లక్షణాలు కనపడకుండానే గుండెజబ్బు రావచ్చా? కారణాలేంటి?

19 Feb, 2023 08:42 IST|Sakshi

కార్డియోమయోపతి!

కార్డియోమయోపతీ అనేది గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. మొదట్లో చాలామందిలో దీనికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కనిపించకపో వచ్చు. అందుకే చాలామందిలో ఇది ఆలస్యంగా బయటపడటం, కొందరిలో ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకోవడం కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో ఇది  వంశపారపర్యంగా కనిపించవచ్చు. గుర్తించడం, చికిత్స అందించడంలో ఆలస్యం జరిగితే ప్రమాదకరంగా కూడా మారవచ్చు. 

లక్షణాలు: ఈ వ్యాధి చాలా నెమ్మదిగా ముదురుతూ పో వడం వల్ల మొదట్లో లక్షణాలు కనిపించవు. అటు తర్వాత కూడా క్రమక్రమంగా లక్షణాలు బయటపడుతుంటాయి. కానీ ఇంకొందరిలో మాత్రం సమస్య నిర్ధారణకు ముందునుంచే లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. 
శ్వాస తీసుకోవడం కష్టం ఉండటం, తరచూ శ్వాస అందక విపరీతమైన ఆయాసం వస్తుండటం
♦ విపరీతమైన అలసట,
♦ పొట్ట – చీలమండ వాపు, కొంతమందిలో కాళ్లవాపు
♦ అరుదుగా ఒక్కోసారి స్పృహ తప్పవచ్చు.  

రకాలు : కార్డియోమయోపతిలో ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అవి డయలేటెడ్‌ కార్డియోమయోపతి, హైపర్‌ట్రోఫిక్‌ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్‌ కార్డియోమయోపతి.  వంశపారంపర్యంగా వచ్చే హైపర్‌ట్రోఫిక్‌ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. పైగా హైపర్‌ట్రోఫిక్‌ కార్డియోమయోపతిలో గుండె కండరాలు, గోడలు మందంగా మారడమన్నది రోగులందరిలోనూ ఒకేలా ఉండదు.

ఈ తరహా కేసులు మొత్తం కార్డియోమయోపతిలో నాలుగు శాతం వరకు ఉంటాయి.  వంశపారంపర్యంగానే వచ్చే మరో రకమైన రెస్ట్రిక్టివ్‌ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. ఈ తరహా  కార్డియోమయోపతి కేసులు 1 శాతం ఉంటాయి.  

కారణాలు:  
♦ మద్యం అలవాటు
♦ వైరల్‌ ఇన్ఫెక్షన్‌లు
♦ నియంత్రణలో లేని అధిక రక్తపో టు (హైబీపీ),  
గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు దీనికి కారణమవుతాయి. అయితే అనువంశీకంగా (వంశపారంపర్యంగా) కొన్ని కుటుంబాల్లో కనిపించే కార్డియోమయోపతికి మాత్రం జన్యువుల్లో మార్పు (మ్యుటేషన్‌)లే కారణం. అలాంటప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్‌ కార్డియోమయోపతి ఉన్నట్లయితే  పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. 

చికిత్స ఎలాగంటే... 
కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు, ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉండవచ్చు. అందుకే నిర్దిష్టంగా కాకుండా... పరిస్థితి తీవ్రత ఆధారంగా చికిత్స అందిస్తారు. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు.
♦ అధిక రక్తపో టు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు.
♦ గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పులను అదుపుచేయడానికి అవసరమైతే పేస్‌మేకర్‌ అమర్చుతారు. దాన్ని అమర్చడం ద్వారా గుండెస్పందనలు సజావుగా, లయబద్ధంగా జరిగేలా చూస్తారు. గుండెకొట్టుకోవడంలో ఇంకా ఏవైనా లోటుపాట్లు ప్రాణానికి ప్రమాదం తెచ్చేలా ఉంటే... వాటిని సరిచేసి ప్రాణాల్ని కాపాడటం కోసం ఐసీడీ పరికరాన్ని అమర్చుతారు.
♦ హైపో ట్రోఫిక్, రెస్ట్రిక్టివ్‌ రకాల కార్డియోమయోపతిలో... అది ఏ రకమైనప్పటికీ చికిత్సలో ప్రధానంగా వ్యాధిలక్షణాలను అదుపు చేయడం, పేషెంట్‌ పరిస్థితి విషమించకుండా చూడటమే  ప్రధానం. 
- డాక్టర్‌ హేమంత్‌ కౌకుంట్ల ,సీనియర్‌ కార్డియో థొరాసిక్‌ సర్జన్‌

మరిన్ని వార్తలు