తమ్ముడా! నువ్వు చెప్పిందే నిజం...

16 Oct, 2020 08:28 IST|Sakshi

వినేవాడయితే ఒక్క మాట చాలు...జీవితాలు మారిపోతాయి. వినడమన్నది అలవాటు లేకపోతే ఎంత మంది వచ్చి ఎన్ని మాటలు చెప్పినా అవి వారి జీవితంలో ప్రయోజకత్వాన్ని ఇవ్వవు. సీతమ్మ కనబడకపోతే–రామచంద్ర మూర్తి కోపాన్ని పొంది...‘‘ఈ వేళ నేను నా రాచబాణంతో ఆకాశాన్నంతటినీ కప్పేస్తాను.. పంచభూతాల్లో ఏ ఒక్క భూతం కూడా కదలదు. యథాకాలో యథామృత్యుర్‌ యథాజరా యథా విధిః నిత్యం న ప్రతిహ్నం యంతే.. .ఓ లక్ష్మణా! ఏమనుకుంటున్నాయో.. వృద్ధాప్యాన్ని ఎలా దాటలేరో, మృత్యువును ఎలా జయించలేరో, కాలాన్ని ఎలా అధిగమించలేరో ఈ వేళ నన్నలా దాటలేరెవ్వరూ.. సమస్త బ్రహ్మాండాలన్నీ లయం చేస్తాను... ’’ అని హూంకరించాడు. వెంటనే లక్ష్మణుడు వచ్చి కాళ్ళమీద పడ్డాడు. చదవండి: పహిల్వాన్‌  గర్వభంగం

‘‘అన్నయ్యా! ఏమిటీ కోపం!!! సీతమ్మ కనబడలేదనీ.. అడిగితే నీకు బదులివ్వలేదని సమస్త భూతములను లయం చేసేస్తావా? చంద్రేలక్ష్మీ, ప్రభాసూర్యే, గతిర్వాయుః.. భువి క్షమ.. ఉత్తమమ్‌ యశః,...చంద్రుడు అంటే కాంతి, భువి అంటే క్షమ, వాయువు అంటే కదులుతుంది...నువ్వంటే ఏమిటి...గొప్ప కీర్తి..రాముడంటే ఓర్పు, క్షమ, వింటాడు. గురువులు ఏది చెప్పారో దాన్ని ఆచరణాత్మకం చేస్తాడు...అని కీర్తి నీకు...సీతమ్మ జాడ చెప్పలేదని అందర్నీ చంపేస్తావా...??? ఎవడెత్తుకెళ్ళాడో వాడిని చంపాలి అన్నయ్యా...ఓర్చుకో..’’ అన్నాడు లక్ష్మణుడు. చదవండి: వారి మాట సలహా కాదు, శాసనం

ఆ.. మహా చెప్పొచ్చావులే...ఆశ్రమంలో ఉండి వదినను కనిపెట్టుకుని ఉండరా అంటే ఉండకుండా వచ్చేసావ్‌.. అసలు నీవల్లే వచ్చిపడిందీ కష్టమంతా..కాబట్టి నీ మాట అస్సలు వినను...’’ అనవచ్చు రాముడు. కానీ అలా అనలేదు...‘‘తమ్ముడా! నీవు చెప్పింది సత్యం. ఎవడు అపహరించాడో వాణ్ణి సంహరిస్తా. ఈ బ్రహ్మాండాలను లయం చేయను’’ అంటూ వెళ్ళిపోయాడు.

మాట విన్నాడు కాబట్టి అంత కీర్తిమంతుడయ్యాడు. లక్ష్మణుడి మాట వినకుండా రాముడు బ్రహ్మాండాలను లయం చేసుంటే... మొట్టమొదట ఎవరు తలదించుకుని ఉండేవారంటే... వశిష్ఠ విశ్వామిత్రులు. ఇటువంటి అయోగ్యుడికి మేమింత ధనుర్వేదాన్నిచ్చాం. చిన్న కష్టం వచ్చేటప్పటికి బ్రహ్మాండాలను లయం చేసేసాడు. ఓర్పు లేనివాడికి మేమా విద్య ఇవ్వకుండా ఉండాల్సింది.ఇవ్వడమే మేము చేసిన తప్పు’’ అని తలదించుకోవాల్సి వచ్చేది. చెప్పిన మాట రాముడు విన్నాడు కాబట్టి వశిష్ఠవిశ్వామిత్రులు పొంగిపోయారు. నిజంగా రాముడికి యుద్దంలో కష్టమొస్తే అగస్త్యుడు పరుగుపరుగున వచ్చాడు. ఆదిత్య హృదయం ఉపదేశం చేసాడు. 

పాత్రత దేనివలన నిలబడుతుంది... అంటే చెప్పిన మంచి మాట వినడం వలన. మాటలు ఎన్నయినా సారభూయిష్టమైన ఒక్క మాట చాలు. సాలగ్రామం ఎక్కడో ఉండదు. రాళ్ళకుప్పల్లో వెతికితేనే దొరుకుతుంది. అలా ఒక మంచి మాట కోసం ఒక పుస్తకాన్నంతటినీ చదవాలి. ఒక్క మంచి మాట కోసం ఎన్ని మంచి మాటలయినా వినాలి. వాటిలో సారవంతమయిన ఒక్క మంచి మాటను జీవితంలో ఆదర్శంగా తీసుకోవాలి. దాన్ని అనుష్టాన పర్యంతంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అలా చేయకుండా ‘నా అంతటి వాడను నేను . నాకు వాళ్ళు చెప్పేదేమిటి? నాకు వాడు చెప్పొచ్చేవాడా? వాడు చెప్పడం, నేను వినడమా...???’ అని అహంకార పూరిత వ్యక్తిత్వంతో ఉండేవాడు జీవితంలో ఎప్పటికీ వృద్ధిలోకి రాలేడు. అలా కాకుండా గురువుగారు ఆ మాట ఎందుకన్నారో.. అయినా నా మంచికేగా చెప్పింది..అని స్వీకరించినవాడు ధన్యాత్ముడు.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా