సంస్కృతి గుండెకాయ లాంటిది

8 Jan, 2021 07:51 IST|Sakshi

సంస్కృతి

కళల పరిపూర్ణస్థాయి కారణంగా ఒక సమాజపు, ఒక దేశపు సంస్కృతిని నిర్ణయిస్తారు. ‘కళ’ అన్న మాటకు అర్థం ‘వృద్ధి చెందునది’, ‘వృద్ధి చెందించునది’– అని. అందుకే చంద్రకళలు అంటాం. అది ప్రకాశిస్తుంది, ప్రకాశింప చేస్తుంది. పెరుగుతుంది, పెంచుతుంది. అటువంటి ‘కళ’ను – దేనికోసం సమాజం  అనుష్ఠిస్తుంది? ఆ కళలవల్ల ప్రధానమైన ప్రయోజనాలు ఏముంటాయి? అసలు కళలు ఎందుకోసం సమాజంలో అనుష్ఠానం లోకి వచ్చాయి? వాటిని ఎందుకు నేర్చుకుంటారు? దేనికోసం వాటిని తప్పనిసరిగా జీవితాల్లో భాగంగా చేసుకుంటారు? వాటి ద్వారా ఏం ప్రతిపాదన చేస్తారు? ఒక కీర్తన పాడితే, ఒక నృత్యం చేస్తే, ఒక బొమ్మ గీస్తే, ఒక రాతిని చెక్కి శిల్పంగా మలిస్తే వాటి వెనుక ఏదయినా సందేశం ఉంటుందా? దేనికోసం చేస్తారు వాటిని? వాటికి ఆధారంగా ఏవయినా శాస్త్రాలు ఉంటాయా? అవి ఏవయినా ప్రతిపాదనలు చేస్తాయా? అవి ఏ భావనలను ఆవిష్కరిస్తాయి?

ఒక వాద్యాన్ని మోగిస్తే దేనికోసం అలా చేస్తారు? అసలు ఎటువంటి వాద్యాలను మోగిస్తారు? ఎటువంటి వాద్యాలను, ఎక్కడ అనుమతిస్తారు? ఏవి వినవచ్చు, ఏవి వినకూడదంటారు? వేటిచేత ఎవరు కళలను అనుష్ఠానంలోకి తెచ్చుకున్నారో, ఎవరు వాటిని అభ్యసించారో, ఎవరు ప్రావీణ్యం సంపాదించారో వారిని కళాకారులని అంటారు. ఆ నైపుణ్యాలతో సమాజానికి ఏం అందించాలని వారు ప్రయత్నిస్తున్నారు? ఒక దేశంలో  కళల సమాహార స్వరూపంగా ఉండి, అక్కడి సమాజానికి ఒక సందేశాన్ని, ఒక ప్రయోజనాన్ని ప్రతిపాదించే దానిని ఆ దేశ సంస్కృతి అంటారు. ఒక దేశంలో అందరూ సహృదయ సంపన్నులే ఉండరు. ఆ దేశం చాలా గొప్పదేశం అయి ఉండవచ్చు, గొప్ప సంస్కృతికి ఆలవాలం కావచ్చు, తిరుగులేని పరమ సత్యాన్ని ఆవిష్కరించి దాన్ని అక్కడి ప్రజలకు అందించే ప్రయత్నం చేసే కళాకారులున్న దేశమయి ఉండవచ్చు. అంతమాత్రం చేత ఆ దేశంలో ఒక్కడుకూడా సంఘ వ్యతిరేకమయిన భావనలో ఉండడు అనీ, లేదా దుర్మార్గపు ఆలోచనలతో కూడుకున్నవాడు ఒక్కడూ కూడా ఉండడు –అనీ అధర్మపరులు అసలే ఉండరని సిద్ధాంతీకరించడం సంభవం కాదు.

కానీ కొద్దిమంది అలా ఉంటే దోషభూయిష్టమైన పరిస్థితికి కారణం కాదా? వారి ప్రభావం సంస్కృతిపై పడదా? అంటే...వైద్యుడి దగ్గరకు వెళ్లినప్పుడు మొదట గుండె పరిశీలిస్తాడు. గుండె సక్రమంగా కొట్టుకుంటున్నదనుకోండి. మిగిలిన శరీర భాగాల్లో రుగ్మత ఏర్పడినా, వ్రణాలు ఏర్పడినా చికిత్సలతో వాటిని తొలగించడం ఆయనకు తేలిక. అసలు గుండే సరిగ్గా లేకపోతే, అసలా వ్యక్తే ఉంటాడన్న నమ్మకం లేకపోతే, ఇతర భాగాలకు వైద్యుడు చికిత్సలు అందించి ప్రయోజనం ఉండదు. గుండెకాయ లాంటిదే సంస్కృతి కూడా. సంస్కృతి వర్ధిల్లినంతకాలం, ఇది దేశంలో నిలబడినంతకాలం, వ్రణాల వంటి కొంతమంది దుర్మార్గులు బయల్దేరినా, శరీరానికి కలిగే పీడ సంబంధమైన వ్యాథులవంటి కొందరు దురాచార తత్పరులు ప్రవర్తించినా, దానికి వచ్చే దోషం ఏమీ ఉండదు. అది దిద్దబడుతుంది. సంస్కృతి నిలబడుతుంది. గుండెమీదే దాడి జరిగి దేశ సంస్కృతి ఛిన్నాభిన్నం అయిననాడు ఆ దేశ కీర్తి తరిగిపోతుంది.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు