ప్రకృతి స్వరాలు... వికృతి స్వరాలు

23 Feb, 2021 07:41 IST|Sakshi

సంస్కృతి

‘‘సద్యోజాతాది పంచవక్త్రజ స–రి–గ–మ–ప–ద–ని వర సప్తస్వర విద్యాలోలమ్‌...’’ అన్నారు త్యాగరాజ స్వామి. జ–అంటే పుట్టినది–అని. సద్యోజాతాది పంచవక్త్రజ...పరమ శివుడికి ఐదు ముఖాలు–సద్యోజాతం, అఘోరం, సత్పురుషం, వామదేవం... పైన ఉండే ముఖం–ఈశానం. ఇది మోక్షకారకం. ఈ సప్తస్వరాలు పరమశివుడి ఐదు ముఖాల్లోంచి వచ్చాయి. వేదం కూడా భగవంతుని ముఖం లోంచే వచ్చింది కాబట్టే దాన్ని అపౌరుషేయం అంటారు. అంటే ఎవ్వరి చేత రాయబడినది కాదు–అని.

శృతి–గురువుగారి దగ్గరి నుంచి స్వరంతో మంత్రాన్ని విని శిష్యడు వేదాన్ని నేర్చుకుంటాడు. అంతే తప్ప మంత్రాలు పుస్తకాల్లో రాసుకుని చదువుకోరు. వేదాలు ఎలా భగవంతుని ముఖం నుండి వచ్చాయో, అలాగే  ఏ సంగీతం ఏడు స్వరాల మీద ఆధారపడిందో అది పరమశివుని ఐదు ముఖాలు... సద్యోజాతాది పంచవక్త్రజ... సద్యోజాతం మొదలయిన ఐదు ముఖాలనుండి పుట్టింది. స్వరాలు ఏడయినప్పుడు మరి మిగిలిన రెండు స్వరాల సంగతేమిటి? ఏయే స్వరాలు పరమశివుని ముఖాన్నుండి వచ్చాయి, రాని రెండు ఏవి ? అసలు స్వరాలు పరమశివుని ముఖాన్నుండి వచ్చాయి అంటే దానర్థం వాటికన్నా ముందే పరమ శివుడు ఉన్నాడనేగా. అంటే మిగిలిన రెండు స్వరాలు పరమశివుని ముఖం నుండి రాలేదా ..?

సప్తస్వరాలు–షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం, నిషాదం. వీటినే స–రి–గ–మ–ప–ద–ని అని అంటాం. ఇందులో షడ్జమం–నెమలి కూత లోంచి, రిషభం–ఎద్దు రంకె లోంచి, గాంధారం– మేక అరుపు లోంచి, మధ్యమం–క్రౌంచ పక్షి చేసే శబ్దం లోంచి, పంచమం–కోయిల కూత లోంచి, దైవతం–గుర్రం సకిలింపులోంచి, నిషాదం–ఏనుగు ఘీంకారంలోంచి వచ్చాయి. స–రి–గ–మ–ప–ద–ని అనే ఏడు స్వరాలకూ ఆరోహణ, అవరోహణ ఉంటాయి. భగవంతుడి నుండి విడిపోతే అవరోహణ. మళ్ళీ పైకిపోతే ఆరోహణ... అంటే ఈశ్వరుడిలో ఐక్యం కావడం... అదీ సంగీతం ద్వారా.

సప్త స్వరాల్లో రెండు– షడ్జమం, పంచమం..ఈ రెండూ శివుడి పంచముఖాల్లోంచి రాలేదు. అంటే శివుడు ఎప్పటినుంచి ఉన్నాడో అప్పటినుంచి ఉన్నాయి. అందుకే వాటిని ప్రకృతి స్వరాలని అంటారు. ఇవి అనాది–అవి ఎప్పటినుంచి ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. మిగిలిన ఐదు వికృతి స్వరాలు. అవి శివుని ముఖాల్లోంచి వచ్చాయి. ‘‘సద్యోజాతాది పంచవక్త్రజ సరిగమ పదనీ వరసప్తస్వర విద్యాలోలం విదలితకాలం విమలహృదయ త్యాగరాజపాలం’’...కాలుడిని.. యముడిని కూడా చంపినవాడు, కాలాతీతుడయిన శివుడున్నాడే... ఆయన విమలమైన మనసు ఉన్న త్యాగరాజును పరిపాలించే ‘నాదతను మనిశం శంకరం నమామి మే మనసా శిరసా’... ఆ శివుడికి నమస్కరిస్తున్నాను.

బాలమురళీకృష్ణ గారు ఒకసారి ఫ్రాన్సులో కచేరీ చేస్తుండగా.. ఒకతను ఫ్రెంచిభాషలో ఒక గీతాన్ని రాసి పాడమన్నారు. దానిని చదివి ఆకళింపు చేసుకుని, భారతీయ సంగీతంలోని సప్త స్వరాలలోకి, రాగంలోకి, తాళంలోకి తీసుకొచ్చి ఆయన అత్యద్భుతంగా ఆలపించారు. ఆ దేశస్థులు నివ్వెరపోయారు. గొప్ప బిరుదిచ్చి సత్కరించారు. భారతీయ సంగీతంలోకి ఇమడని ఇతర సంగీతం లేదు. మన సంగీతం ఇతర సంగీతాలలోకి ఇమడదు. అదీ మన సంస్కృతి గొప్పదనం. మనం దానికి వారసులంగా గర్విస్తూ వాగ్గేయకారులకి నమస్కారం చేయకుండా ఎలా ఉండగలం !!!
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు