వాంఛ, విముక్తి

14 Sep, 2020 00:10 IST|Sakshi

కొత్త బంగారం

డెబ్భై ఏళ్ల వయసున్న ప్రముఖ లాటిన్‌ అమెరికన్‌ రచయిత సెజర్‌ ఐరా గురించి పరిచయం చేయడం, అతని రచనాపద్ధతిని అర్థం చేసుకోవడమంత కష్టం. వాస్తవికత, అధివాస్తవికత, అసంబద్ధత, తాత్వికత, హాస్యచతురత కలగలిసిపోయి ఉండే ఇతని ఏ రచనా సాధారణంగా వందపేజీలకి మించదు. ఐరా రచనల్లో మలుపులు తిరుగుతూ సాగే చిక్కనైన ప్లాట్‌ కూడా చెప్పుకోదగ్గంతగా ఉండదు. నిజానికి చెప్పవలసిన నాలుగుముక్కల కథనీ మొదట్లోనే దాదాపుగా చెప్పేస్తాడు. మిగతాదంతా, ఆ అంశం చుట్టూ చేసే తాత్వికమైన ఆలోచనల పక్కదార్లూ, చిక్కుముళ్లూ, కొండొకచో శాఖాచంక్రమణాలు. ఐరాని అభిమానంగా చదివేవాళ్లు బహుశా ఇలాంటి వలలో చిక్కుబడిపోవడాన్నే ఆశించి ఆనందిస్తారు. నాలుగు దశాబ్దాల రచనాజీవితంలో ఐరా ఇప్పటివరకూ దాదాపు ఎనభై నవలలని స్పానిష్‌ భాషలో రాయగా, ఇంగ్లీష్‌లోకి అనువాదమయిన నవలల్లో ‘ఆర్ట్‌ఫోరమ్‌’ పద్దెనిమిదో పుస్తకం. ఇంగ్లిష్‌ అనువాదాలనన్నింటినీ ఇప్పటివరకూ ప్రముఖ ప్రచురణ సంస్థ న్యూ డైరెక్ష¯Œ ్స ప్రచురించింది. 

 అర్జెంటీనాలోని బునోస్‌ ఐరీస్‌లో నివసించే కథకుడికి అమెరికాలో ప్రచురించబడే ఆర్ట్‌ పత్రిక ‘ఆర్ట్‌ఫోరమ్‌’ అంటే అమిత ఇష్టం. తనుంటున్న నగరంలో ఆ అమెరికన్‌ పత్రిక సరిగ్గా దొరకదు కాబట్టి, రకరకాల పద్ధతులలో దాన్ని సంపాదించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇంత కష్టపడే బదులు చందా కట్టవచ్చు కదా అని మిత్రులు సలహా కూడా ఇస్తారు. క్రెడిట్‌ కార్డ్‌ లేని కారణంగా ఆ పనిచేయలేకపోయిన కథకుడికి అనూహ్యంగా ఒక బ్యాంక్‌ కార్డ్‌ ఇవ్వడం, ఇతను చందా కట్టేయడం జరుగుతుంది. చందా అందుకున్న పత్రికవాళ్లు ఆ విషయం తెలియబరుస్తూ, ‘‘అర్జెంటీనాలో ఉన్న మీకు మా శుభాకాంక్షలు,’’ అని ఈమెయిల్‌ కూడా పంపిస్తారు. ‘‘పాపం, మాదేశం అక్కడ అన్ని పత్రికల్లో మొదటిపేజీలో ఉంటుంది కాబోలు. ఇలాంటి సంక్షోభపరిస్థితుల్లో కూడా నేను ఇక్కడినుంచి చందా కట్టడం వాళ్లు గమనించినట్టున్నారు,’’ అనుకుంటాడు. వెనువెంటనే, పత్రిక కాపీని కూడా అందుకుంటాడు. ఆ సంచికను ముందునుంచి వెనక్కీ, వెనకనుంచి ముందుకీ అపురూపంగా చదువుకున్న కథకుడి ఆనందం వర్ణనాతీతం. 

అయితే, ఆనందాలన్నీ క్షణభంగురాలే అన్నట్టుగా, కథకుడి చేతికి పత్రిక అందటం ఆగిపోతుంది. ఇక అతని బాధ చెప్పనలవి కాదు. కారణాలని అన్వేషిస్తూ, పరిస్థితులని విశ్లేషిస్తూ ఉంటాడు. ఆవేదన పడుతూంటాడు. ఫలానాది జరిగితే పత్రిక వస్తుందని మూఢనమ్మకాలని పెంచుకుంటుంటాడు. ‘‘అతీతమైన శక్తుల విషయంలో, ఫలించగల సంభావ్యత ఉన్న విషయాలే మూఢనమ్మకాలంటే,’’ అంటాడు. అన్నింటికీ తార్కిక, తాత్విక వివరణలిస్తూంటాడు. ఒకచోట పాతపుస్తకాలని అమ్ముతున్నారని తెలుసుకుని ఆ పత్రిక పాతసంచికలు ఇరవైనాలుగు కొనుక్కుంటాడు. పత్రికలోని విషయమంతా దొరికినట్టయితే ఈ ఆవేదన తప్పుతుందా అని ప్రశ్నించుకుంటాడు. తప్పదని సమాధానమూ చెప్పుకుంటాడు. వస్తుభ్రాంతిలోనూ, అవి కలగజేసే రసభ్రాంతిలోనూ పడిపోతున్నాం అనుకుంటాడు. ‘‘బహుశా, మనకి నిజంగా అవసరం లేని విషయాల చేతిలో బందీలుగా మారిపోతున్నామా?’’ అన్న మీమాంసకి లోనవుతాడు. ఎన్నిరోజులుగా ఎన్ని సంచికలకోసం ఎదురుచూస్తున్నాడో లెక్కలేసి కొత్త క్యాలెండర్‌ని తయారుచేసుకుంటాడు. పత్రిక సంచికలు మాత్రం రావడంలేదు. పూర్తి నిరాశానిస్పహలకి లోనై ఒక దశలో ఆర్ట్‌వర్క్‌ వగైరా చేసి, వ్యాసాలు రాసేసి పత్రిక సంచికలనే స్వయంగా తయారుచేసుకుంటే పోలేదా అనీ ఆలోచిస్తాడు కానీ, అది కార్యరూపం ధరించదు.  అనంతంగా ఇలా సాగిపోతుండే కథకుడి వేదన మొట్టమొదటి మానవుడు ఆడమ్‌ గురించిన ఒక అధ్యాయపు తలపోతలతో ముగుస్తుంది. 

ఒక పత్రిక కోసమో, ఒక పుస్తకం కోసమో ఎదురుచూడటం ప్రతి పాఠకుడి అనుభవంలో ఉండేవుంటుంది. పాఠకుడిని నవలతో కనెక్ట్‌ చేయగలిగిన అలాంటి సూక్ష్మాతిసూక్ష్మమైన అనుభవాన్ని పట్టుకుని, కథాంశాన్ని సైతం మరపించే స్థాయిలో మేధోపరమైన విషయవిస్తరణ చేయడం అందరికీ సాధ్యపడదు– ఆలోచనల్లోనూ, వాటిని వ్యక్తం చేయగలిగిన భాషలోనూ సూటిదనం, విరుపూ, ప్రతిభా ఉంటే తప్ప. కాథరిన్‌ సిల్వర్‌ చేసిన అనువాదంలో ఆ వస్తుశిల్పచాతుర్యమంతా సుస్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. పుస్తకం వెల కొద్దిగా ఎక్కువే అయినా, ఐరాని తెలుసుకోడానికి చదవదగ్గ పుస్తకం!
ఎ.వి.రమణమూర్తి
 

మరిన్ని వార్తలు