మనోజ్‌ ‘మల్లఖంబ్’ శిక్షణ.. ఒలింపిక్స్‌లో నలుగురు పిల్లలు

3 Mar, 2021 20:37 IST|Sakshi

రాయ్‌పూర్‌: దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని మన జవాన్లు.. మరో అడుగు ముందుకేసి సరిహద్దు సమస్యలేగాక దేశంలో  కొన్ని అంతర్గత సమస్యలపైనా దృష్టి పెడుతున్నారు. చత్తీస్‌ఘడ్‌ ఆర్మడ్‌ ఫోర్స్‌(సీఏఎఫ్‌) కానిస్టేబుల్‌ మనోజ్‌ ప్రసాద్‌ .. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లోని పిల్లలను హింసవైపు మళ్లకుండా ఉంచేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చత్తీస్‌ఘడ్‌లోని నారాయణపూర్‌ జిల్లా అబుజ్మద్‌ అటవీ ప్రాంతంలోని పిల్లలకు ‘మల్లఖంబ్‌’ అనే సంప్రదాయ ఆటలో శిక్షణ ఇచ్చి బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. అబుజ్మద్‌ అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులకు ఇప్పటికీ కనీస మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్‌ వంటివి అందుబాటులో లేవు. ఇటువంటి వెనకబడిన ప్రాంతంలో పుట్టిన ఓ నలుగురు పిల్లలు జపాన్‌లో జరగబోయే ఒలింపిక్స్‌ లో ‘మల్లఖంబ్‌’ ప్రదర్శనకు ఎంపికయ్యారు. 

2016లో మనోజ్‌ ప్రసాద్‌ మల్లఖంబ్‌ను స్వయంగా నేర్చుకుని... ఆతరువాత 2016–17 మధ్యకాలంలో నక్సల్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని గిరిపుత్రుల పిల్లలకు ఉచితంగా మల్లఖంబ్‌ను నేర్పించడం ప్రారంభించారు. ప్రసాద్‌ దగ్గర శిక్షణ తీసుకున్న నలుగురు విద్యార్థులు ఈ ఏడాది జపాన్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో మల్లఖంబ్‌ను ప్రదర్శించడానికి ఎంపికయ్యారు. ఈ నలుగురు ఈ ఆటను ప్రదర్శించడంలో ఎంతో సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని ప్రసాద్‌ చెప్పారు.‘‘ నారాయణపూర్‌లో నేను శిక్షణ ప్రారంభించక ముందు ఇక్కడి ప్రజలకు మల్లఖంబ్‌ అంటే ఏంటో తెలియదు. నేను ట్రైనింగ్‌ ప్రారంభించిన రెండుమూడేళ్లలోనే ఇక్కడి విద్యార్థులు దేశస్థాయిలో జరిగే మల్లఖంబ్‌ పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకాలను గెలుచుకున్నారని ప్రసాద్‌ తెలిపారు.

2019–20 మధ్యకాలంలో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, గోవాలో జరిగిన మల్లఖంబ్‌ టోర్నమెంట్స్, అఖిల భారత స్థాయి పోటీలో పాల్గొని సీనియర్‌ గ్రూపుతో ఆడి స్వర్ణపతకాలు గెలిచారు. 2020 మార్చిలో 8 స్వర్ణపతకాలు, 3 కాంస్య పతకాలు, ఇండియా అండర్‌–14లో నలుగురు అమ్మాయిలు బెస్ట్‌ ఆఫ్‌ సిక్స్‌గా నిలిచారు. ఇది మామూలు విషయం కాదు. గత నలభై ఏళ్లుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు మల్లఖంబ్‌ విద్యలో ఎంతో అనుభవంతో ఉన్నాయి. అటువంటి రాష్ట్రాలను నా స్టూడెంట్స్‌ డీ కొట్టడానికి చాలా కష్టపడ్డారని, రాత్రి పగలని తేడాలేకుండా తీవ్రంగా కృషి చేసి దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలుస్తున్నారని’’ ప్రసాద్‌ చెప్పారు. మల్లఖంబ్‌ ...మల్ల అంటే రెజ్లర్‌ అని, కంంబా అంటే పోల్‌ అని అర్థం. నిట్ట నిలువుగా ఉన్న పోల్‌ లేదా రోప్‌పై జిమ్నాస్టిక్స్‌ చేయడమే మల్లఖంబ్‌ ఆట ప్రత్యేకత. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ క్రీడను ఎక్కువ సాధన చేసేవారు ఉండడంతో మధ్యప్రదేశ్‌ రాష్ట్ర క్రీడగా మల్లఖంబ్‌ను ప్రకటించారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు