Chaganti Koteswara Rao: ఈ తమ్ముడు మళ్ళీ దొరకడు!

19 Jul, 2021 08:17 IST|Sakshi

‘ఇమ్ముగ చదువనినోరును, అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్, తమ్ముల పిలువని నోరును...’’ అన్న సుమతీ శతకంలోని పద్యం గురించి తెలుసుకుంటున్నాం. లోకంలో స్నేహితులు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. చిన్నతరగతులనుంచీ, కళాశాలలు ...ఆ తరువాత ఉద్యోగాల్లో ...అలా అన్ని స్థాయుల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని వేళ ల్లో దొరుకుతారు.

పెళ్ళిళ్ళు తదితరాలతో బాంధవ్యాలు కలిసి బంధువులు కూడా కొత్తగా దొరుకుతుంటారు. పుట్టగానే పరమేశ్వరుడిచ్చిన బంధుత్వం మాత్రం అమ్మానాన్నలతోనే. వాళ్ళ ఆఖరి ఊపిరి వరకు వాళ్ళు కోరుకునేది, నీవు వాళ్ళకు ఏదో చేయాలని కాదు, నీకు వాళ్ళేం చేయగలరని...! ఆ ఆర్తి సహజంగా వాళ్లకు తప్ప వేరెవరికీ ఉండనే ఉండదు.

అటువంటి వాటిలో ఒకటి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళతో ఉండే అనుబంధం. నాతో కలిసి పుట్టిన వాళ్ళతో అనుబంధం అపూర్వం. నా తమ్ముడు ఈ జన్మకంతటికీ వాడే నా తమ్ముడు. అక్క ఈ జన్మకు ఆమే అక్క. నేను చాలామందిని చెల్లెళ్ళగా చూడవచ్చు. కానీ మా అమ్మానాన్నల కడుపున నాతో కలిసి పుట్టిన చెల్లి అదొక్కతే. దానితో సమానం మాత్రం ఎవరూ కారు, కాలేరు. వాచికంగా.. ఆమె నా చెల్లెలి తో సమానం అంటాం. కానీ ఆమె స్థానాన్ని భర్తీ చేయడం మాత్రం సాధ్యం కాదు. తోడబుట్టినవాడు అంటే ఆ అనుబంధం మరొకరితో ఉండదుగాక ఉండదు.

శ్రీ రామాయణం లో రావణాసురుడు ప్రయోగించిన శక్త్యాయుధం ఒకటి లక్ష్మణుడిని తాకి ఆయన కిందపడి మూర్ఛిల్లాడు. యుద్ధంలో ఉన్న రాముడు వెంటనే వచ్చి తమ్ముణ్ణి పట్టుకుని బావురుమని ఏడ్చాడు. ‘‘దేశేదేశే కళత్రాణి దేశేదేశే చ బాంధవః తం తూ దేశ నా పశ్యామి యాత్ర భ్రాత్ర సహోదరః’’ అన్నాడు. భార్య దొరుకుతుంది, బంధువులు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. కానీ వాడొక్కడే ఈ జీవితానికి. అంత అపురూపం రా అన్నదమ్ములు. నువ్వే లేకపోతే నాకెందుకురా ఈ రాజ్యాలు, ఈ సుఖాలు? నాకోసం అడవికి వచ్చావు, నా కోసం యుద్ధానికి వెళ్లావు, నువ్వే పడిపోయిన నాడు నాకు మిగిలిన సుఖాలు అన్నీ ఏకమై తిరిగి లభించినా, వాటివల్ల ప్రయోజనమేమిటి?’’ అని అడిగాడు. తోడబుట్టినవాడు వెళ్ళిపోయిన తరువాత బతుకు శూన్యమని భావించాడు. 

రామలక్ష్మణ భరత శ్రత్రుఘ్నులు నలుగురూ పట్టాభిషేక సమయానికి బతికే ఉన్నారు. వాలి సుగ్రీవుల్లో వాలి మరణించాడు. రావణ కుంభకర్ణులు ఇద్దరూ పోగా విభీషణుడొక్కడు మిగిలాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మైత్రీబంధం చూసి అక్కడే ఉన్న విభీషణుడు ‘మేం మా సోదరులతో ఇలా బతకలేక పోయాం...’ అని చాటుగా కళ్ళొత్తుకున్నాడు. సుగ్రీవుడి కళ్ళు చెమర్చాయి. అన్నగారు బాగా పెద్దవాడయి పోయిన తరువాత కూడా నెమ్మదిగా వాహనం దిగుతుంటే తమ్ముళ్ళు గబగబా వెళ్ళి చెయ్యి ఆసరాగా ఇచ్చి ‘అన్నయ్యా! జాగ్రత్త’ అంటూ తీసుకువస్తుంటే, ఏ విషయమైనా అన్నయ్యకు చెప్పి చేస్తుంటే.. తమ్ముళ్ళ మంచీచెడూ విచారించే అన్నయ్య ఎప్పుడూ వాళ్ళకు తోడుగా ఉంటే అసలు ఆ ఇంట ఎంత ఆరోగ్యం, ఎంత ఆయుర్దాయం ఉంటుందో... ఆ రక్తసంబంధం ఉన్నవాళ్లు కలుసుకోవడం ఎంత సంతోషంగా ఉంటుందో..!!!

మరిన్ని వార్తలు