సత్సంగం.. సద్గ్రంథం

7 Jan, 2021 06:45 IST|Sakshi

ప్రకృతిలో మరే జీవికీ లేని సౌలభ్యం ఒక్క మనుష్యునికే ఉన్నది. పుట్టుకతో ఒకవేళ స్వభావంలో దోషమున్నా, చెడు గుణాలున్నా, వాసనాబలంగా గతజన్మల నుంచి దోషభూయిష్టమైన విషయాలు మనసు పుచ్చుకున్నా రెండు కారణాల చేత అతను బుద్ధిని మార్చుకోగలడు. మంచి కార్యక్రమాలవైపు మనస్సును మళ్ళించగలడు. అలా అత్యంత ప్రభావవంతమయినవి, బుద్ధిని ప్రచోదనం చేయగలిగినవి, మనిషిని సత్కర్మాచరణవైపు నడిపించగలిగినవి రెండు ఉన్నాయి లోకంలో–ఒకటి సత్సంగం, మరొకటి–మంచి పుస్తక పఠనం. సత్సంగం అంటే మంచి వ్యక్తులతో కూడిక. మనం ఏకాలంలో జీవిస్తున్నామో, ఆ కాలం లోనే కొంతమంది మహాత్ములు కూడా జీవిస్తుంటారు, మంచి గుణాలు కలిగిన కొంతమంది పెద్దలు జీవిస్తుంటారు, సమాజంలో లబ్ధప్రతిష్టులయినవారు, శాస్త్రాన్ని తెలుసుకుని, దానిప్రకారం అనుష్ఠానం చేసేవారు నిరంతరం శాంతికోసం పరితపించేవారు కనబడుతుంటారు. ప్రయత్న పూర్వకంగా అటువంటివారితో స్నేహాన్ని పెంచుకుని వారికి దగ్గరగా జీవించగలగడం, వారితో కలిసి ఉండడం... అనేది మన మనసును మంచి మార్గం వైపు మళ్ళించడానికి తోడ్పడుతుంది.

కొన్ని గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలన్నింటినీ చదివి, మంచి విషయాలను బాగా మనసుకు పట్టించుకుని అనుష్ఠాన పర్యంతంలోకి  తెచ్చుకోవడానికి ఎంత కాలం పడుతుందో దానికి కోటి వంతు కాలంలో మార్పు తీసుకురాగలగినది–మంచి వ్యక్తులతో కలిసి ఉండడం. అందుకే శంకర భగవత్పాదులు మోహముద్గరంలో–‘‘సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః’’ అంటారు. మంచి మనుషులతో కలిసి ఉన్నంత మాత్రం చేత అది విశేష ప్రభావాన్ని చూపుతుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెబుతుండేవారు... ఏనుగు తనంతట తానుగా ఎవరికీ లొంగదు. కానీ మావటికి లొంగి ఉంటుంది. అయినా నడుస్తూ నడుస్తూ దారిలో కనిపించిన చెట్ల కొమ్మలను తొండంతో విరిచే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ మావటి దాని తొండంమీద చిన్న దెబ్బ వేయగానే తొండాన్ని దించేస్తుంది. అలాగే మంచివారితో కూడి ఉన్న కారణం చేత మనం కూడా మంచి మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. సమకాలీన సమాజంలో మంచి వ్యక్తులతో కలిసి జీవించడం ప్రయత్నపూర్వకంగా వారి స్నేహాన్ని పొందడం ఎంత గొప్ప లక్షణమో, మంచి పుస్తకాలు ఇంట్లో ఉండడం – అంతమంది మహాత్ములు ఇంట్లో ఉండడంతో సమానం. 

వివేకానందుడు రాసిన పుస్తకాలు, రామకృష్ణ పరమహంస ప్రవచనాలతో ఉన్న పుస్తకాలు, కంచి కామకోటి పూర్వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర మహా సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణాలు, శృంగేరీ పీఠాధిపతులు భారతీ తీర్ధ మహాస్వామి వారి దివ్యవాక్కులు... ఇటువంటి మహాత్ముల మాటలతో కూడిన పుస్తకాలు ఇంట్లో ఉండడం అంటే అటువంటివారితో కలసి జీవించడంతో సమానం. మీరెప్పుడెప్పుడు అటువంటి వారినుండి నాలుగు మంచి మాటలు విందామని అనుకుంటున్నారో అప్పుడప్పుడు సిద్ధంగా ఉండి మీతో మంచి బోధలు చేయడానికి వాళ్ళు మీ ఇంట్లోనే కుర్చీ వేసుకుని సిద్ధంగా కూర్చోవడంతో సమానం.  
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

మరిన్ని వార్తలు