Chaganti Koteswara Rao Prophecies: సహవాస ఫలం

4 Apr, 2022 08:11 IST|Sakshi

శతక నీతి – సుమతి

కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్‌ ...అంటున్న బద్దెన పద్యం ఇస్తున్న సందేశం ఏమిటంటే.. దుర్జనులతో స్నేహం చేయద్దని! అగ్నిహోత్రం కట్టెను పట్టుకుని కాల్చడం మొదలుపెడుతుంది. మంట వ్యాపించేకొద్దీ ఆ కట్టెను ఆశ్రయించి ఉన్న పురుగూపుట్రా అన్నీ పారిపోతాయి. అగ్నితో సంపర్కం పొందాక ఒక్క పురుగు కూడ లోపల ఉండలేదు.

అలాగే సత్పురుషులతో సహవాసం చెయ్యడం మొదలుపెడితే నీలో ఉన్న దుర్గుణాలన్నీ ఒక్కొక్కటిగా పడిపోతాయి. ఈశ్వర భక్తిచేత మారని గుణాలు కూడా మంచివారితో కలిసి ఉంటే తొలగిపోతాయి. మహాత్ముల చెంత చేరిన లోభిలో కూడా మార్పు వస్తుంది. తాను కూడా ఒక రూపాయి దానం చేసి సమాజం కోసం నిలబడాలన్న ఆలోచనలతో పరివర్తన చెందుతాడు.

రావణాసురుడిని నమ్ముకున్న వారందరూ నశించిపోయారు. ఒక్కడు మిగల్లేదు. రామచంద్ర మూర్తిని నమ్ముకుని ఆయనతో కలిసున్న వారి సంగతి ఏమిటి! కొన్ని కోట్ల వానరాలు చచ్చిపోయినా, చిట్టచివర దేవేంద్రుడు ప్రత్యక్షమయి రాముడిని వరం కోరుకొమ్మంటే...‘నాకోసమని యుద్ధం చేయడానికి వచ్చి ఏ వానరాలు మరణించాయో అవన్నీ తిరిగి బతకాలి’ అని కోరుకున్నాడు.  అటువంటి సత్పురుషుడిని ఆశ్రయించినందుకు చివరకు క్షేమంగా తిరిగి వెళ్లగలిగాయి. ‘‘కళత్రాణి సౌమ్యాని మిత్రవర్గం తథైవచ యధైచ్ఛసి చిరం భోక్తుం మా కృథారామ విప్రియమ్‌... ’ దుర్మార్గుడయిన వ్యక్తి ఇంట్లో ఉంటే– తల్లికీ తండ్రికీ మనశ్శాంతి ఉండదు.

భార్యాబిడ్డలు ప్రశాంతంగా బతకలేరు. ఇటువంటి దుర్మార్గుడు మా కుటుంబ సభ్యుడైనాడని బంధువులు, మిత్రులు అందరూ తలదించుకుంటారు. ఆయన ఉండే వీథిలోని వాళ్ళు, ఆ దుర్మార్గుడి ఊరివాళ్ళు కూడా విసుక్కుంటారు. ఒకవేళ ఆ దుర్మార్గుడే పాలకుడయితే ఆ జిల్లా, ఆ రాష్ట్రం పాడయిపోతుంది. అలా దుర్మార్గుడు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో ఉన్న ఇతరులు కూడా అతని ప్రభావానికి బలయిపోతారు. దుర్జనులతోడి సంపర్కం ప్రమాదకరం.

వర్షపునీటితో గలాగలా పారినా ఏటినీళ్ళు ఎవరూ తాగరు, పుణ్యస్నానాలు చేయరు. అది వెళ్ళి గంగానదితో కలిస్తే...అది కూడా గంగే అయిపోతుంది. దానికీ ఆ పవిత్రత దక్కుతుంది. అక్కడ పవిత్ర స్నానాలు చేస్తారు. అదే గంగానది వెళ్లి సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలోంచి నీళ్ళు ఇంటికి కూడా తెచ్చుకోం. గంగ... గంగగా ఉపయుక్తం. ఏరు గంగలో కలిస్తే గంగయిపోయింది. గంగ సముద్రంలో కలిస్తే సముద్రమయింది.

తాత్వికంగా అది గొప్పదే..కానీ గంగ గంగగా ఉన్నప్పటి ప్రయోజనం సముద్రంలో కలిసిన తరువాత ఉండదు. ఒక చీమ పూలదండలో ఉన్నది. ఆ దండను రాజు మెడలో వేసారు. చీమ నెమ్మదిగా పాకుతూ కిరీటం పైకి చేరుకుంది. దానిని చూసినా ఎవ్వరూ అక్కడనుండి తొలగించే సాహసం చేయలేదు. రాజు స్వయంగా గ్రహిస్తే తప్ప దాన్ని ముట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.

అంటే నువ్వు ఎవరితో ఉన్నావన్నదాన్నిబట్టి నీ స్థాయి, గౌరవం మారిపోతుంటుంది. కాబట్టి త్యజదుర్జన సంసర్గమ్‌... భజసాధు సమాగమమ్‌... మహాత్ములతో, సత్పురుషులతో కలిసి ఉండండి... వారు మిమ్మల్ని నిందించినా, వారి సాంగత్యాన్ని వదులుకోకండి. వారితో కలిసి ఉన్న కారణంగా మీ దుర్గుణాలు పోగొట్టుకోవడమే కాకుండా, మీరు కూడా గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. 


బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు