C- Section: మొదటిసారి సిజేరియన్‌... రెండోసారీ తప్పదా? తల్లి ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నప్పుడు..

7 Mar, 2022 10:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మొదటిసారి సిజేరియన్‌ చేసి బిడ్డను తీస్తే... అదే మహిళకు రెండోసారి ప్రసవంలోనూ సిజేరియన్‌ తప్పదనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ అది సరికాదు. రెండోసారి నార్మల్‌ డెలివరీకి అవకాశం ఉందా లేక సిజేరియనే అవసరమా అనే అంశం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మొదటి ప్రెగ్నెన్సీలో సిజేరియన్‌ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎన్నో నెలలో చేశారు వంటివి.

ఎందుకు... అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే... మొదటిసారి బిడ్డ ఎదురుకాళ్లతో ఉందనుకుందాం. కానీ... ఈసారి డెలివరీ టైమ్‌కు ఒకవేళ బిడ్డ తల కిందివైపునకు తిరిగి ఉంటే సిజేరియన్‌ తప్పనిసరి కాకపోవచ్చు. మొదటిసారి బిడ్డ చాలా బరువు ఉండి... ఆ బిడ్డ ప్రసవం అయ్యే మార్గంలో సాఫీగా వెళ్లే అవకాశం లేదనీ, తత్ఫలితంగా మామూలుగా ప్రసవం అయ్యే పరిస్థితి లేదని డాక్టర్‌ నిర్ధారణ చేస్తే మొదటిసారి సిజేరియన్‌ చేస్తారు.

అదే ఈసారి బిడ్డ బరువు సాధారణంగా ఉండి, ప్యాసేజ్‌ నుంచి మామూలుగానే వెళ్తుందనే అంచనా ఉంటే మామూలు డెలివరీ కోసం ప్రయత్నించవచ్చు. అయితే కొందరిలో బిడ్డ బయటకు వచ్చే ఈ దారి చాలా సన్నగా  (కాంట్రాక్టెడ్‌ పెల్విస్‌) ఉంటే మాత్రం సిజేరియన్‌ తప్పదు. 

తల్లి ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నప్పుడు, ఆమె బిడ్డ బయటకు వచ్చే దారి అయిన ‘పెల్విక్‌  బోనీ క్యావిటీ’ సన్నగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఇలాంటివారిలో చాలాసార్లు సిజేరియన్‌ ద్వారానే బిడ్డను బయటకు తీయాల్సి రావచ్చు. ఈ అంశాలను బట్టి మనకు తెలిసేదేమంటే... మొదటిసారి సిజేరియన్‌ అయినంత మాత్రాన రెండోసారి కూడా తప్పనిసరిగా సిజేరియనే అవ్వాల్సిన 
నియమం లేదు.

మొదటి గర్భధారణకూ, రెండో గర్భధారణకూ మధ్య వ్యవధి తప్పనిసరిగా 18 నెలలు ఉండాలి. ఎందుకంటే మొదటిసారి గర్భధారణ తర్వాత ప్రసవం జరిగాక దానికి వేసిన కుట్లు పూర్తిగా మానిపోయి, మామూలుగా మారడానికి 18 నెలల వ్యవధి అవసరం. ఒకవేళ ఈలోపే రెండోసారి గర్భం ధరిస్తే మొదటి కుట్లు అంతగా మానవు  కాబట్టి అవి చిట్లే ప్రమాదం ఉంది. అలా జరిగితే బిడ్డకే కాదు... తల్లి ప్రాణానికీ ప్రమాదం.  

చదవండి: Fashion: డిజైన్‌లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ!  రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి!
Cancer Awareness: రొమ్ము నుంచి నీరులాంటి స్రావాలా? లోదుస్తులు బాగా బిగుతుగా ఉంటే..

మరిన్ని వార్తలు