పర్యావరణ సంరక్షణ.. అందరికీ అర్థమయ్యేలా ఇమోజీ, కార్టూన్‌లతో

30 Aug, 2023 11:34 IST|Sakshi

‘కళ కళ కోసమే కాదు... పర్యావరణ సంరక్షణ కోసం కూడా’ అంటోంది యువతరం. సంక్లిష్టమైన పర్యావరణ అంశాలను సులభంగా అర్థం చేయించడానికి, పర్యావరణ స్పృహను రేకెత్తించడానికి గ్రాఫిటీ వర్క్, ఇల్లస్ట్రేషన్, ఇమోజీ, కార్టూన్‌లను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటుంది.

ఆర్ట్, హ్యూమర్‌లను కలిపి తన ఇలస్ట్రేషన్‌లతో పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంశాలను ప్రచారం చేస్తున్నాడు రోహన్‌ చక్రవర్తి. కామిక్స్, కార్టూన్‌లు, ఇలస్ట్రేషన్‌ సిరీస్‌లతో ‘గ్రీన్‌ హ్యూమర్‌’ సృష్టించాడు. రెండు జాతీయ పత్రికల్లో వచ్చిన ఈ సిరీస్‌ను పుస్తకంగా ప్రచురించాడు. తన కృషికి ఎన్నో అవార్ట్‌లు వచ్చాయి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రోహన్‌ చక్రవర్తి కార్టూన్‌లను పర్యావరణ పరిరక్షణ ప్రచారానికి వినియోగించుకుంటున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన రోహన్‌ పదహారు సంవత్సరాల వయసు నుంచే కార్టూన్‌లు వేయడం మొదలుపెట్టాడు.‘పర్యావరణ సంక్షోభ తీవ్రతను కామిక్స్‌తో బలంగా చెప్పవచ్చు. శాస్త్రీయ విషయాలపై ఆసక్తి ఉన్న వారినే కాదు, వాటిపై అవగాహన లేని వారిని కూడా ఆకట్టుకొని మనం చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సులభంగా చెప్పవచ్చు’ అంటున్నాడు రోహన్‌ చక్రవర్తి.

కార్టూనిస్ట్, గ్రాఫిక్‌ స్టోరీ టెల్లర్‌ పూర్వ గోయెల్‌ తన కళను పర్యావరణ సంబంధిత అంశాల ప్రచారానికి ఉద్యమస్థాయిలో ఉపయోగిస్తోంది. పర్యావరణ నిపుణులు, పరిశోధకులు, పర్యావరణ ఉద్యమ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ‘అన్ని వయసుల వారిని ఆకట్టుకొని, అర్థం చేయించే శక్తి కార్టూన్‌లకు ఉంది’ అంటోంది 26 సంవత్సరాల పూర్వ గోయెల్‌.పశ్చిమ కనుమల జీవవైవిధ్యానికి వాటిల్లుతున్న ముప్పు నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని దిబంగ్‌ లోయలోని మిష్‌మి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల వరకు పూర్వ గోయెల్‌ తన కళ ద్వారా ఆవిష్కరించింది. అభివృద్ధిగా కనిపించే దానిలోని అసమానతను ఎత్తి చూపింది. డెహ్రడూన్‌కు చెందిన పూర్వ గోయెల్‌ నదులు, అడవులు ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్యను దగ్గరి నుంచి చూసింది.

బెల్జియంలో గ్రాఫిక్‌ స్టోరీ టెల్లింగ్‌లో మాస్టర్స్‌ చేసింది. ఐక్యరాజ్య సమితి జీవవైవిధ్యం అంశంపై కెనడాలో నిర్వహించిన సదస్సుకు హాజరైంది.‘ఆ సదస్సులో వక్తలు పర్యావరణ విధానాల గురించి సంక్లిష్టంగా మాట్లాడారు. సామాన్యులు ఆ ప్రసంగ సారాన్ని అర్థం చేసుకోవడం కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థమయ్యేలా పర్యావరణ విషయాలను చె΄్పాలనుకున్నాను. దీనికి నా కుంచె ఎంతో ఉపయోగపడింది. నన్ను నేను కమ్యూనికేటర్‌గా భావించుకుంటాను’ అంటుంది పూర్వ గోయెల్‌. ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా కామిక్‌ బుక్‌ తయారుచేసింది గోయెల్‌. ఈ కామిక్‌ బుక్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘మేము ఎన్నో రిపోర్ట్‌లు విడుదల చేశాం. కాని ఒక్క రిపోర్ట్‌ చదవడానికి కూడా మా ఎకౌంటెంట్‌  ఆసక్తి చూపించలేదు. కామిక్స్‌ రూపంలో ఉన్న రిపోర్ట్‌ ఆమెకు బాగా నచ్చింది.

కామిక్స్‌ ద్వారా తెలుసుకున్న విషయాలను ఇతరులకు చెప్పడం మొదలు పెట్టింది’ అని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పినప్పుడు ఉత్సాహం రూపంలో గోయెల్‌కు ఎంతో శక్తి వచ్చి చేరింది. ‘గ్రాఫిక్‌ డిజైన్‌లో భాగంగా బ్రాండ్‌ డిజైన్‌ నుంచి పబ్లికేషన్‌ డిజైన్‌ వరకు ఎన్నో చేయవచ్చు. కాని నాకు కామిక్‌ స్ట్రిప్స్‌ అంటేనే ఇష్టం. ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్‌ను సంక్షిప్తంగానే కాదు అర్థమయ్యేలా చెప్పవచ్చు. ఒకటి లేదా రెండు వాక్యాలు, ఇమేజ్‌లతో పెద్ద స్టోరీని కూడా చెప్పవచ్చు’ అంటున్న అశ్విని మేనన్‌ గ్రాఫిక్‌ డిజైన్‌ను పర్యావరణ అంశాల ప్రచారానికి బలమైన మాధ్యమంగా చేసుకుంది.బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ)లో చదువుకున్న అశ్విని కళకు సామాజిక ప్రభావం కలిగించే శక్తి ఉందని గ్రహించింది. తన కళను సమాజ హితానికి ఉపయోగించాలనుకుంది.

రిచీ లైనల్‌ ప్రారంభించిన డాటా స్టోరీ టెల్లింగ్‌ సంస్థ ‘బెజలెల్‌ డాటా’ అసాధారణ ఉష్ణోగ్రతలకు సంబంధించిన సంక్లిష్టమైన సమాచారం అందరికీ సులభంగా, వేగంగా అర్థమయ్యేలా యానిమేటెట్‌ ఇమోజీలను క్రియేట్‌ చేస్తోంది.‘సంప్రదాయ రిపోర్ట్‌ స్ట్రక్చర్స్‌ ప్రకారం వెళితే అందరికీ చేరువ కాకపోవచ్చు. రిపోర్ట్‌ సారాంశాన్ని సులభంగా అర్థం చేసుకునేలా డాటా కామిక్స్‌ ఉపయోగపడతాయి. పెద్ద వ్యాసం చదువుతున్నట్లుగా కాకుండా ఇతరులతో సంభాషించినట్లు ఉంటుంది’ అంటున్న రిచీ లైనల్‌ ఎన్నో స్టోరీ టెల్లింగ్‌ వర్క్‌షాప్‌లు నిర్వహించాడు క్లైమెట్‌ డాటాపై అజిమ్‌ ప్రేమ్‌జీ యూనివర్శిటీతో కలిసి పనిచేశాడు. సంక్లిష్టమైన విషయాలను సంక్షిప్తంగా, సులభంగా అర్థమయ్యేలా చేయడానికి రిచీ లైనల్‌ అనుసరిస్తున్న మార్గంపై యువతరం ఆసక్తి  ప్రదర్శిస్తోంది.

మెరైన్‌ బ్లాగిస్ట్, నేచర్‌ ఫొటోగ్రాఫర్‌ గౌరవ్‌ పాటిల్‌ రాతలతోనే కాదు ఇలస్ట్రేషన్స్, ఫొటోలతో పర్యావరణ సంబంధిత అంశాలను ప్రచారం చేస్తున్నాడు. సముద్ర కాలుష్యం నుంచి కాంక్రీట్‌ జంగిల్స్‌ వరకు ఎన్నో అంశాల గురించి తన ఇల్లస్ట్రేషన్‌ల ద్వారా చెబుతున్నాడు.బెంగళూరుకు చెందిన అక్షయ జకారియ వైల్డ్‌లైఫ్‌ డాక్యుమెంటరీలు చూస్తూ పెరిగింది. పర్యావరణంపై ఆసక్తి పెంచుకోవడానికి అది కారణం అయింది. పర్యావరణ సంరక్షణపై అవగాహనకు ఇలస్ట్రేషన్, డిజైన్‌లను ఉపయోగిస్తోంది. రోహన్‌ చక్రవర్తి నుంచి అక్షయ వరకు పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే అందరినీ ప్రకృతి ప్రపంచంలోకి తీసుకువచ్చింది అనురక్తి మాత్రమే కాదు అంతకంటే ఎక్కువైన అంకితభావం కూడా.
  

మరిన్ని వార్తలు