల రూపంలో ఐడియాలు రాసుకోవడం. న్యూయార్క్‌కు చెందిన రైడర్‌ కరోల్‌ డెవలప్‌ చేసిన మెథడ్‌ ఇది.

కరోల్‌కు ఏకాగ్రత లోపానికి సంబంధించిన సమస్యలు ఉండేవి. దీంతో చదువు దెబ్బతినేది. ఈ నేపథ్యంలో ‘బుల్లెట్‌ జర్నల్‌’ మెథడ్‌కు రూపకల్పన చేసి మంచి ఫలితాలు సాధించాడు కరోల్‌. తన అనుభవాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తే అనూహ్యమైన స్పందన లభించింది. ఆ తరువాత క్లిక్‌స్టారర్‌ (గ్లోబల్‌ ఫండింగ్‌ ప్లాట్‌ఫామ్‌) ఫండింగ్‌తో

‘బుల్లెట్‌ జర్నల్‌’కు సంబంధించిన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టాడు కరోల్‌.
‘ది బుల్లెట్‌ మెథడ్‌’ పేరుతో పుస్తకం రాస్తే మంచి ఆదరణ పొందింది.

‘మొదట్లో గందరగోళంగా అనిపించేది. ఆ తరువాత మాత్రం దీనికి బాగా అలవాటు పడిపోయాను. బుజో కల్చర్‌ ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఆదరణ పొందిందో తెలిసి వచ్చింది’ అంటుంది దిల్లీకి చెందిన అంజలి.

లాక్‌డౌన్‌ టైమ్‌లో మన యూత్‌కు బాగా దగ్గరైన యాక్టివిటీ ఇది.
‘చదువు, హాబీ, వ్యాయామం, భవిషత్‌ లక్ష్యం... ఇలా స్టూడెంట్‌ జీవితంలో రకరకాల విభాగాలు ఉంటాయి. అయితే రోజువారీ హడావిడిలో కొన్ని నిర్లక్ష్యానికి గురవుతుంటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాణాత్మకమైన సమన్వయానికి బుజో కల్చర్‌ ఉపయోగపడుతుంది’ అంటుంది పుణెకు చెందిన 22 సంవత్సరాల ప్రియరాగ.
‘ఆర్గనైజేషన్, టైమ్‌ మేనేజ్‌మెంట్‌కు మాత్రమే కాదు మూడ్, ఫీలింగ్స్, ఎనర్జీ లెవెల్స్‌ మానిటర్‌లా కూడా ఉపయోగపడుతుంది’ అంటుంది ప్రియరాగ స్నేహితురాలు హనీ.

గతాన్ని ట్రాక్‌ చేసి, వర్తమానాన్ని ఆర్గనైజ్‌ చేసి, భవిష్యత్‌ను ప్లాన్‌ చేసే మెథడ్‌గా పేరున్న ‘బుల్లెట్‌ జర్నలింగ్‌’ కోసం రకరకాల డిజిటల్‌ యాప్స్‌ కూడా వచ్చాయి. బుజో కల్చర్‌కు ఆన్‌లైన్‌ కమ్యూనిటీ డిఫరెంట్‌ స్టైల్స్‌ను జత చేసినప్పటికీ ‘పెన్ను, పేపర్‌ వాడితే ఆ మజాయే వేరబ్బా’ అనే వాళ్లే ఎక్కువ!

చదవండి: తులసి ఆకులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో నమిలితే..
CWS: డ్రైవర్‌ బబ్లూ.. అమెరికా డాక్టర్‌ కోమలి! చాలా మంది ఎందుకు ఇలా పిచ్చిగా ఆరాధిస్తారు?
  

మరిన్ని వార్తలు