పిక్కలు.. గుండెకు బ్రాంచ్‌ ఆఫీస్‌లు

30 Aug, 2021 19:13 IST|Sakshi

పిక్కలు... గుండెకు బ్రాంచ్‌ఆఫీస్‌లా పనిచేస్తాయి. దేహం పై భాగంలో ఉండే గుండె మెయిన్‌ ఆఫీస్‌ అయితే... పిక్కలు కాళ్లలో ఉన్న క్యాంప్‌ ఆఫీసు అన్నమాట. గుండె అన్ని అవయవాలకూ రక్తాన్ని పంప్‌ చేసినట్టే... పిక్క కూడా పై వైపునకు రక్తం వేగంగా వెళ్లేందుకు దోహదపడుతుంది. పిక్క చేసే ఎక్స్‌ట్రా డ్యూటీ గురించి తెలిపే కథనం ఇది. 

గుండె పంపింగ్‌ ప్రక్రియ వల్ల దేహంలోని అన్ని భాగాలకూ రక్తం అందుతుంది. మెదడు ఇతర భాగాల నుంచి మళ్లీ గుండెకు రక్తం చేరడం ఒకింత సులువు. కానీ పాదాల నుంచి పైవైపునకు రక్తం అందడం భూమ్యాకర్షణ (గ్రావిటేషనల్‌) శక్తి కారణంగా ఒకింత కష్టం అవుతుంది. కానీ పైవైపునకు రక్తప్రవాహం సాఫీగా జరిగేందుకు పిక్క దోహదపడుతుంది. అందుకే దాన్ని ‘కాఫ్‌ మజిల్‌ పంప్‌’ అంటారు. దేహానికి రెండో గుండె అనీ,  ‘పెరిఫెరల్‌ హార్ట్‌’ అని కూడా అంటారు.

గుండెకు బ్రాంచ్‌ ఆఫీస్‌ డ్యూటీ ఇలా... 
పిక్కలోని అన్ని కండరాలూ కలిసి గుండె డ్యూటీలు నిర్వహించినప్పటికీ...  గ్యాస్ట్రోనెమియస్, సోలెయస్‌ అనే ప్రధాన కండరాలు మరింతగా ఈ విధిని నిర్వహిస్తాయి. ఇవి ఓ క్రమపద్ధతిలో ముడుచుకుంటూ, విప్పారుతూ (రిలాక్స్‌ అవుతూ) ఓ క్రమబద్ధమైన రీతిలో రక్తనాళాల్లోని రక్తాన్ని పైకి నెడుతుంటాయి. భూమ్యాకర్షణ కారణంగా ఈ రక్తనాళల్లోని రక్తం కిందికి రాకుండా వాల్వ్‌ (కవాటాల) ఆపుతుంటాయి. ఇలా... గుండెకు చేరాల్సిన రక్తాన్ని కిందికి రాకుండా ఒకేవైపునకు ప్రవహించేలా చూస్తాయి. 

‘పిక్క’ బలం లేకపోతే...
పిక్క సరిగా పనిచేయకపోతే వైవైపునకు ప్రవహించాల్సిన రక్తం కాళ్లలో ఉండిపోతుంది. అందులో ప్రాణవాయువు లేకపోవడం వల్ల అక్కడి కండరాల్లోని కణాలకు తగినంత ఈక్సిజన్‌ అందదు. ఫలితంగా ఆ కండరాలు అలసటకు గురవుతాయి. దాంతో వచ్చే సమస్యల్లో కొన్ని... 
కాళ్ల చివరలకు రక్తసరఫరా తగ్గడం ∙ వ్యాధి నిరోధకత ఇచ్చే లింఫ్‌  నిర్వీర్యం కావడం ∙చెడు రక్తాన్ని తీసుకుపోయే సిరల సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు ఏర్పడతాయి. 

ఫలితంగా...  
► కాళ్లు ఎప్పుడూ అలసినట్టుగా ఉండటం

కాళ్లూ, పాదాలలో వాపు

వేరికోస్‌ వెయిన్స్‌ సమస్య కనిపించడం (అంటే... కాళ్లలో  చెడు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళాలు (సిరలు) ఉబ్బినట్లుగా చర్మం బయట నుంచి కనిపిస్తుండటం). దాంతో కాలిపై పుండ్లు ఓ పట్టాన తగ్గవు.

కాళ్ల సిరల్లో రక్తం గడ్డకట్టడం (డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌) వంటి సమస్యలు రావచ్చు. 

నివారణ ఇలా... 
► బరువును అదుపులో ఉంచుకోవాలి. ∙క్రమం తప్పకుండా నడవడం (రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు నడక వ్యాయామం అవసరం. దాంతో కేవలం పిక్కలకు మాత్రమే కాకుండా... అన్ని కండరాలకూ వ్యాయామం సమకూరి ఆరోగ్యం బాగుంటుంది). ∙కాళ్లపై రక్తనాళాలు బయటకు కనిపిస్తుంటే... వాటిని అదిమి ఉంచే ‘వీనస్‌ స్టాకింగ్స్‌’ అనే సాక్స్‌ వంటి తొడుగులను డాక్టర్‌ సలహా మేరకు వాడాలి. ఒకవేళ అప్పటికీ ఫలితం కనిపించకపోతే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి. 

సమస్యలు ఎవరిలో... 
► చాలా సేపు కదలకుండా అదేపనిగా కూర్చుని పనిచేసేవారికి ∙ఎక్కువసేపు నిల్చొని పనిచేసే వృత్తుల్లో ఉండేవారికి (లెక్చరర్లు, టీచర్లు, ట్రాఫిక్‌పోలీసులు... మొదలైనవారికి) ∙స్థూలకాయంతో ఉన్నవారిలో  ∙గర్భవతులుగా ఉన్న సమయంలో మహిళల్లో కొందరికి ఈ సమస్య రావచ్చు. 

-డాక్టర్‌ పీ సీ  గుప్తా 
సీనియర్‌ వాస్క్యులార్‌ అండ్‌ ఎండోవాస్క్యులార్‌ సర్జన్‌ 

మరిన్ని వార్తలు