కండలు పెరగాలంటే మాంసాహారమే అక్కర్లేదు!

4 Mar, 2021 14:00 IST|Sakshi

కండరాలు పెరిగి, మంచి శరీర సౌష్ఠవం కలగాలంటే తప్పనిసరిగా మాంసాహారం తినాల్సిన అవసరం లేదంటున్నారు పరిశోధకులు. శాకాహారంలో ఉండే ప్రొటీన్లు సైతం సౌష్ఠవం తో కూడిన కండర నిర్మాణానికి బాగా పనికి వస్తాయని పేర్కొంటున్నారు. కండరాల నిర్మాణానికి, వాటి పెరుగుదలకూ, నిర్వహణకూ  ప్రోటీన్‌ అవసరం. అయితే... బలమైన కండరానికి ప్రొటీన్‌ కావాలి తప్ప... అది మాంసం నుంచి లభ్యమైందా లేక శాకాహారంలో దొరికిందా అన్నది అంత ప్రధానాంశం కాదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌కు చెందిన పరిశోధకులు. వీరు వ్యాయామ నిపుణులైన దాదాపు మూడు వేల మంది స్త్రీ, పురుషుల మీద తమ అధ్యయనాన్ని నిర్వహించారు. వారిని ఆరు గ్రూపులుగా విభజించి, ఆరు రకాలైన వనరుల నుంచి, అంటే... బాగా కొవ్వులు ఎక్కువగా ఉండే పాలు–వాటి ఉద్పాదనలు, చేపలు, వేటమాంసం, చికెన్, కొవ్వు తక్కువగా ఉండే పాలు, బఠాణీ గింజల వంటి పూర్తి పప్పుధాన్యాలను వారికి ఆహారంగా అందించారు.

మిగతా పోషకాలను మామూలుగానే ఇచ్చారు. నిర్ణీత సమయం తర్వాత వారి కండరాలలోని మజిల్‌మాస్, కండరాలు బలం, కండరాల సౌష్ఠవం వంటి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని లెక్కించారు. ప్రోటీన్‌ ఏదైనప్పటికీ మజిల్‌మాస్, బలం, సౌష్ఠవం వంటి అంశాల్లో పెద్ద తేడాలేమీ కనిపించలేదు. పైగా డాక్టర్‌ కెల్‌సే మ్యాంగనో బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అధ్యయన పరిశోధనలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. అదేమిటంటే... శాకాహార ప్రొటీన్‌పై ఉంచిన వారిలో ప్రోస్టేట్‌కు సంబంధించిన  కొన్ని అనర్థాలు కనిపించలేదు. పైగా సోయాబీన్స్‌ వంటి శాకాహార ప్రోటీన్ల సహాయంతో బాడీబిల్డింగ్‌ చేసిన వారు మిగతావారి తో పోలిస్తే దీర్ఘకాలం బతికినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ పరిశోధనల వివరాలను అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ క్లినికల్‌ న్యూట్రిషన్‌’లో ప్రచురించారు. 

చదవండి: రాహుల్‌ కండలపై నెటిజన్ల ట్రోలింగ్‌

మరిన్ని వార్తలు