ఇష్టపడితే కష్టం ఉండదు..

6 Jul, 2021 07:36 IST|Sakshi

శతక నీతి 

సుమతీ శతకంలో మకుటంగా ఉంచిన ‘‘సుమతీ! ’’ అంటే... మంచి మనసున్న వాడా! మంచి మేధ కలిగిన వాడా! మంచి మతి కలిగిన వాడా! అని అర్థం. ఒక వ్యక్తికి ఏదయినా ఒకటి తెలియకపోవడం తప్పుకాదు. ఎవ్వరూ సర్వజ్ఞులు కారు. అందరం శంకర భగవత్పాదులం కాదు. పుట్టుకతో అందరికీ అన్ని విషయాలూ తెలియవు. కానీ తెలియనిది తెలుసుకోకపోవడం, తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం మాత్రం తప్పే. నాకు తెలిసినది మాత్రమే నిజం, నాకు తెలుసుకోవలసిన అవసరం లేదనడం ధిక్కారం...అది ముమ్మాటికీ తప్పు. నాకు తెలియదు కాబట్టి నేను తెలుసుకుంటాను–అని ఎవరు వినయంతో చెవిపెట్టి మంచి మాటలు వింటారో వారందరూ సుమతులే. విద్యార్థుల మనసు తెల్లకాగితంలా ఉంటుంది. దాని మీద ఏది రాస్తే దాని ముద్ర పడుతుంది.

పిల్లలకు అందవలసిన విషయం అందితే వాళ్ళు జీవితంలో వృద్ధి లోకి వస్తారు. ఉత్తమ పౌరులవుతారు. అటువంటి పిల్లలు కుటుంబంలో ఆధారపడతగిన వ్యక్తులవుతారు. ఆ వీథిలో ఉన్నవారు, ఆ ఊరి వారు, ఆ రాష్ట్రం, ఆ దేశంలో ఉన్న వారు కూడా వారిని చూసి గర్వపడే, సంతోషపడే స్థితిని పొందుతారు. అలా పొందేటట్లు బతకగలిగిన స్థితికి చేరుకోవడానికి సుమతీ శతకం పద్యాలు గొప్ప సోపానాలు. ఇవి పిల్లలను ఉద్దేశించి చెప్పినవే అయినా, వారికే కాక, అందరికీ అన్నికాలాల్లో ఉపయుక్తం అవుతాయి. వాటిలో ఒక పద్యం చూద్దాం...

‘‘ఇమ్ముగ చదువని నోరును/అమ్మాయని పిలిచి అన్నమడుగని నోరున్‌/తమ్ముల పిలువని నోరును/కుమ్మరి మనుద్రవ్వినట్టి గుంటర సుమతీ!’’ –‘ఇమ్ముగ చదువని నోరును...’ అంటే.. చదివేది ఇష్టంగా చదవాలి.. ఇష్టం అంటే?  నీకు ఆకలేసింది. ఉదయం ఫలహారం తిన్నావు.. మధ్యాహ్నం మళ్ళీ ఆకలేస్తుంది.. మరి ఉదయం తిన్నదేమయింది! ఏదీ చూపించమంటే ఇక కనిపించదు. అది రక్తం, మాంసం, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ వంటి సప్త ధాతువుల్లోకి కలిసిపోయింది. అలా కలిసి అది నువ్వయి పోయింది. అంటే నేను తిన్న ఫలహారం నాలో కలిసిపోయింది, నేనుగా మారిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం తింటాం. అదీ అంతే. నీళ్ళు తాగుతాం. అదీ అంతే. అలాగే చదివిన చదువు కూడా మనకన్నా వేరుగా ఉండకూడదు. అది కూడా నీలోకి వెళ్ళిపోయి ‘నువ్వు’గా మారిపోవాలి.

అంటే నీకు దాని అవసరం ఎప్పుడొస్తే అప్పుడు అది నీకు జ్ఞాపకం రావాలి. అలా జ్ఞాపకం వస్తూ ఉండాలి అంటే మీరు చదివిని దానిని లోపల మననం చేసుకుంటూ ఉండాలి. ఇదంతా జరగాలి అంటే... చదివే చదువు ఇష్టంగా, ప్రీతిగా చదవాలి. ఇష్టంగా స్వీకరించింది ఏదయినా మన ప్రయత్నం లేకుండానే అది మన మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. అవసరమయినప్పుడు అది వెంటనే మనకు గుర్తొస్తుంటుంది. మీకు నాన్నంటే ఇష్టం, అమ్మంటే ఇష్టం. మీరు ఎక్కడున్నా వారిని మనసులో అనుకున్న వెంటనే మీకు వారెలా గుర్తుకొస్తుంటారో, ఇష్టంగా చదివినది కూడా అంతే. ఆవుపాలు పితికేటప్పుడు ఆ పాలధార సన్నగా ఉన్నా నేరుగా పాత్రలోకి చేరేటట్లు ఎలా ఏకాగ్రతతో పితుకుతామో, అలా చదివే విషయాలు, గురువుల ద్వారా వినే విషయాలు కూడా నేరుగా మనసులోకి చేరాలి. అలా జరగాలంటే... చదివే వాటిని కష్టంతోనో, చదవాల్సి వచ్చిందన్న బాధతోనో కాకుండా బాగా ఇష్టపడి చదవాలి.

-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు