దయాగుణమే మానవత్వం

6 Sep, 2021 07:02 IST|Sakshi

శతక నీతి

భాగవతం అష్టమ స్కంధంలో పోతన గారు ఓ మాటంటారు... ‘‘కారే రాజులు? రాజ్యముల్‌ గలుగవే? గర్వోన్నతిం బొందరే? వారేరీ సిరిమూటగట్టుకొని పోవం జాలిరే? భూమిపై బేరైనం గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్‌ యశః కాములై యీరే కోర్కులు? వారలన్‌ మఱచిరే యిక్కాలమున్‌? భార్గవా!’’...ఈ భూమిని కోట్లమంది రాజులు పాలించారు, వీరిలో ఎంతమంది మనకు జ్ఞాపకం ఉన్నారు ? ఉండరు. ఎవడు సాటివారి ఆపదలను తీర్చడానికి ముందుకు వచ్చాడో, కష్టాల్లో ఉన్నవారిని గురించి ఆలోచించాడో వాడు చిరస్థాయిగా మిగిలిపోతాడు. వాడి కీర్తి మిగిలి పోతుంది. వాడు చూపిన దయ వాడికి చుట్టమై వాడిని వాడి పిల్లల్న్లి, పిల్లల పిల్లల్ని కూడా కాపాడుతూ పోతుంటుంది.

రంతిదేవోఖ్యానం అని ఒక ఉపాఖ్యానం...తినడానికి ఏమీ లేక 47 రోజులు రంతిదేవుడు పస్తులున్నాడు. 48వ రోజున కాస్త అన్నం, పాయసం, నెయ్యి, కాసిని మంచినీళ్ళు దొరికాయి. వాటిని తినబోతుండగా ... డొక్కలు ఎండిపోయిన కొందరు వచ్చి చేయి చాపితే ఆహార పదార్థాలన్నీ వారికిచ్చేసాడు. నీళ్ళుతాగి ఉపశమనం పొందుదామని అనుకుంటూ నీళ్ళ చెంబెత్తుకుని తాగబోతున్న క్షణంలో... ‘కళ్ళు తిరుగుతున్నాయ్, నిలవలేక పోతున్నా, గొంతెండుకుపోతున్నది’ అన్న ఆర్తనాదం వినిపించింది. ‘నీళ్ళు కూడా తాగనివ్వరా..’’ అని ఆయన విసుక్కోలేదు. ...‘‘అన్నము లేదు కొన్ని మధురాంబువు లున్నవి; త్రావు మన్న! రావన్న! శరీరధారులకు నాపద వచ్చిన వారి యాపదల్‌ గ్రన్నన మాన్చి వారికి సుఖంబులు చేయుటకన్న నొండు మేలున్నదె? నాకు దిక్కు పురుషోత్తము? డొక్క?డె చుమ్ము పుల్కసా!’’ అంటూ వెళ్ళి ఉన్న ఆ కొన్ని నీళ్ళు దాహార్తికిచ్చేసాడు.

మనిషి హృదయం రాయిలా ఉందనుకోండి. చిక్కిన లేడిపిల్లతో పులి ఎలా చెలగాటమాడుతుందో అలా కష్టంలో ఉన్నవాళ్ళని చూసి కరగకపోగా దానికి హాస్యం ఆడడం అలవాటవుతుంది. వాడు కష్టంలో ఉన్నాడుగా.. ఎదురుతిరిగి ఏమీ అనలేడుగా... అందుకని వాళ్ళని పరిహాసాలాడడం, చిన్నబుచ్చుకునేటట్లు చేయడం... ఇది మంచి లక్షణం కాదు.. ముఖ్యంగా పిల్లలు ఇటువంటి లక్షణాలను అలవర్చుకోకూడదు.  మనిషి మనిషిగా బతకడానికి మూడు విషయాలు నేర్చుకోమంటారు..

1. ఇతరులు సంతోషపడుతుంటే చూసి మనం కూడా సంతోషించాలి.. వాడు సంతోషపడడం చూసి నువ్వు ఏడ్వడం మొదలుపెడితే... పాడయిపోయేది నువ్వే. 2. వాడు కష్టంలో ఉన్నట్లు తెలిసింది.. అది నీ కష్టమనే అనుకొని గబగబా వెళ్ళి వాడికి ఉపకారం చేయడానికి ప్రయత్నించడం నేర్చుకో. 3. నీ వల్ల మరొకరు కన్నీళ్ళు పెట్టుకునే ఘడియ నీ జీవితంలో ఎప్పుడూ రాకుండా చూడు. మనిషిగా పుట్టినందుకు మానవత్వంతో బతకడం అంటే అది. దయాగుణం ఉంటే మనసు రాయిలా ఉండదు వెన్నలా కరుగుతుంది. అలాకాక ఉపకారం చేయాల్సిన సమయం లో అది చేయకపోగా చులకనగా చూడడం, నిందలు వేయడం అన్న ధోరణి ఉందంటే... పశువుల్లో లెక్కవేస్తారు తప్ప మనిషిగా లెక్కగట్టరు.

‘‘తన కోపమె తన శత్రువు...’’ అన్న పద్యంలో దయ చుట్టం అవుతుందని చెప్పింది ఇందుకే. అది సర్వవేళలా నిన్ను కాపాడే చుట్టమవుతుంది. వార్తల్లో చూస్తుంటాం... ప్రమాదవశాత్తూ ఎవడో రోడ్డుమీద పడిపోయి గిలగిలా కొట్టుకుంటుంటే... వెళ్ళి వారి ప్రాణరక్షణకు ప్రయత్నించకుండా... సెల్‌ఫోన్‌లో చిత్రిస్తున్న వారి గురించి చదువుతుంటే... అటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నదని తెలుసుకుంటుంటే... బాధనిపిస్తుంది... పిల్లల్లో ఈ సంస్కారం ఉండడం సభ్యసమాజానికి మంచిది కాదు.


-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు