ఎంతబాగా ఆలపించావురా సామగానం!

12 Feb, 2021 07:26 IST|Sakshi

సంస్కృతి–5

‘‘ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి ర్బ్రహ్మణోధిపతి ర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్‌’’... శివుడే నటరాజు. అన్ని కళలూ ఆయన నుండే వచ్చాయి. అంత వేగంగా నృత్యం చేస్తున్నంత మాత్రాన ఆయన రజోగుణ తమోగుణాలకు వశపడతాడనుకోవలసిన అవసరం లేదు. ‘సదాశివోమ్‌’... ఎల్లప్పుడూ శివుడే. పరమ ప్రశాంతంగా, కళ్యాణమూర్తిగా, భద్రమూర్తిగా, శ్రేయోమూర్తిగా ఉంటాడు. అలా ఉండగలగడం..రాశీభూతమైన సామవేద సారం శివుడే.

సామగానం ఆలపించడం అంటే మరేమీ కాదు, పరమశివుడిని ఉపాసన చేయడమే. యాజ్ఞవాల్క్య మహర్షి వీణమీద అనేక రహస్యాలు చెప్పాడు. అందులో ఒకటి.. ఎవరయినా వీణ వాయించేటప్పుడు గురుముఖతః నేర్చుకుని స్వరం తప్పకుండా వీణవాయిస్తూ కళ్ళు మూసుకుని తనలోతాను పరవశించ గలిగితే... ఇక వాడికి ఇతరమైన ఏ ఉపాసనలు అక్కర్లేదు. వాడు పరమేశ్వరుడిని చేరిపోతాడు–అని మహర్షి చెప్పారు. అంత గొప్పది. అందుకే అసలు ఆ వీణ చేత్తో పట్టుకున్నంత మాత్రాన శాంతిని పొందుతాం. ఆ శాంతమే శివుడు. అందుకని ..‘‘నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా’’ అనీ,... ‘‘మోదకర నిగమోత్తమ సామవేదసారం వారమ్‌ వారమ్‌’’ అంటే వారమ్‌ వారమ్‌ అంటే వారానికోసారి అని కాదు... మళ్ళీ మళ్ళీ అని.. పరమసంతోషాన్ని పొంది..ఆ శాంతి స్థానమే శివుడిగా వచ్చిందని తెలుసుకుని మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ నేను నమస్కరిస్తున్నాను...అన్నాడు త్యాగరాజు. ఆ శివుడికి తనువంతా నాదమే.

శివుడిలోంచి సంగీతం వచ్చింది. అది మనోరంజకత్వం కోసం వచ్చింది కాదు. ‘‘సద్యోజాతాది పంచ వక్త్రజ స–రి–గ–మ–ప–ద–ని వర సప్త–స్వర విద్యా లోలమ్‌...’’ లోలమ్‌ అంటే దానిమీద విపరీతమైన వ్యామోహం...అని. అది వినేటప్పటికి ప్రసన్నుడయిపోతాడు. ఒకప్పుడు...కాశీపట్టణాన్ని గజాసురుడు  పాడుచేస్తుంటే పరమశివుడు వాడితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం జరుగుతోంది... వీడితో సమయం పాడుచేసుకోవడం ఎందుకని పరమ శివుడు ఏనుగురూపంలో వచ్చాడు. వాడిని  త్రిశూలానికి గుచ్చి పైకెత్తి పక్కన పెట్టుకుని ధ్యానం చేసుకుంటున్నాడు. మరి ఆయన శాంతమూర్తికదూ! ప్రశాంతంగా కూర్చున్నాడు. పైనున్న ఏనుగు దాని బరువుకు అదే త్రిశూలానికి దిగబడిపోతోంది.ప్రాణాలు పోతున్నాయని తెలుసుకున్న గజాసురుడు సామగానం చేసాడు. వెంటనే పరమశివుడు ప్రసన్నుడయి తలెత్తి చూసాడు. ‘ఎంతబాగా ఆలపించావురా సామగానం !’ అంటూ సంతోషపడి చూసాడు. దానికి గజాసురుడు ..‘‘ శంకరా ! నాదొక కోరిక. దీనికి రక్తం ఎప్పుడూ ఇంకకూడదు. మాంసం ఎండకూడదు. ఈ తోలు ఎండి గట్టిపడకూడదు. దుర్గంధభూయిష్టం కాకూడదు. దీన్ని నీవు ఎప్పుడూ కట్టుకుని కాశీ పట్టణంలో తిరుగుతూ ఉండాలి. నా శరీరం వదిలేసాక తోలువలిచి నీవు కట్టుకోవాలి. ’’ అని ప్రాథేయపడగా ఆయన ‘తథాస్తు’ అన్నాడు.

అందుకని ఏనుగు తోలు కట్టుకుని ‘కృత్తివాసీశ్వరుడు’ అన్న పేరుతో కాశీపట్టణంలో వెలిసాడు. ఇప్పటికీ అక్కడ శివలింగం ఏనుగు పష్ఠభాగం ఆకారంలో కనబడుతూ ఉంటుంది. త్యాగరాజుగారు... సామగాన సారంగా నిలబడి, నాదమును తనువుగా పొందిన శివుడిని వారమ్‌ వారమ్‌ .. మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను... అన్నాడు.  భారతీయ సంగీతం అంతా స–రి–గ–మ–ప–ద–ని..అనే ఏడు స్వరాల నుంచి వచ్చింది. మన  సంగీత వైభవానికి ఈ సప్త స్వరాలే ప్రాణం పోస్తున్నాయి.

-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

మరిన్ని వార్తలు