ఈవారం కథ: కేటరింగ్‌ బోయ్‌

1 Aug, 2021 11:55 IST|Sakshi

చింకిచాప, అతుకులబొంత మీద పడుకున్న ఈశ్వర్‌ బద్ధకంగా దొర్లుతున్నాడు. జీర్ణావస్థలో ఉన్న దిండులో దూది, చిరిగిన గలేబు మృత్యుశయ్య మీద మరణానికి ఎదురుచూస్తున్న ముసలిరోగుల్లా ఉన్నాయి. వాటిని వదల్లేని ఈశ్వర్‌ పేదరికం కొన ఊపిరిని కాపాడాలనుకునే వెంటిలేటర్‌లా వెంటపడుతోంది.
‘నిన్న రాత్రి యామిని ఇచ్చిన కాగితంలో ఏమి రాసిందిరా?’ చక్రపాణి అడగడంతో జేబు తడుముకున్నాడు ఈశ్వర్‌.
‘చూసి చెపుతానులే’ ప్రాధాన్యంలేని  విషయమన్నట్లు సమాధానం దాటేశాడు.

‘అమ్మాయి ఉత్తరం ఇస్తే ఇంతసేపు చూడకుండా ఎలాగున్నావురా?’
‘ఇచ్చింది  ప్రేమలేఖ కాదు. కాగితం ముక్క’
‘నిన్ను మార్చడం నా వల్ల కాదురా’ తల కొట్టుకున్న చక్రపాణి, మరోమాట చెప్పకుండా ఆఫీసుకెళ్లాడు.
ఈశ్వర్‌కి మూడేళ్ళ క్రితం దూరమైన యామిని గుర్తొచ్చింది. చదువుకునేరోజుల్లో ఒకరినొకరు  ఇష్టపడ్డారు. స్థాయీ అంతరం అంతరంగాల ప్రేమకి అడ్డం పడింది. కల కరిగిపోయి యామిని పెళ్లి జరిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు గుండెకైన గాయం రేగింది. తేనెపట్టులోంచి రాయిదెబ్బకు ఎగిరిన తేనెటీగలా ముందురోజు జరిగిన సంఘటన మెదడులో మెదిలింది.


‘ఈశ్వర్, నువ్వు లక్కీచాన్స్‌ కొట్టేశావ్‌. నాలుగ్గంటలు పనిచేస్తే ఐదువందలు ఇస్తారు. భోజనం బోనస్‌’ చక్రపాణి చెప్పాడు.
‘నాలుగ్గంటలకు ఐదువందలా?’ నోరు వెళ్లబెట్టాడతను.
‘తర్వాత ఆశ్చర్యపోదువుగానీ పార్టీటైమ్‌ అయిపోతోంది. మా హోటల్‌ కేటరింగ్‌ సర్వీసుకి రెగ్యులర్‌ కుర్రాళ్లురాలేదు. మేనేజర్‌ నాకు తెలుసున్న కుర్రాళ్లని తీసుకురమ్మనాడు’
‘వద్దులేరా. నాకు వడ్డించడంలో ఓనమాలు తెలియవు. అన్నం లేకపోతే నీళ్లు తాగి, కాళ్ళు కడుపులో పెట్టుకునిç ³డుకుంటాను. తేడా జరిగితే తిట్లు తినాలి’
‘ఆ సంగతి నాకు వదిలేయ్‌ నేన ుచూసుకుంటాగా’ చక్రపాణి ధైర్యం చెప్పడంతో యూనిఫాం వేసుకుని కేటరింగ్‌ బోయ్‌గా బండి ఎక్కాడు ఈశ్వర్‌.
పెద్ద వాళ్ళింట్లో పార్టీ. గుబులుగానే గుంపుతో అడుగులేశాడు. వణుకుతున్న చేతులతో చెంచా పట్టుకుని వడ్డనకు సిద్ధపడ్డాడు. ధైర్యం  కుదుటపడుతున్న సమయంలో తనకళ్ళని తానే నమ్మలేక పోయాడు ఈశ్వర్‌. యామిని.. మూడేళ్ళ తర్వాత .. కనిపిస్తోంది. భర్తతో పార్టీకొచ్చింది. ఆమె నడచి వస్తున్న నగల దుకాణంలా ఉంది. ఆమె వేసుకున్న నగల విలువ అంచనాకి అందని టెండర్లా ఉంది. వజ్రాలహారం మీద పడ్డ దీపాలకాంతి మొహం మీద పడుతూ దేవకన్యలా వెలిగిపోతున్న ఆమెను మళ్లీమళ్లీ చూడాలనిపిస్తోంది. తెలియని బెరుకు వెనక్కి లాగేస్తోంది. అక్కడున్న జనం మహారాణి ముందు భటుల్లా వంగివంగి దండాలు పెడుతున్నారు.
‘మీకేం కావాలో చెప్పండి మేడం.. తెప్పిస్తా’ పళ్ళెంతో వెళ్తున్న యామినిని ఆపే ప్రయత్నం చేశాడో పెద్దమనిషి. యామిని ఆగలేదు. ఎవరినీ పట్టించుకోకుండా ఈశ్వర్‌ వైపే వెళ్తోంది.

ఐదువందలకు ఆశపడ్డ ఈశ్వర్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా వుంది. ఆమె కంటపడకుండా చేసిన ప్రయత్నం ఫలించేలా లేదు. యామిని దగ్గరకు వచ్చేస్తోంది. అతనిలో ఉద్విగ్నత పున్నమిరాత్రిలో సముద్రపోటులా పెరుగుతోంది. అతని పట్ల యామిని చూపుల్లో చులకన భావం కనిపించింది. ఆమె ఆలోచనల్లో  మార్పొచ్చినట్లు ఆమె చూపులను బట్టి అర్థమవుతోంది. వెళ్లిపోతున్న యామిని.. కాగితమొకటి ఈశ్వర్‌ వైపుగా విసిరేసి వెనక్కి చూడకుండా వెళ్లిపోయింది. ఈశ్వర్‌æఆ కాగితాన్ని అసంకల్పితంగా జేబులో పెట్టాడు. 

గమనించిన చక్రి ‘యామిని ఏం విసిరిందిరా?’ అని అడిగాడు.
సమాధానం చెప్పకుండా యూనిఫాం మార్చేసుకున్నాడు ఈశ్వర్‌. తర్వాత వాళ్ళిద్దరూ నడుచుకుంటూ ఇంటికి బయల్దేరారు. వాళ్ళతోపాటుగా మౌనం, చీకటీ అడుగులేస్తున్నాయి. రోడ్డు మీద గుంతల్లో నిలిచిపోయిన వర్షం నీళ్ళలో చిక్కటి చీకటి నల్లగా ఆక్రమించింది. దూరంగా కీచురాళ్ళ మోత వినిపిస్తోంది. వీధిలో అలికిడికి కుక్కలు మొరుగుతున్నాయి. ఈశ్వర్‌ గుండె బరువు.. యామిని వేసుకున్న నగల బరువు కన్న ఎక్కువగానే ఉంది. నియంత్రణ లేని నిశ్శబ్దం.. ఓపలేని నిశ్శబ్దం..  గుండె చప్పుడు వినిపించేంత నిశ్శబ్దం. మనిషి మోయలేనంత బరువుగా నిశ్శబ్దం. ఆ భయంకర నిశ్శబ్దంలోంచి అతనిలో ఊపిరి ఆగిఆగి తెరలుగాౖ బెటకొస్తోంది.
‘తప్పు చేశానురా చక్రీ.. ఈ అవమానం పడే కన్నా ఆకలిని భరించడమే హాయిగా ఉండేదేమో?’
‘తప్పంతా నాదేరా! నేనే బలవంతంగా తీసుకొచ్చాను. ఒక్కసారి ఆ కాగితం..’ 
‘ఇప్పుడు వద్దురా. చూస్తే తట్టుకునే శక్తి..’ ఈశ్వర్‌ ఏదో చెప్పబోయాడు. మాట పెగలటం లేదు. గొంతుకి బాధ అడ్డం పడుతోంది. మాట్లాడుకోకుండానే రూమ్‌కెళ్లారు. 


బద్ధకాన్ని వదుల్చుకున్న ఈశ్వర్‌కు.. పార్టీలో గుచ్చుకున్న యామిని చూపులు గుర్తుకొచ్చాయి. జేబులో కాగితం కసిగా నలిపేసి విసిరేశాడు. కాగితంలో ఏం రాసుంటుందనే ఆలోచన మనసుని స్థిమితంగా ఉంచలేదు. విసిరేసిన కాగితాన్ని తెచ్చుకుని విప్పిచూశాడు.
‘రెండురోజుల తర్వాత ఇంటికిరా’ కింద మొబైల్‌ నంబర్, అడ్రస్‌ రాసుంది. 
‘ఏం రాసిందిరా మాజీప్రియురాలు?’ ఆఫీస్‌ నుంచి వస్తూనే అడిగాడు చక్రి.
‘అసలు ఎందుకు రమ్మందంటావు?’ చక్రపాణి చేతికి కాగితమిస్తూ అనుమానం బైట పెట్టాడు ఈశ్వర్‌.
‘హీనస్థితి గుర్తుచేసి అవమానించాలని పిలిచిందా!’ మనసులో సందేహం బైట పెట్టాడు.
‘అవమానించడానికి పిలవక్కర్లేదు. పార్టీ విషయమైతే తప్పు నా వల్ల జరిగిందని చెప్పు’
‘వెళితే తెలుస్తుందిగా. అప్పుడు చూద్దాంలే. ఇప్పుడైతే వేడిగా టీతాగుదాం..’ సంభాషణ పొడిగించడం ఇష్టంలేక బైటికి తీసుకెళ్లాడు ఈశ్వర్‌. 
∙∙ 
ఈశ్వర్‌ పెద ్దభవంతి ముందు నిలబడ్డాడు. నల్లటి గ్రానైట్‌ రాయి మీద బంగారు రంగు అక్షరాలతో ‘యామిని నిలయం’ అని అందంగా చెక్కి ఉంది. ఇంటి ముందు ఒకే నెంబరున్న కార్లు బారులు తీరి క్రమశిక్షణగా ఉన్నాయి. ఇల్లులా అనిపించలేదు. రక్షణవలయం మధ్య దుర్భేద్యమైన కోటలా కనిపించింది. లోపలికి వెళ్తున్న ఈశ్వర్‌ వేషం, భాష చూసిన సెక్యూరిటీ ఆపేశాడు.
‘యామిని మేడమ్‌కి ఈశ్వర్‌ వచ్చాడని చెప్పండి’ అనడంతో సెక్యూరిటీ ఫోన్‌లో మాట్లాడి, ‘మేడం మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు సార్‌’ అన్నాడు వినయంగా.
లోపలికి నడిచాడు. పాలరాతి మెట్లు పాదముద్రలకు మాసిపోతాయని భయంతో పదిలంగా అడుగులేస్తున్నాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే సినిమా సెట్టింగ్‌లాంటి విశాలమైన హాల్‌. సీలింగుకి ఖరీదైన షాండిలియర్‌ వేలాడుతోంది. సూర్యుడు మకాం వేసినట్లు ఇంట్లో దీపాల వెలుగుకి కళ్ళు జిగేల్మంటున్నాయి. ఇల్లు్లవజ్రాలు పొదిగిన హారంలా  ధగధగ లాడిపోతోంది. ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఇల్లంతా కలయ చూస్తున్నాడు. ఘల్లుఘల్లుమంటూ మెట్ల మీద నుంచి వస్తున్న మువ్వల చప్పుడుకి అటుగా చూశాడు. పూత పూసిన దర్పం నిలువెత్తు యామినై నడిచి వస్తున్నట్లుంది. ఆమెను చూసిన ఈశ్వర్‌ స్థాణువులా నిలబడి పోయాడు.
‘నిలబడ్డావేం? కూర్చో’ సోఫా చూపించింది. ఖరీదైన సోఫాలో కూర్చోడం ఈశ్వర్‌కి  ఇబ్బందిగా అనిపించింది. 
‘ఏం తీసుకుంటావ్‌.. కాఫీ,టీ, బోర్న్‌విటా , ఫ్రూట్‌ జ్యూస్‌?’

‘ఒక గ్లాస్‌ మంచి నీళ్లు’ అంటూ  ఈశ్వర్‌ చెప్పిన తీరుకి యామిని నవ్వింది. నవ్వినప్పుడు తళుక్కుమని మెరిసిన పన్ను పైన పన్ను చూస్తూ అలాగే ఉండిపోయాడు. లిఫ్ట్‌లోంచి పనమ్మాయి రెండు నీళ్ల గ్లాసులున్న ట్రేతో వచ్చింది. ఇంట్లో లిఫ్ట్‌ ్టఉండడం ఈశ్వర్‌ ఊహకందని విషయం.
‘ఇల్లు చాలా బాగుంది’ మంచినీళ్ళు గుటకలేస్తూ అన్నాడు.
‘కాఫీ తీసుకురా’ పనమ్మాయికి ఆర్డర్‌ వేసింది యామిని.
‘మూడు అంతస్తుల్లో పద్దెనిమిది గదులు ఉన్నాయి. మావారు నా పుట్టిన రోజు కానుకగా ‘యామిని నిలయం’ కట్టించారు’ మనసులోని అహంకారం మాటల్లో ధ్వనించింది.
‘ఇంట్లో ఎంతమంది..’

ఈశ్వర్‌ మాట పూర్తికాకుండానే చెప్పింది ‘మేమిద్దరమే’ అంటూ. 
‘ఏమిటి పద్దెనిమిది గదుల్లో ఇద్దరే ఉంటారా?’ఆశ్చర్యపోయాడు.
‘ప్రస్తుతం ఒక్కదాన్నే ఉన్నాను. ఆయన బిజినెస్‌ పని మీద లండన్‌ వెళ్లారు’
ట్రేలోని కెటిల్స్, కప్పులతో వచ్చిన పనమ్మాయిని వాటిని టీపాయి మీదపెట్టి  వెళ్లిపొమ్మని సైగ చేసింది యామిని. శిరసా వహించింది పనమ్మాయి. 
అక్కడ ఉన్న ఆ ఇద్దరి మధ్య నిశ్శబ్దం అధికారం చెలాయిస్తోంది. ఒక కెటిల్లోంచి కాఫీ డికాక్షన్, మరో కెటిల్లోంచి పాలు కప్పులో పోసింది. దాంట్లోషుగర్‌ క్యూబ్స్‌ వేసి చెంచాతో కలిపి కప్పుని సాసర్లో పెట్టి అందించింది. కప్పుల చప్పుడుకి నిశ్శబ్దం చెదిరి పోయింది. కప్పు అందుకుంటుంటే ఈశ్వర్‌ చేతులు వణికాయి. 
‘చేతులెందుకు వణుకుతున్నాయి?’
‘ఏంలేదు’ మాటలు కూడా తడబడ్డాయి. 
‘నువ్వు చేసిన పని నాకు నచ్చలేదు’ హఠాత్తుగా అనేసింది.
‘ఏ పని?’ అర్థంకానట్లు అడిగాడు.
‘ఆరోజు పార్టీలో..’ మొహంలో చికాకు స్పష్టంగా కనబడింది.
‘అవసరం చేయించింది’
‘నీ అవసరం డబ్బేనా?’ పర్సులోంచి నోట్ల కట్టలు తీసి టీపాయి మీద విసిరింది.
‘ఇంకా కావాలా? అవసరమైతే అడుగు’ మాటల్లో డబ్బు పొగరు కనిపించింది. ఆ క్షణంలో ఈశ్వర్‌కు వచ్చిన కోపం విద్యుత్తీగలో కనబడకుండా కదిలిన  కరెంటులా ఉంది. తనని తాను సంభాళించుకున్నాడు. మౌనంగా డబ్బు తీసి పక్కన పెట్టాడు.
ముట్టుకుంటేనే నిప్పు కాలుతుంది. ఆకలి బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది. పైకిరాని మాటలు మనసులోనే కొట్టుకుంటున్నాయి. ఆత్మాభిమానానికున్న శక్తి  గుండెల్ని బలంగా తట్టి లేపింది.

‘నీ పెళ్ళికి బహుమతి ఇవ్వలేదని బాధపడేవాడ్ని. ఇల్లు చూశాక ఇవ్వకపోవడమే మంచిదనిపించింది. ఈ ఇంటిలో నీకంటికి చిన్నదిగానే కనబడేది’ అతనన్న మాటకు ఆమె నవ్వింది. ఆ నవ్వులో అహంకారం కనిపించింది.
‘ నువ్వు మరచిపోలేని విలువైన బహుమతి ఇద్దామని ఉంది. చిన్నకోరిక తీరుస్తావా?’ లేచి నిలబడ్డాడు. ఊహించని ప్రశ్నకు యామిని కంగారు పడింది. 
‘కంగారుపడకు. పెళ్ళైన స్త్రీని కోరుకునేంత బలహీనుడ్ని కాదు’ చెపుతోంటే స్వచ్ఛమైన సరస్సులో నిర్మలమైన పున్నమిచంద్రుడి ప్రతిబింబంలా ఉన్నాడు ఈశ్వర్‌.
‘ఏమిటో చెప్పు’ కంగారుని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో అడిగింది.
‘మనమిద్దరం కలసి భోజనం చేయాలి’
‘ఓస్‌! ఇంతేనా? నీకేం కావాలో చెప్పు. గంటలో ఏర్పాటు చేస్తా’ అంటూ పక్కనున్న బెల్‌ కొట్ట బోయింది.
‘ఇక్కడ కాదు. బైటకెళ్లాలి’ 
ఆశ్చర్యంగా చూసింది. ఆమెకు ఈశ్వర్‌ కొత్తగా కనిపించాడు. ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు అతను. ఆలోచిస్తోంది యామిని. అంగీకరించదనిపించి సోఫాలోంచి లేచి గుమ్మం వైపు కదిలాడు ఈశ్వర్‌. 
‘అగు!’ అన్న ఆమె పిలుపుతో ఆగిపోయాడు ఈశ్వర్‌. 
‘సరే! నీకోసం ఒప్పుకుంటున్నా. ఏ హోటల్‌కు వెళ్దాం?’
‘నేను తీసుకెళ్ళేది స్టార్‌ హోటల్‌ కాదు. నా స్థాయి హోటల్‌. మనం వెళ్ళేది ఆటోలో’
‘ఆటొలోనా? నా ఇంటి ముందున్న కార్లను చూసే చెప్తున్నావా? నేను గుమ్మం దాటితే ఏ కారు ఎక్కుతానో ఆఖరి క్షణం వరకు నాకే తెలియదు. అలాంటిది నాగుమ్మం ముందే ఆటో ఎక్కితే..’
‘నాలాంటి పేదవాడికి ఆటోలో వెళ్లడమంటే విమానంలో ఎగిరినట్టే. ఖరీదైన కార్లు ఎక్కే అర్హత లేనివాడ్ని. ఆటోలో వస్తే పనివాళ్ళ ముందు చులకన కదా! నీకు ఇబ్బందనిపిస్తే వద్దులే’ ఆమెలో అహాన్ని మాటలతో రాజేశాడు. 
‘ఆఫ్ట్రాల్, నా దగ్గర పనిచేసే వాళ్ళ మాటల్ని నేను పట్టించుకోవడం ఏంటి? నాన్సె¯Œ ్స’ అంటూ బయలుదేరింది యామిని. 
ఇద్దరూ బయటకు నడిచారు. కారు లేకుండా తొలిసారిగా  కాలి నడకన బయటకు వస్తున్న యామినిని  చూసినవాళ్లు ఆశ్చర్య పోయారు. ఈశ్వర్‌ ఆటోని పిలిచేముందు జేబు తడుముకున్నాడు. కరెన్సీ నోటు స్పర్శ తగిలి ధీమాగా  ఆటోఎక్కాడు. అతని దృష్టంతా తిరుగుతున్న ఆటో మీటర్‌ మీదే ఉంది. పైకి మాత్రం మొహమాటంగా నవ్వుతున్నాడు. ఆటో సిటీకి దూరంగా ఉన్న హోటల్‌ ముందు ఆగింది. ఇద్దరూ ఆటో దిగారు. తిరిగి ఇచ్చిన చిల్లర లెక్కపెట్టుకున్నాడు. హోటల్లోకి వెళ్ళాడు. జనంతో హోటల్‌ కిక్కిరిసి ఉంది.

‘టిఫిన్‌ తేవడానికి ఇంకా ఎంతసేపు?’ అంటూ హోటల్లోపల నుంచి అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి.
‘యామినీ.. లోపల ఫుల్‌ పబ్లిక్‌  ఉన్నారు. మరో చోటకెళదామా?’ బైటకొచ్చి చెప్పాడు.
‘ముందే సీట్లు రిజర్వ్‌ చేయవలసింది ’ ఆమెలో విసుగు మొహం మీద కనిపించింది.
‘ఈ హోటల్లో బుకింగ్స్‌ ఉండవు. అందరికీ సదా స్వాగతమే’ నవ్వుతూ చెప్పాడు. 
ఇద్దరూ మరో హోటల్‌ వైపు నడిచారు. అక్కడ జనం కన్నా టేబుల్‌ మీద బొద్దింకలు, ఈగలే ఎక్కువగా ఉన్నాయి. చికాకుగా మొహంపెట్టి ‘ఇక్కడొద్దులే ఈశ్వర్‌. మరో చోటకు వెళదాం’ అంది.

వేసవి ఎండ మండి పోతోంది. వడగాల్పులకు వదిలే శ్వాస వేడిగా వస్తోంది. నడవలేక యామిని ఆపసోపాలు పడుతోంది. నుదుటి మీద చెమటను రూమాలుతో తుడుచు కుంటోంది. దాహంతో గొంతు పిడచకట్టుకు పోతోంది. యామిని మొహంలో అలసట, కళ్ళలో నీరసం కనిపిస్తున్నాయి.  
‘ఇక నావల్ల కావటంలేదు. ఆకలి చంపేస్తోంది. అర్జెంటుగా ఏదోకటి తినాలి’ అంటూ రోడ్డు పక్కన చెట్టు నీడలో నిలబడిపోయింది. 
‘నా పరిస్థితీ అదే.  మరో కిలోమీటర్‌ దూరం దాకా హోటల్స్‌ ఏం లేవు కానీ దొసెల బండి ఉంది. అక్కడ దోసెలు బాగుంటాయి తిందామా?’ అన్నాడు. 
‘చెప్పానుగా ఎక్కడోక్కడ.. ఏదోకటి..! ఆకలితో కాలే కడుపుకి మండే బూడిద అంతే’
‘బండి దగ్గర నిలబడి నువ్వు తినలేవులే. ఇక్కడే కూర్చో. నేనేతెస్తా’ అంటూ దోసెల బండి దగ్గరకు వెళ్లి దోసెలు తెచ్చాడు. 
 అవురావురంటూ నాలుగు దోసెలు తినేసింది. ఎక్కిళ్ళు వస్తుంటే ఈశ్వర్‌ ఇచ్చిన కుండలో నీళ్లను గడగడా తాగేసింది. అప్పుడు యామినికి మినరల్‌ వాటర్‌ గుర్తుకు రాలేదు. ఆకలి తీరాక ఆయాసం తీర్చుకుంటోంది. వచ్చి నెమ్మదిగా పక్కనే కూర్చున్నాడు ఈశ్వర్‌.
‘ప్రపంచంలో విలువైనది, మనిషి బతకడానికి కావలసిందేమిటి?’ అని అడిగాడు. 

ఒక క్షణం ఆలోచించి ‘డబ్బు’ అంది.
బిగ్గరగా నవ్వాడు ఈశ్వర్‌. ఆసహనంగా చూసింది యామిని. 
‘డబ్బులో పుట్టిపెరిగిన నీకు అదే తెలుసు’ 
‘దరిద్రం నుంచి వచ్చిన వాడివిగా నీకు తెలిసిందేమిటో చెప్పు’ కోపంతో ఆమె మాట అదుపు తప్పింది.
‘నిజమే.. నేను పేదరికంలో పుట్టాను. దరిద్రంలోనే బతుకుతున్నాను. నా బతుకు దరిద్రానికి కేరాఫ్‌ ఎడ్రస్‌. దరిద్రుడు అనేది నాలాంటి వాళ్ళకుండే బిరుదు’ ఈశ్వర్‌ శాంతంగా సమాధానం చెపుతోంటే యామిని తప్పు తెలుసుకుంది.
‘సారీ ఈశ్వర్‌. కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేకపోయాను’
‘ఫర్వాలేదు. చదివించిన తల్లితండ్రులకి చేదోడుగా ఉండి ఋణం తీర్చుకోలేని దౌర్భాగ్యుడిని. నన్ను ఆ మాటనడం సబబే. నన్ను మీ ఇంట్లో ఓ ప్రశ్న అడిగావు.. గుర్తుందా?’
 ఏమిటన్నట్లుచూసింది. 

‘పార్టీలో కేటరింగ్‌ సర్వీస్‌ ఎందుకు చేశావని’ గుర్తు చేశాడు. అవునన్నట్లు తలూపుంది యామిని 
‘నన్ను అభిమానించే వ్యక్తిగా నీకు నా బతుకు పట్ల బాధ సహజం. కానీ మీ జీవితాల్లాగా మాలాంటోళ్ల బతుకు వడ్డించిన విస్తరి కాదు. మెతుక్కోసం వెతుక్కునే బతుకులు మావి. నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్ళడం కోసం ఏ పనైనా చేస్తాం. నేను అదే చేశాను. కడుపులో ఆకలి మంటని ఆర్పడం కోసం కేటరింగ్‌ బోయ్‌ పని చేశాను’ అని చెపుతోంటే ఈశ్వర్‌ గొంతు గాద్గదికమైంది. అక్కడున్న గ్లాస్‌లోని  నీళ్లను  గుటకేసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు.
‘ఎన్నో స్టార్‌ హోటల్స్‌ చూసిన నువ్వు రోడ్డు పక్క బండిలో దోసెలు తిన్నావు. మినరల్‌ వాటర్‌ తాగే నువ్వు ఎప్పటి నీళ్ళో తెలియకుండానే కుండలో నీళ్ళు తాగావు. అదే ఆకలికున్న శక్తి. ఆకలేస్తే తినేది అన్నం. కరెన్సీ నోట్లు కావు. కోట్ల విలువైన భూములు కొన్నివేల ఎకరాలుండచ్చు. ఎవరికైనా కావలసింది ఆరు అడుగులే. అలాగే జానెడు పొట్టకు కావలసింది పిడికెడు మెతుకులే. ఎవరైనా ఆకలికి బానిసే. ఎంతటి వారైనా ఆకలికి దాసులే. ఆకలి ప్రపంచాన్ని శాసిస్తుంది. అందుకే సకల చరాచార సృష్టిలో విలువైనది ఆకలి. ఈ విషయం నీకు ఇంటి దగ్గరే చెప్పచ్చు. ఆకలి విలువ అనుభవపూర్వకంగా నీకు తెలవాలని ఈ పని చేశాను. మన్నించు’ మనసులో కొట్టుకుంటున్న మాటలు చెప్పి బరువు దించుకున్నాడు.
‘నేను ఇచ్చిన డబ్బులు తీసుకుని ఆకలిని తీర్చుకోవచ్చు కదా!’
‘కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి. ఎవరి దయాదాక్షిణ్యాల మీదో  కాదు. అప్పుడే దాని విలువ తెలుస్తుంది. ముష్టితో బతికే బతుకు బతుకు కాదు. దొంగతనం చేసి సంపాదించవచ్చు. ఆ పని ఆత్మహత్యతో సమానం. మన సంపాదనలో నైతికత ఉండాలి. మనం చేసే పనివల్ల పరువు పోకూడదు. మన వల్ల పనికి గుర్తింపు రావాలి. పనిలో ఎక్కువ తక్కువలు చూడకూడదు. నిజాయితీతో ఆకలి తీరాలి. కుదిరితే నలుగురికి ఆకలి తీర్చాలి’ అంటూ పక్కనున్న గ్లాసులో మిగిలిన గుక్కెడు నీళ్లనూ గొంతులో పోసుకున్నాడు. 
యామినికి లిప్తపాటుకాలం ఆకలిని తట్టుకోలేక పోయిన నిజం గుర్తొకొచ్చింది. నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈశ్వర్‌ మాటల్లో నిప్పులాంటి నిజం ఆమెలో అహాన్ని కాల్చేసిన వాసన అక్కడ మెల్లగా వ్యాపిస్తోంది. అనుభవ పాఠాల్లో ఆరితేరిన అతన్ని చూస్తోంది..  అటుగా వస్తోన్న ఆటోని ఆపడానికి లేచాడు. అతనిని  అనుసరించింది ఆమె. 
- పెమ్మరాజువిజయరామచంద్ర 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు