అర్థం ఉంటేనే అది శబ్దం అవుతుంది

23 Jan, 2021 06:42 IST|Sakshi

సంస్కృతి–2

ఒక దేశ సంస్కృతి కబళింపబడి, రూపుమాసిపోతే ప్రజలలో విచ్చలవడితనం పెరిగిపోతుంది. అది అనాచారానికి, పతనానికి కారణమవుతుంది. రాజులు పరిపాలించినా, ప్రజాస్వామిక ప్రభుత్వాలు పాలించినా సంస్కృతికి విశేష  ప్రాధాన్యమిచ్చి దానిని కాపాడుకోవడం ఒక ఎత్తయితే... ప్రజలు తమంత తాముగా తమ కళలపట్ల, తమ సంస్కృతి పట్ల జాగరూకలై దానిని రక్షించుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటారు.

భారతీయ సంస్కృతికి సంబంధించిన వైభవంలో రెండు అంశాలు ఇమిడి ఉంటాయి. బాహ్యంలో అంటే పైకి మనోరంజకత్వం ఉంటుంది. రంజకత్వం లేకుండా ‘కళ’ అనేది ఉండదు. అది మనలను రంజింప చేయాలి. అని చెప్పి కేవలంగా మనోరంజకత్వం కోసమని హద్దు లేకుండా పరిధి దాటిపోయి అర్థం లేకుండా దిగజారుడుతనంతో కిందకొచ్చేసి...‘ఇదిగో మేం మనసులను రంజింప చేస్తున్నాం చూడండి’ అన్న మాట భారతీయ కళలకు వర్తించదు. మన కళల్లో పైకి మనోరంజకత్వం కనిపించినా... తుట్టతుది ప్రయోజనం మాత్రం అపురూపమైన శరీరాన్ని ఉపయోగించి ఆ కళల ద్వారా పరమేశ్వరుడిలో ఐక్యం కావడమే లక్ష్యంగా ఉంటుంది.

దానికోసం ఉపాసన, దానికోసం అనుష్ఠానం, దానికోసం సాధన, దాని కోసం సమస్త కళలు... వాటిని అందించడానికి ‘సంస్కృతి’. అంతే తప్ప కేవలం మనోరంజకత్వం కోసం దేనినీ ప్రతిపాదన చేయరు.అందుకే నవరసాలుంటాయి. వాటి చివరి ప్రయోజనం... భక్తిమార్గంలో మనిషిని ప్రయాణింపచేసి, భక్తితో కూడిన కర్మాచరణలు చేసిన కారణం చేత ప్రీతిపొందిన పరమేశ్వరుడు చిత్తశుద్ధిని ఇస్తే, ఆ పాత్రత ఆధారంగా జ్ఞానాన్ని కటాక్షిస్తే, ఆ జ్ఞానం ద్వారా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి కోసం కళలు ఉపయోగపడతాయి. కేవలం మనోరంజకత్వం కోసం కళలను, సంస్కృతిని ఉపయోగించడం ఈ దేశ ఆచారం కాదు. ఈ దేశ ప్రజలు ఏ కళని అభ్యసించినా, దాని ప్రయోజనం భగవంతుడిని చేరడమే. అది లేని నాడు ఆ జీవితానికి అర్థం లేదు.

మీరు సంగీతమే తీసుకోండి. సంగీతమంటే కంఠాన్ని ఉపయోగించి పాడడం అనుకుంటాం. కానీ శాస్త్రం దీన్ని ఎలా చెబుతున్నదంటే... వాద్యంచ, నృత్యంచ, గీతంచ...సంగీతమదిముచ్యతే’ అంటున్నది. అంటే వాద్యం, గీతం, నృత్యం... ఈ మూడూ కలిస్తేనే సంగీతం.. అంటున్నది. అంతేతప్ప గొంతుతో పాడే పాట ఒక్కదాన్నే సంగీతమనలేదు. శబ్దాన్ని సహకారంగా తీసుకుని, భగవత్‌  తత్త్వాన్ని ఆవిష్కరిస్తుంది...లేదా శబ్దాన్ని సృజిస్తుంది.

శబ్దానికీ, ధ్వనికీ తేడా ఉంది. ధ్వని అర్థాన్నివ్వదు. పిల్లవాడు ఆడుకుంటూ నోటితో చేసే ధ్వనులకు అర్థం ఉండదు. ఏ అర్థాన్నీ సూచించకపోతే దాన్ని ధ్వని అంటారు. అర్థాన్ని ప్రతిపాదిస్తే దాన్ని శబ్దం అంటారు. సనాతన ధర్మం తాలూకు జీవం అంతా శబ్దం మీద ఆధారపడి ఉంది. వేదానికి కూడా శబ్దమనే పేరు. వేదాన్ని ‘శబ్దరాశి’ అని కూడా అంటారు. వేదంలో ఏ శబ్దానికి పట్టాభిషేకం చేసారో,..శబ్దబ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాఙ్మయి..అని సరస్వతీ దేవిని ఎలా ప్రార్థన చేసారో, అటువంటి ఆ తల్లి స్వరూపమయిన శబ్దంలో సంగీతానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. భారతీయ సంగీతపు చరమ ప్రయోజనం పరమేశ్వరుని చేరుకొనుటయే. అందుకే నాదోపాసన అంటారు.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు   

మరిన్ని వార్తలు