మన దేశ మరణాలలో క్యాన్సర్‌ది రెండో స్థానం

24 Apr, 2021 23:03 IST|Sakshi

వైద్యరంగంలో క్యాన్సర్‌ను కనుగొనడానికి, చికిత్స అందించడానికి ఎన్నో ఆధునికతలు, విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నప్పటికీ... క్యాన్సర్‌ ఇంకా మానవాళికి ఒక పెనుసవాల్‌గానే ఉంది. ఇందుకు నిదర్శనం పెరుగుతున్న క్యాన్సర్‌ మరణాల సంఖ్య. మనదేశంలో మరణాల సంఖ్యలో క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది. 

గర్భాశయు ముఖద్వార క్యాన్సర్‌: మనదేశంలో మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో అగ్రభాగాన ఉండే క్యాన్సర్‌ ఇది. పెళ్లికాకముందే అమ్మాయిలు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను మూడు డోసులు తీసుకుంటే ఈ క్యాన్సర్‌ బారిన పడకుండా చూసుకోవచ్చు. మన దేశంలో స్త్రీలు చాలా ఆలస్యంగా దీన్ని గుర్తించడం వల్లనో లేక లక్షణాలు కనిపించి నిర్లక్ష్యం చేయడం వల్లనో నయం చేయలేని దశకు చేరుకుంటారు. కానీ ముందుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేయడం తేలిక అని చెప్పుకోవచ్చు.

దీని లక్షణాలు..
యోని నుంచి అసాధారణంగా ఊరే స్రావాలు 
నెలసరి మధ్యలో లేక కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం 
నెలసరి రక్తస్రావం ముందుకంటే ఎక్కువ అవ్వడం 
ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, అలసట... ఇంకా దశను బట్టి నడుమునొప్పి, ఎముకల నొప్పులు, కాళ్లవాపు వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. పాప్‌స్మియర్, కాల్పోస్కోపీ, బయాప్సీ వంటి పద్ధతులతో ఈ క్యాన్సర్‌ను గుర్తించి హిసెరోస్కోపీ, ఊపరెక్టమీవంటి సర్జరీలు చేస్తారు. 

రొమ్ముక్యాన్సర్‌: మహిళల్లో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం వయసు పైబడే కొద్దీ చాలా ఎక్కువ అవుతుంది. అవివాహిత స్త్రీలు, పిల్లలు కలగని మహిళలు, తల్లిపాలు పట్టించని మహిళల్లో, పదేళ్లలోపే రజస్వల అయి, 55 ఏళ్లు దాటాక కూడా మెనోపాజ్‌కు చేరుకోకపోవడం, దీర్ఘకాలం పాటు హార్మోన్‌ల మీద ప్రభావం చూపే మందులు వాడటం వల్ల, రక్తసంబంధీకుల్లో ఎవరికైనా ఈ క్యాన్సర్‌ ఉండటం వంటి అంశాలు ఉన్నవారిలో ఈ క్యాన్సర్‌ ఎక్కువ.
రొమ్మున కదలని, గట్టి గడ్డ తగలడం 
రొమ్ముల్లో లేక చంకల్లో గడ్డ లేక వాపు కనిపించడం 
చనుమొన సైజులో మార్పు, లోపలివైపునకు తిరిగి ఉండటం
రొమ్మ మీద చర్మం మందం కావడం, సొట్టపడటం, 
రొమ్ముపైభాగాన ఎంతకూ నయం కాని పుండు 
బ్రెస్ట్‌ సైజ్‌లో మార్పులతోపాటు చనుమొన నుంచి రక్తస్రావం అవ్వడం... వంటి లక్షణాలు కనిపించేసరికి ఈ క్యాన్సర్‌ తొలిదశను దాటిపోయే ప్రమాదం ఉంది. 

లివర్‌ క్యాన్సర్‌: పురుషుల్లో సాధారణంగా ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన లివర్‌ క్యాన్సర్, వయసు పైబడినవారిలో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ఎక్కువ.  ∙కడుపులో నొప్పి 
ఆకలి తగ్గడం, బరువు తగ్గడం
కామెర్లు, వాంతులు
పొట్టలో నీరు చేరడం వంటి లక్షణాలు ఈ క్యాన్సర్‌ తీవ్రతను తెలుపుతాయి.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌: ప్రపంచవ్యాప్తం గా చూస్తే క్యాన్సర్‌ సంబంధిత మరణాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ మరణాలే అధికం. పొగాకు ఉత్పాదనలు, బీడీ, చుట్ట, గుట్కా, పొగాకు నమలడం, సిగరెట్‌ వంటి అలవాట్లు కేవలం వారికే కాకుండా పక్కనున్నవారికీ ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది. ఈ క్యాన్సర్‌ బాధితుల్లో స్మోకింగ్‌ చేసేవారే ఎక్కువ. 
ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం 
బాగా దగ్గు, దగ్గుతో పాటు రక్తం 
ఆకలి తగ్గడం, బరువు తగ్గడం 
ఛాతీలో, పొట్టలో నొప్పి 
మింగడం కష్టంగా ఉండటం... మొదలైన లక్షణాలతో బయటపడే ఈ క్యాన్సర్‌కు ఇతర అవయవాలకు త్వరగా వ్యాప్తిచెందే గుణం ఎక్కువ. చెస్ట్‌ ఎక్స్‌రే, బయాప్సీ, సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారణ చేసి, స్పైరోమెట్రీ, బ్రాంకోస్కోపీ, రక్తపరీక్షలతో కణితి ఎక్కడ, ఏ దశలో ఉంది అనే విషయాలను తెలుసుకుని, అవసరమైతే లంగ్‌లో కొంతభాగాన్ని తొలగించే లోబెక్టమీ... అదీ కుదరకపోతే కీమోథెరపీ ఇస్తారు. 

స్టమక్‌ (కడుపు) క్యాన్సర్‌: మసాలాలు, బియ్యం, కారం ఎక్కువగా తినడమే కాకుండా ఖచ్చితంగా తెలియని కారణాలతో దక్షిణ భారతదేశంలోని పురుషుల్లో ఈ క్యాన్సర్‌ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అల్సర్‌ లక్షణాలలాగానే కనిపించే ఈ క్యాన్సర్‌ను అల్సర్‌లా పొరబడే ప్రమాదం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి జీర్ణాశయం అల్సర్‌ కూడ ఈ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. 
కడుపులో నొప్పి, అసిడిటీ, 
ఆకలి తగ్గడం, బరువు తగ్గడం 
వికారం, ఎక్కిళ్లు, తేన్పులు 
రక్తపు వాంతులు, మలంలో నల్లగా రక్తం పడటం వంటి లక్షణాలు ఈ క్యాన్సర్‌లో కనిపిస్తాయి. ఎండోస్కోపీ, బయాప్సీ, అవసరమైతే సీటీ స్కాన్, ఎమ్మారై వంటి పరీక్షలతో ఈ క్యాన్సర్‌ను నిర్ధారణ చేయడం జరగుతుంది. కణితి చిన్నగా ఉంటే వాటి చుట్టూ కొంతభాగాన్ని తీసివేసే గ్యాస్ట్రెక్టమీ నిర్వహిస్తారు. ఒకవేళ కణితి పెద్దగా ఉండి చుట్టూ ఉన్న కణజాలానికీ, లింఫ్‌నోడ్స్‌కూ పాకితే పొట్ట మొత్తాన్ని, అన్నవాహికలో కొంతభాగాన్ని, చిన్నపేగుల్లో కొంత భాగాన్ని తీసివేసి, మిగిలిన అన్నవాహికను చిన్నపేగులతో కలిపి కుట్టివేస్తారు. కానీ ఆ తర్వాత ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 

Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421, 
Kurnool 08518273001

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు