రోడ్డు మీద వరి పండించాడు 

30 Oct, 2020 08:01 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం: రహదారికి ఇరువైపులా అశోకుడు చెట్లు నాటించాడని చదివాం.కాని ఈ ఉద్యోగం లేని బస్‌ డ్రైవర్‌ రోడ్డు పక్కన కొద్దిపాటి స్థలంలో తోట పెంచుతున్నాడు. వరిని కూడా పండిస్తున్నాడు. ఈ తోటలోని వస్తువులు ఊరి వారికి ఉచితం. త్రిచూర్‌కు గంట దూరంలోని పెరిన్‌జనమ్‌ అనే పల్లెలో అనిల్‌ కుమార్‌ అనే వ్యక్తి సాధించిన పచ్చదనం ఇది.అనిల్‌ కుమార్‌ అంటే ఊళ్లో అందరికీ గౌరవం. అతని గురించి వింటే మనకూ గౌరవం కలుగుతుంది. కేరళలోని త్రిచూర్‌కు దగ్గరగా ఉండే ‘పెరిన్‌జనమ్‌’ అనే పల్లె అతనిది. ప్రయివేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో బస్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు. అతనికి ఊళ్లో వ్యవసాయానికి బెత్తెడు స్థలం కూడా లేదు. అతను సంప్రదాయ రైతు కూడా కాదు. కాని నేలంటే విపరీతమైన ప్రీతి. ఒక మొక్కకు ప్రాణం పోయడం అంటే అమిత ఇష్టం. ఊళ్లో రోడ్డుకు ఇరువైపులా ఒక గజం మేర వెడల్పుతో మట్టి మార్జిన్‌ ఉంది. ఇలాంటి మార్జిన్‌ ప్రతి ఊళ్లో ప్రతి రోడ్డుకూ ఉంటుంది.

ఆ మార్జిన్‌ నేల చాలు తనకు అనుకున్నాడు అనిల్‌ కుమార్‌. ఆ నేలలో మెల్లగా కూరగాయ మొక్కలు పెంచడం మొదలెట్టాడు. ఊరి పంచాయతీ ఇది గమనించింది. ‘రోడ్డు రాకపోకలకు అంతరాయం కలిగించను. ఈ కాయగూరలు నేను అమ్ముకొని తినను’ అని అన్నాడు. పంచాయతీ అంగీకరించింది. ఇక అనిల్‌ కుమార్‌ పని మొదలయ్యింది. డ్యూటీ లేనప్పుడల్లా రోడ్డుకు ఇరువైపులా అన్ని రకాల కాయగూరలూ సాగు చేశాడు. కొన్ని మొక్కలు ప్రభుత్వం వారి నుంచి తెచ్చుకున్నాడు. కొన్నిమొక్కలు గ్రామస్తులే ఇచ్చారు. విత్తనాలు కూడా ఇచ్చారు. చెట్లు ఏపుగా పెరిగాయి. కాయలు కాశాయి. ‘మేం కోసుకోవచ్చా’ అని ఊరివాళ్లు అడిగితే ‘నన్ను అడిగే పనే లేదు’ అని జవాబు చెప్పాడు. ఒక అందమైన తోటే రోడ్డు పక్కన వెలియడం అందరికీ ఆశ్చర్యం. సంతోషం. అనిల్‌ కుమార్‌ మీద గౌరవం అలా పెరిగింది.

అంతే కాదు... ఆ గజం స్థలంలోనే గ్రామస్తులు వద్దని వారిస్తున్నా, ఓడిపోతావ్‌ అని హెచ్చరిస్తున్నా వరి వేసి ఆశ్చర్యపరిచాడు. వరి ఆ జానాబెత్తెడు స్థలంలోనే విరగపండింది. లాక్‌డౌన్‌ తర్వాత అనిల్‌ కు ఉద్యోగం పోయింది. అయినా సరే ఈ తోట మీద బతికే పని పెట్టుకోలేదు. ‘ఊరి స్థలం ఇది. దాని మీద వచ్చేది ఊరికే’ అంటాడు. అప్పుడప్పుడు అతడు కొన్ని కాయగూరలను కోసి ఇంటికి తీసుకెళ్లాడు నిజమే కాని ‘అలా కోయకపోతే అవి పాడవుతాయి... మొక్కల్ని పాడు చేస్తాయి’ అని జవాబు చెబుతాడు. ‘ఇలా ప్రతి ఊళ్లో చేయవచ్చు. ఆ సందేశం అందించడానికే ఈ పని చేస్తున్నాను’ అంటాడు అనిల్‌. కూరగాయల మధ్య మధ్య అతడు పూల మొక్కలను పెంచాడు. పూలు విరబూసి ఆ దారంతా ఎంతో అందంగా ఉంటుంది. అందమైన పనులు చేసే కొందరు మనుషులను చూసి మిగిలిన అందరినీ ఈ ధరిత్రి మోస్తూ ఉంటుంది.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు