ఫిట్‌నెస్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌..!

11 Jul, 2021 14:59 IST|Sakshi

హెల్దీ ఫుడ్, ఇమ్యూనిటీ బూస్టర్, ఫిట్‌నెస్‌ అనే పదాల చుట్టే తిరుగుతోంది కాలం. రకరకాల సైట్స్‌లో, యాప్స్‌లో సెర్చ్‌ చేసి మరీ ఆరోగ్య భాగ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు ఎంతో మంది. కరోనా వల్ల జిమ్‌లకు వెళ్లి చెమటోడ్చే పరిస్థితి లేదు. అందుకే ఇంటిపట్టున చేసుకునే వ్యాయామాల కోసం పెయిడ్‌ యాప్స్‌ వెంటపడుతున్నారు. అలాంటివారికి ‘బంకర్‌ఫిట్‌’ అనే యాప్‌ బోలెడు ఆఫర్స్‌ ఇస్తోంది ఫ్రీగా. ట్రైనింగ్‌ మాడ్యూల్స్, ఆరోగ్యవంతమైన రెసిపీలనూ ఉచితంగా అందిస్తోంది. ప్రస్తుతానికిది  హిందీ, ఇంగ్లిష్, తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది. ఇంకొన్ని నెలల్లో మొత్తంగా 14 భాషల్లో కంటెంట్‌ను అందించడానికి సిద్ధమవుతోంది.

యోగాతో పాటు ట్రైనింగ్, న్యూట్రిషన్, రన్నింగ్‌కు సంబంధించిన విభాగాలు కూడా అందుబాటులో ఉంటాయి. ‘ఫిట్‌ ఇండియా’ నినాదాన్ని బలపరుస్తూ 2030 నాటికి 10 కోట్ల మంది వినియోగదారులను చేరుకోవడమే బంకర్‌ఫిట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అద్నాన్‌ అదీబ్, జెబా జైదీలు ఈ యాప్‌ను రూపొందించారు. వీళ్లెవరో అనుకునేరు..! ఎంతో పాపులర్‌ అయిన ‘డెవిల్స్‌ సర్క్యూట్‌ ఫేసెస్‌’  గుర్తుంది కదా! దాని స్థాపకులే ఈ ఇరువురు. ఫిట్‌నెస్‌ ప్రక్రియను ప్రతి గడపకు పరిచయం చేయడమే తమ ప్రధాన లక్ష్యమంటున్నారు వాళ్లు. సామాన్యుల చేతుల్లోనూ స్మార్ట్‌ ఫోన్స్‌ ఉంటున్న ఈ రోజుల్లో.. ఈ యాప్‌ని అందరికీ అందుబాటులోకి తేవడమేమంత కష్టం కాదని వీరి నమ్మకం. అందుకే కంటెంట్‌ అంతా ఉచితమని, దేశంలోని అన్ని వర్గాల వారికీ ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. 

మార్చిలో లాంచ్‌ అయిన ఈ యాప్‌.. ఇప్పటికే 25 వేలకు పైగా డౌన్ లోడ్స్‌ దాటింది. కరోనా కారణంగా ఫిట్‌నెస్, ఆరోగ్యానికి సంబంధించిన కంటెంట్‌ను చూసేవారి సంఖ్య భారీగా పెరగడమే కాకుండా.. దేశంలో డేటా చవకగా లభించడం కూడా ఈ యాప్‌కి ప్లస్‌ కాబోతోంది. ఎయిర్‌టెల్‌ స్టార్ట్‌–అప్‌ యాక్సిలరేటర్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా బంకర్‌ఫిట్‌ స్పెక్టా కామ్‌లో 10% వాటాను ఎయిర్‌టెల్‌ కొనుగోలు చేసింది. దీంతో ఈ యాప్‌కు ఎయిర్‌ టెల్‌ సపోర్ట్‌ కూడా బాగా లభిస్తోంది. ఎయిర్‌టెల్‌కున్న విస్తృతమైన ఎకోసిస్టంతో పాటు ఎయిర్‌ టెల్‌ సీనియర్‌ టీం సలహాలూ ఉపయోగపడనున్నాయి. ఆఫ్‌లైన్, ఆఫ్ లైన్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ విషయంలోనూ ఎయిర్‌ టెల్‌ సాయపడుతుంది. మొత్తానికి దేశంలో ఉచిత ఆరోగ్యాన్ని సాధించడటంలో బంకర్‌ఫిట్‌ తన వంతు ప్రయత్నం చేస్తోంది.

మరిన్ని వార్తలు