టపాసులు కాల్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి!

4 Nov, 2021 11:16 IST|Sakshi

దీపావళి ఎంత కాంతిని ఇస్తుందో... వికటిస్తే అంతే చీకటినీ తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ప్రమాదాలేవీ లేకుండా కేవలం వేడుకల సంబరాలు పొందేందుకు కొన్ని జాగ్రత్తలు అందరూ పాటించాలి. మరీ ముఖ్యంగా పిల్లల విషయంలో పెద్దలు. అలాంటి సాధారణ జాగ్రత్తలు మొదలు కళ్లూ, ఒళ్లూ, చెవులూ... విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపేదే ఈ కథనం. 

చెవులు జాగ్రత్త... 
దీపావళి బాణాసంచా వల్ల దేహంపై ప్రధానంగా దుష్ప్రభావం చూపే ముఖ్యమైన మూడు అంశాలు  శబ్దం, పొగ, రసాయనాలు. అప్పుడే పుట్టిన చిన్నారులు, చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులపై వీటి ప్రభావం మరింత ఎక్కువ. వీటిలో శబ్దం వల్ల ప్రధానంగా చెవులు దెబ్బతింటాయి. చెవుల విషయంలో రక్షణ పొందడం ఎలాగో చూద్దాం. 
కొన్ని టపాకాయల శబ్దం 100–120 డెసిబుల్స్‌ వరకు ఉంటుంది. కానీ మన చెవి కేవలం 7 డెసిబుల్స్‌ శబ్దాన్ని మాత్రమే హాయిగా వినగలుగుతుంది. ఆ పైన పెరిగే ప్రతి డెసిబుల్‌ కూడా చెవిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి చెవులను రక్షించుకోడానికి ‘ఇయర్‌ ప్లగ్స్‌’  కొంతమేరకు అనువైనవి. 
►పెద్ద శబ్దాలతో పేలిపోయే టపాకాయలు కాకుండా చాలా తక్కువ శబ్దంతో పూలలాంటి వెలుగులు కురిపించే చిచ్చుబుడ్లు, కాకరపూవత్తులు, పెన్సిళ్లు, భూచక్రాల వంటివి కాల్చడం మంచిది. 
►ఒకవేళ పెద్ద పెద్ద శబ్దాలకు ఎక్స్‌పోజ్‌ అయితే చెవిలో ఎలాంటి ఇయర్‌ డ్రాప్స్, నీళ్లూ, నూనె వంటివి వెయ్యకుండా ఈఎన్‌టీ నిపుణుడిని సంప్రదించాలి. 

కళ్ల విషయంలో అప్రమత్తత అవసరం
చాలా ఎక్కువ తీక్షణమైన వెలుగు, దానితోపాటు వెలువడే వేడిమి, మంట... ఈ మూడు అంశాలతో కళ్లు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. బాణాసంచాలోని రసాయనాలతో కళ్లు పరోక్షంగా ప్రభావితం కావచ్చు. సల్ఫర్, గన్‌పౌడర్‌ లాంటి రసాయనాల ప్రభావం వల్ల కళ్ల నుంచి నీళ్లు కారడం, కళ్ల మంటలు, దురద వంటి ప్రభావాలు ఉంటాయి. 

ప్రమాద నివారణ / నష్టాలను తగ్గించుకోవడం ఎలా: 
►బాణాసంచా కాల్చగానే వేడిమి తగలకుండా వీలైనంత దూరంగా వెళ్లాలి. కాలని / పేలని బాణాసంచాపై ఒంగి చూడటం మంచిది కాదు. 
►కంటికి రక్షణగా ప్లెయిన్‌ గాగుల్స్‌ వాడటం మంచిది. 
►ప్రమాదవశాత్తు కంటికి ఏదైనా గాయం అయినప్పుడు ఒక కన్ను మూసి, ప్రమాదానికి గురైన కంటి చూపును స్వయంగా పరీక్షించి చూసుకోవాలి. ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే కంటి డాక్టర్‌ను సంప్రదించాలి. 

చర్మం జర భద్రం 
బాణాసంచాతో చర్మం కాలిపోయే ముప్పు ఎక్కువ.  అందునా కాళ్ల, వేళ్ల, చేతుల ప్రాంతంలోని చర్మం గాయపడే ప్రమాదం మరింత అధికం. 

ప్రమాద నివారణ / నష్టాలను తగ్గించుకోవడం ఎలా: 
►బాణాసంచాని కిచెన్, పొయ్యి ఉన్న ప్రాంతాల్లో ఉంచకూడదు. 
►బాణాసంచా కాల్చే సమయంలో వదులైన దుస్తులు ధరిస్తే, అవి వేలాడుతూ మంట అంటుకొనే ప్రమాదం ఉంది. అందుకే కొద్దిగా బిగుతైనవే వేసుకోవాలి.
►బాణాసంచా కాల్చే సమయంలో టపాకాయకు వీలైనంత దూరంగా ఉండాలి. దూరం పెరిగే కొద్దీ చర్మానికి నేరుగా తాకే మంట, వేడిమి తాకే ప్రభావమూ తగ్గుతుంది.
►బాణాసంచా కాల్చే సమయం లో ముందుజాగ్రత్తగా రెండు బక్కెట్లు నీళ్లు పక్కనే ఉంచుకోవాలి. చర్మం కాలితే కంగారు పడకుండా తొలుత గాయంపై నీళ్లు ధారగా పడేలా కడగాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లాలి. గాయాన్ని కడగడానికి గది ఉష్ణోగ్రతతో ఉన్న మామూలు నీళ్ల (ప్లెయిన్‌ వాటర్‌)ను వాడాలి. ఐస్‌ వాటర్‌ మంచిది కాదు. కాలడం వల్ల అయిన గాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో రుద్దకూడదు. డాక్టర్‌ దగ్గరికి వెళ్లేవరకు గాయాల్ని తడిగుడ్డతో కప్పి ఉంచవచ్చు. 
►కాలిన తీవ్రత చాలా ఎక్కువగా సమయాల్లో చేతుల వేళ్లు ఒకదానితో ఒకటి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు వాటి మధ్య తడిగుడ్డ ఉంచి డాక్టర్‌ దగ్గరికి తీసుకుపోవాలి. 
►కాలిన గాయాలు తీవ్రమైతే బాధితులకు ఒక్కోసారి శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కంగారు పడకుండా వీలైనంత త్వరగా డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్లాలి. 
►బాణాసంచా ఎప్పుడూ ఆరుబయటే కాల్చాలి. ఇంటి కారిడార్లలో, ఇంటి లోపలా, టెర్రెస్‌పైన కాల్చకూడదు. పేలే బాణాసంచాను డబ్బాలు, పెట్టెలతో పాటు... మరింత శబ్దం కోసం కుండల్లో, తేలికపాటి రేకు డబ్బాల్లో, గాజు వస్తువుల్లో ఉంచి అస్సలు కాల్చకూడదు. అవి పేలిపోయినప్పుడు వేగంగా విరజిమ్మినట్టుగా విస్తరించే పెంకుల వల్ల చర్మం, కళ్లూ, అనేక అవకాశాలు, తీవ్రంగా గాయపడే ప్రమాదం ఉంది. 
►చిన్న పిల్లలను ఎత్తుకొని బాణాసంచా అస్సలు కాల్చకూడదు. పెద్దవాళ్ల సహాయం లేకుండా చిన్నపిల్లలు వాళ్లంతట వాళ్లే కాల్చడం సుతరామూ సరికాదు. పిల్లలు కాలుస్తున్నప్పుడు పెద్దలు పక్కనే ఉండి, జాగ్రత్తగా వారిని చూసుకోవాలి. 

పైన పేర్కొన్న జాగ్రత్తలతో మన పండగ... మరింత సురక్షితంగా మారి పూర్తిగా‘సేఫ్‌ దీపావళి’ అవుతుందని మనందరమూ గుర్తుపెట్టుకోవాలి. 

చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్‌ ఇచ్చారంటే.. దిల్‌ ఖుష్‌!!

మరిన్ని వార్తలు