అమ్మా! అన్నం పెట్టమ్మా...

13 Jul, 2021 07:26 IST|Sakshi

శతక నీతి

‘ఇమ్ముగ చదువనినోరును, అమ్మాయని పిలిచి అన్నమడుగుని నోరున్‌...’’అన్న సుమతీ శతకంలోని పద్యం గురించి తెలుసుకుంటున్నాం. అసలు ఇటువంటి రచనలు చేసేటప్పుడు మన పూర్వకవులు అద్భుతమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏది మనం మరిచిపోకూడదో, నాలుగు కాలాలపాటు గుర్తుంచుకుని జీవితానికి అన్వయం చేసుకోవాలో అటువంటి వాటిని ఛందోబద్ధం చేసి పద్యాలు, శ్లోకాలుగా అందించారు. అంటే వాటిని ఒకసారి చదివితే అవి జ్ఞాపకం ఉండిపోతాయి. భవిష్యత్తులో కష్టాలు ఎదురయినప్పుడు లేదా సందర్భవశాత్తూ గుర్తుకు రావడానికి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. సుమతీ శతకంలోని పద్యాలు కూడా శ్రద్ధపెట్టి చదివితే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. విద్యార్థులు చదువుకునే వయసులో ఏది చదివినా కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలి.

అలాగే లోకంలో అమ్మంటే అమ్మే. అమ్మ అన్నం పెట్టేటప్పుడు కడుపు నిండడం కోసం మాత్రమే పెట్టదు. ఆర్తితో, సంతోషంతో పెడుతుంది. పిల్లలు వృద్ధిలోకి రావాలని, ఆరోగ్యంగా బతకాలని పెడుతుంది. వాళ్లు సరిగా తినకపోతే, తన వంటలో లోపం ఉందేమోనని బాధపడుతుంది తప్ప మరోలా ఆలోచించదు. తనకోసం అన్నం వండుకోదు, మనకోసం వండుతుంది. అందరికీ పెట్టి చివరగా తను తింటుంది. తనకు సరిపడా మిగలకపోతే ఆకలిని ఓర్చుకుంటుంది తప్ప నాకు మిగల్చకుండా అంతా వాళ్ళే తినేసారని బాధపడదు.

‘మాతా సమున్నాస్తి శరీరపోషణమ్‌’– అమ్మ పోషించినట్టుగా ఈ శరీరాన్ని పోషించగలిగిన వారుండరు  ఈ లోకంలో. అమ్మ భగవంతునితో సమానం... అంటే తప్పు. భగవంతుడే అమ్మ అయినది, పరదేవతే అమ్మగా ఉన్నది. మాతృదేవోభవ..ఆ పరదేవతే అమ్మ రూపంలో తిరుగుతోంది. నమశ్శంకరాయచ, మయస్క రాయచ, నమశ్శివాయచ, శివతరాయచ.. అంటుంది వేదం. శంకరుడు అంటే ఎక్కడో ఉండడు. తండ్రి రూపంలో ఉంటాడు. అలాగే అమ్మ కూడా పరదేవతయై బిడ్డల ఆలనాపాలనా చూసుకుంటుంది. తన కడుపు మాడ్చుకుని కూడా పిల్లల వృద్ధికోసం త్యాగం చేయగలిగిన జీవి ఈ లోకంలో అమ్మ ఒక్కతే. తండ్రి ఎంతటి ఐశ్వర్యవంతుడయినా, బిడ్డపుట్టగానే ఆకలేసి ఏడిస్తే ఏమీ చేయలేని నిస్సహాయత. కానీ నెత్తుటిని పాలగా మార్చి పట్టగలిగినది అమ్మ ఒక్కతే.

అందుకే జీవితంలో గొప్ప అదృష్టం–అమ్మను పొంది ఉండడంగా భావిస్తారు. అపార కీర్తిప్రతిష్టలు ఆర్జించిన మహామహుల జీవితాలు పరిశీలిస్తే...అమ్మ వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి తొలినాళ్ళల్లో పడిన కష్టాలు తెలుస్తాయి. మా అమ్మ పచ్చడి తాను తిని ఇడ్లీలు నాకు పెట్టి...రెక్కలు ముక్కలు చేసుకునేది..అని ప్రఖ్యాత రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసుకున్నారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి అమ్మ సూర్యకాంతమ్మ గారు బిడ్డ ప్రసవానికి ముందు వరకు ఎవరు వారించినా వినకుండా కడుపులో ఉన్న తన బిడ్డకు సంగీతం నేర్పే అవకాశం తరువాత తనకు వస్తుందో రాదోనని వీణ వాయించారట.

ప్రసవానంతరం పదోరోజు ఆమె కన్ను మూసారు. ‘‘నన్ను కనడం కోసమే వచ్చింది ఒక అమ్మ, నన్ను పెంచడం కోసమే వచ్చింది మా పెద్దమ్మ. ఇద్దరు అమ్మల చేతిలో పెరిగి పెద్దవాణ్ణయి ఇవ్వాళ ఈ స్థితిలో ఉన్నాను..’’ అని ఆయన గుర్తు చేసుకునేవారు. అటువంటి అమృతమూర్తి అయిన అమ్మను నోరారా ‘అమ్మా!’ అని పిలిచి ‘అన్నం పెట్టు’  అని అడగకపోతే ఎలా?

-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు