Cancer Awareness: రొమ్ము నుంచి నీరులాంటి స్రావాలా? లోదుస్తులు బాగా బిగుతుగా ఉంటే..

6 Mar, 2022 14:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఆందోళన కలిగించే ఆమె సమస్యలు! 

మహిళల్లో కనిపించే కొన్ని సమస్యలు చాలా ఆందోళన కలిగిస్తాయి. ఉదాహరణకు రొమ్ముల్లో కనిపించే స్రావాలు క్యాన్సర్‌ కారణంగానా అని భయపెడతాయి. కానీ ఆ లక్షణం తప్పనిసరిగా క్యాన్సర్‌ వల్లనే కానక్కర్లేదు. బిగుతైన దుస్తుల వల్ల కూడా కావచ్చు. అలాగే తినగానే గర్భిణుల్లో ఇబ్బంది కలగవచ్చు.

ఇలాంటి కొన్ని సమస్యలపై ఉండే సాధారణ అపోహలు తొలగించి, అవగాహన కలిగించే కథనాలివి... కొందరిలో రొమ్ము నుంచి నీరులాంటి స్రావాలు వస్తుంటాయి. ఈ కండిషన్‌ను గెలాక్టోరియా అంటారు. ఇలా జరుగుతున్నప్పుడు మహిళల్లో చాలా మంది దాన్ని క్యాన్సర్‌గా అనుమానించి, చాలా ఆందోళనకు గురవుతుంటారు. నిజానికి రొమ్ము నుంచి నీరు రావడానికి చాలా కారణాలుంటాయి.

మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ ఎక్కువగా విడుదల అవుతున్నప్పుడూ, మెదడులో ఏమైనా కంతుల వల్లగానీ, హైపోథైరాయిడిజమ్‌ వల్ల గానీ, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుండటం వల్ల గానీ, లోదుస్తులు బాగా బిగుతుగా ఉన్నా, రొమ్ములో కంతులు ఉన్నా లేదా యాంటీ డిప్రెసెంట్‌ మందులు వాడుతున్నా, అవే కాకుండా మరికొన్ని రకాల మందుల్ని చాలాకాలంగా వాడుతున్నా కూడా రొమ్ముల్లో నీరు రావచ్చు.

అయితే క్యాన్సర్‌లో కూడా ఇలా రొమ్మునుంచి స్రావాలు వస్తుండవచ్చు. అయితే... స్రావాలు కనిపించిన ప్రతిసారి అందుకు రొమ్ముక్యాన్సరే కారణం కాబోదు. అందుకే ఇలాంటి సమయాల్లో అనవసరంగా ఆందోళన చెందకుండా... తొలుత డాక్టర్‌ను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవాలి. దానికి కారణం ఏమిటో నిర్దిష్టంగా తెలుసుకోవాలి. రొమ్ము పరీక్ష చేయించుకున్నప్పుడు ఏవైనా గడ్డలుగానీ, ఇన్ఫెక్షన్‌గానీ ఉన్నాయా అని చూడాలి.

కొన్నిసార్లు రొమ్ము స్కానింగ్, మామోగ్రఫీ ప్రొలాక్టిన్‌ హార్మోన్, థైరాయిడ్‌ హార్మోన్, సీబీపీ, ఈఎస్‌ఆర్‌ వంటి పరీక్షలు అవసరం కావచ్చు. దానిలో బయటపడ్డ సమస్య లేదా కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. కొన్ని మందులను దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంటే మందుల్ని ఆపడం లేదా మార్చడం జరుగుతుంది. కొన్నిసార్లు సింపుల్‌గా దుస్తులను కాస్త వదులుగా వేసుకోవడం వల్లనే ఈ సమస్య తీరిపోవచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఆందోళన చెందకుండా డాక్టర్‌ను సంప్రదించడం అవసరం. 

చదవండి: Health Benefits of Eating Dates: తీపిగా ఉండే ఖ‌ర్జూరాలు త‌ర‌చుగా తింటున్నారా? ఈ విష‌యాలు తెలిస్తే!

మరిన్ని వార్తలు