పరి పూనమ్‌ చౌదరి.. ఉమన్‌ ఆఫ్‌ బునాయ్‌

24 Feb, 2022 00:45 IST|Sakshi
పరి పూనమ్‌ చౌదరి

తెలిసీ తెలియని వయసులో... ‘‘పెద్దయ్యాక నేను డాక్టర్‌ని అవుతాను.. ఇంజినీర్‌ని అవుతాను... కలెక్టర్‌ అవుతాను’’ అని చెప్పి ఆ తర్వాత మర్చిపోయేవారు కొందరైతే, పెద్దయ్యాక ఏమవ్వాలో చిన్నతనంలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ప్రణాళికాబద్ధంగా కష్టపడి, సమాజంలో తమకంటూ ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పరచుకునేవారు మరికొందరు. ఈ రెండో కోవకు చెందిన అమ్మాయే పరి పూనమ్‌ చౌదరి.

జైపూర్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన పరి పూనమ్‌ చౌదరికి చిన్నప్పటి నుంచి ఫ్యాషనబుల్‌గా ఉండే దుస్తులంటే ఎంతో ఆసక్తి. పదమూడేళ్ల వయసులో తన అభిరుచి ఫ్యాషన్‌  అని తెలుసుకుంది పరి. అప్పటినుంచి ఆ రంగంలో గొప్ప స్థాయికి ఎదగాలని కలలు కనేది. తన కలను నిజం చేసుకునేందుకు డిగ్రీ చదువుతూనే ఫ్యాషన్‌  డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సు చేసింది. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్ట్స్‌లో ఫ్యాషన్‌  మీడియా స్టైలింగ్‌ కోర్సును నేర్చుకుంది.

తరువాత 2014లో ఢిల్లీలో మాస్టర్స్‌ చేస్తూనే ఫైన్‌  ఆర్ట్స్, స్ట్రీట్‌ ఫొటోగ్రఫీ, విజువల్‌ ఆర్ట్స్‌’, లగ్జరీ బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు చేసింది. తన చదువుకు తగ్గట్టే ఫ్యాషన్‌  ప్రపంచంలో తన మార్కును చూపించాలన్న ఆలోచన వచ్చింది పూనమ్‌కి. వెంటనే తను రూపొందించిన డిజైన్లతో ఒక బ్లాగ్‌ను ప్రారంభించింది. దాంతోబాటు ఇన్‌ స్టాగ్రామ్‌ పేజిలో ఫ్యాషన్‌ కు సంబంధించిన పోస్టులు పెడుతూ యూజర్లను ఆకట్టుకునేది. బ్లాగ్‌ ప్రారంభించిన రెండేళ్ల తరవాత తన ఫ్యాషన్‌  డిజైనింగ్‌ ఐడియాలతో ‘బునాయ్‌’ అనే బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్‌ మార్కెట్లోకి వచ్చే సమయానికి పరి వయసు 23 ఏళ్లు.

బునాయ్‌ బ్రాండ్‌...
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబిస్తూనే ఫ్యాషనబుల్‌గా ఉండే డ్రెస్‌లతో 2016లో బునాయ్‌ని జైపూర్‌లో ప్రారంభించింది. సంప్రదాయాలకు తగ్గట్టుగా స్టైల్‌గా ఉండే వస్త్రాలను అందుబాటు ధరలకు అందించడమే బునాయ్‌ లక్ష్యం. అందులో భాగంగా కొన్ని డ్రెస్‌లను ఆన్‌ లైన్‌ లో పెట్టింది. వారం తిరక్కుండానే అన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో బట్టలే కాకుండా, ఆభరణాలు, సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్లు, హస్తకళాకారులు రూపొందించిన అలంకరణ వస్తువులను విక్రయించేది. కస్టమర్ల అభిరుచులకు, వారి స్కిన్‌ టోన్‌కు సరిపడినట్లు డిజైన్‌ చేయడం, నాణ్యమైన బట్టను అందుబాటు ధరకే అందించడంతో అతికొద్దికాలంలోనే ఆమె బ్రాండ్‌ ‘బునాయ్‌’ ఫ్యాషన్‌ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. కార్పొరేట్‌ మోడల్స్‌ నుంచి గృహిణుల వరకు అందరూ వేసుకోదగిన డ్రెస్‌లు లభించడం కూడా బునాయ్‌ బ్రాండ్‌ పాపులర్‌ అవడానికి మరో కారణం.

ఉమన్‌  ఆఫ్‌ బునాయ్‌

ప్రారంభంలో కేవలం యాభై వేల రూపాయలతో కొన్ని కుట్టుమిషన్లను కొని, ఇద్దరు టైలర్స్‌ను చేర్చుకుని బునాయ్‌ని ప్రారంభించిన పరి నేడు నాలుగు వందలకు పైగా ఉద్యోగులు, మూడున్నర లక్షల కస్టమర్లతో, కోట్ల టర్నోవర్‌తో వాణిజ్య ప్రపంచంలో దూసుకుపోతుండడంతో పూనమ్‌కి ‘ఉమన్‌  ఆఫ్‌ బునై’ అనే స్థాయిలో గుర్తింపు వచ్చింది. మామూలు వారితోపాటు సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్, దివ్యాంకా త్రిపాఠీ, రిధి డోగ్రా వంటి ఎంతోమంది సెలబ్రెటీలు కూడా బునాయ్‌ బ్రాండ్‌వే కావాలని అడిగి కొనేంతగా పాపులర్‌ అయింది. ఇన్‌ స్టాగ్రామ్‌ పేజీలో పదిలక్షలకుపైగా ఫాలోవర్స్‌తో పరి ఫ్యాషన్‌  ఇన్‌ ఫ్లుయెన్సర్‌ అనే పేరుతోబాటు, గతేడాది బీడబ్ల్యూ ఇచ్చే ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ అవార్డ్స్‌’లో ఈ–కామర్స్‌ టెక్‌ ఉమెన్‌  ఎంట్రప్రెన్యూర్‌ అవార్డు కూడా ఆమెను వరించింది.

మరిన్ని వార్తలు