Junk Food And Diabetes: షుగర్‌ రావడానికి జంక్‌ ఫుడ్‌ ఏ విధంగా కారణమౌతుందో తెలుసా!

15 Nov, 2021 10:17 IST|Sakshi

కొంతమంది టైమ్‌ లేకపోవడంతో హడావుడిగా ఏదో ఒకటి తినేద్దామని జంక్‌ఫుడ్‌ తీసుకుంటూ ఉంటారు. మరికొందరు అందులో ఉపయోగించే మసాలాలకీ, ‘మోనో సోడియమ్‌ గ్లుటామేట్‌’ అని పిలిచే చైనా సాల్ట్‌ ‘ఉమామీ’ రుచికీ అలవాటు పడి జంక్‌ఫుడ్, పిజ్జా, బర్గర్‌లలాంటి ఫాస్ట్‌ఫుడ్‌ తింటుంటారు. కానీ ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, బేకరీ ఐటమ్స్‌ లాంటి ఆహారపదార్థాల్లో ఉండే హానికర రసాయనాలూ,  కొవ్వుల కారణంగా డయాబెటిస్‌ (షుగర్‌) ముప్పు ఎక్కువ అని తెలిపే పరిశోధనలు గతంలోనూ ఉన్నాయి. 

Junk Food and Diabetes: Did You Know Eating Fast Food Can Cause Diabetes?: తాజాగా యూఎస్‌లోని న్యూయార్క్‌ యూనివర్సిటీ (ఎన్‌వైయూ) శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలోను ఇదే విషయం మళ్లీ నిజమని తేలింది. డయాబెటిస్‌ రావడానికి... పరిసరాల్లో లభ్యమయ్యే ఆహార వాతావరణానికీ  మధ్య ఉన్న సంబంధాలపై ‘ఎన్‌వైయూ’ విస్తృతంగా పరిశోధనలు నిర్వహించింది. (ఈ పరిశోధన అంశం: నైబర్‌హుడ్‌ ఫుడ్‌ ఎన్విరాన్‌మెంట్స్‌ ఎఫెక్ట్‌ ఆన్‌ డయాబెటిస్‌). దీనికి అక్కడి ‘వెటరన్స్‌ హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌’ విభాగం తన సహాయ, సహకారాలు అందించింది. 

చదవండి: గుడ్‌న్యూస్‌.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..!

ఇలా చుట్టుపక్కల అన్నీ ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌తో తయారైన ఆహార పదార్థాలు లభ్యమయ్యే వాతావరణం (నైబర్‌హుడ్‌ ఎన్విరాన్‌మెంట్‌)లో డయాబెటిస్‌ కేసులు చాలా ఎక్కువ సంఖ్యలో రాగా... అలాంటి ‘ఆహారవాతావరణం’ (అంటే... ఫుడ్‌ ఎన్విరాన్‌మెంట్‌) పెద్దగా లేని పల్లెలూ, నగర వాతావరణానికి ఆవల ఉండే ప్రాంతాలలో డయాబెటిస్‌ కేసులు అంతగా లేకపోవడం ఆ అధ్యయనం ద్వారా పరిశోధకుల దృష్టికి వచ్చింది. యూనివర్శిటీలోని డివిజన్‌ ఆఫ్‌ ఎపిడిమియాలజీ డైరెక్టర్‌ అయిన ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌ డాక్టర్‌ లోర్నా ఈ. థోర్ప్‌ ఆధ్వర్యంలో ఈ అధ్యయన ప్రణాళిక రూపొందింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ పరిశోధన కోసం లాక్షలాది మంది సాధారణ ప్రజలను ఎంపిక చేసి, వారిని చాలాకాలం పాటు పరీక్షించారు. 

చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం..

ఈ అధ్యయనంలో తేలిన అంశాలను పరిశోధనల ఫలితాలను పొందుపరచిన సభ్యుల బృందంలోని ప్రధాన రచయిత్రి  (మెయిన్‌ ఆథర్‌) అయిన రానియా కంచి, ఆమె సహచరులు సంయుక్తంగా ‘అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ నెట్‌వర్క్‌ ఓపెన్‌ ట్రస్టెడ్‌ సోర్స్‌ జర్నల్‌’లో ఈ అధ్యయనం పూర్తి  వివరాలను నమోదు చేశారు. 

గతంలోనూ చాలామంది నిపుణులూ, అనుభవజ్ఞుల అధ్యయనంలోను ఇదే విషయాలు తేటతెల్లమయ్యాయి. అన్ని పోషకాలతో కూడిన సమతులాహారం, దానికి తగినట్లుగా కనీసం తేలికపాటి వ్యాయామాలు కూడా లేకపోవడం వల్లనే డయాబెటిస్‌ లాంటి సమస్యలు వస్తున్నాయని మరోమారు నిరూపితమైంది. 

చదవండి: టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!!

మరిన్ని వార్తలు