పురూరవుడి ముక్తికాంత

30 Nov, 2020 00:01 IST|Sakshi

వ్యాసరాజం

చలం రమణాచలం చేరింది 1950లో. పురూరవ నాటకం వ్రాసింది 1947లో. చలంలో వేదాంత ధోరణీ, తాత్త్విక చింతన ఈ నాటకం వ్రాసే సమయానికే బలపడిందని ఊహించవచ్చు. ఈ నాటకం ఐహికం నుండి ఆముష్మికానికి వంతెన. మానవ లోకాన్నుండి స్వర్గలోకానికి నిచ్చెన. ఊర్వశి ప్రేమదేవత కాదు ముక్తికాంత. కామి గానిది మోక్షకామి కాడుగదా మానవుడు. పురూరవుడు, సమస్తమూ అనుభవించి కూడా తనకు అర్థం గాని అశాంతి వల్ల, జీవితం మీది ప్రశ్నలతో, అందరాని దానికై అన్వేషణంలో కాలం గడిపే రసికావతంసుడైన రాజు. ముక్తికాంత పరిష్వంగానికి అన్ని అర్హతలున్న మానవుడు. 

ముక్తి సంపాదనకు మొదటి సోపానం అహంకార నిర్మూలనం. రెండవది భవ బంధ విమోచనం. ఈ రెండిటినీ అతి చాకచక్యంగా నెరవేరుస్తుంది ఊర్వశి. ‘‘నేను నీ చరణారవింద మకరంద మధుపాన
మత్తుణ్ణి’’ అని దాసోహమని పాదాలపై పడేంత వరకూ వదలదు. బట్టలతో, హారాలతో అహంకారాన్ని కూడా అక్కడ వదలి రమ్మంటుంది.
మొదట తాను సర్వ భూవలయ ఛత్రాధిపతి నంటాడు. ఊర్వశి తాను సర్వ భూవలయ ఛత్రాధిపతి మాణిక్య విరాజిత మకుట భూషిత పాదారవిందను అంటుంది. నమస్కరించమంటుంది. 
‘‘నా పాదాలు స్పృశించే అధికారం నీకు కలగాలంటే, నీ అధికారాన్ని చాలా దూరంగా వొదులు నా ముందు’’ అంటుంది. ‘‘స్త్రీ ముందు మోకరించడం నేర్చుకోని నువ్వు ఏం తెలుసుకున్నావు? ఏం
జీవించావు?’’ అని అడుగుతుంది. అడుగడుగునా అడ్డు తగిలి గర్వం హరించి పోయేట్లు చేస్తుంది.

పురూరవుడు అంటాడు: ‘‘సర్వ శాస్త్రాలకే, ధర్మాలకే నిర్ణయ విధాతను నేను’’.
‘‘ప్రేమించగల యోగ్యతే నీకు వుంటే ఇవేమీ గొప్పగా మాట్లాడవు. నా ప్రేమని గుర్తెరగలేని నీ అహంభావం, నన్ను సంశయించిన నీ జ్ఞానం... నిన్ను ఎడమ కాలితో తన్ని పోలేక, హాస్యమాడుతున్నాను! నీ
మీది నా ప్రేమ వల్ల’’ అని అంటుంది. అతని అల్పత్వం అతనికి తెలియజేసి పాదాక్రాంతుణ్ణి చేసుకుంటుంది.

‘‘ఇంక నేనే నీకు, నీ జీవితం నీ కాలం నీ నీతి నీ ఆత్మ ఇంక నేనే. నేనే నీ రక్షణ దైవాన్ని. నా చేతులకి నిన్ను నీవు అప్పగించుకుంటివా, పైనే కాదు, నీ లోపల్నించి మనస్ఫూర్తిగా నాకు వశ్యుడివైనావా
నిస్సంకోచంగా, నీ కెన్నటికీ ఏ అపకారం జరగదు. నా అనుగ్రహం అవ్యాజం. నా ప్రియుడు నా ముందేగాని ఏ దేవతల ముందూ శిరస్సు వొంచడానికి వీల్లేదు.
నీ సుకృతం నీ కిచ్చింది నన్ను. సుకృతమంటే కార్యాలు కాదు. ఎంతకీ ధర్మకార్యాలూ, భుజదర్పం వీటి సంగతేగాని, నా వంటి లావణ్యం నీకు వొచ్చి తీరవలసిన నీలోని శృంగార ఔన్నత్యం నీకు
కనపడదు.’’

‘‘నా అసలు నిజమైన తేజస్సుని నువ్వు చూడగలిగితేనా?
‘‘ఈ శరీరాల కలయికతో, రక్త సంబంధంతో, నా శక్తి, నా జ్ఞానం, నా స్పష్టత నీలోకి రావాలి. వుత్త కామవాంఛ తీర్చుకోవడమనుకోకు. నీ ఆలింగనం లోకి అపురూప దేహ లావణ్యాన్నే కాదు, గొప్ప
సంస్కారాన్ని, ఆధ్యాత్మిక శక్తిని తీసుకుంటున్నావు. నీ ఆత్మ వికసించకపోతే, యీ సృష్టి లీలే అర్థ విహీనం, వ్యర్థం.

’’మరి యిది ముక్తికాంతా పరిష్వంగం కాక మరేమిటి? ఆ అనుభవం అప్రమేయ ఆనందాన్నిచ్చేది కాబట్టే పురూరవుడు మైమరచిన చిత్తంతో, ఆరాధనా భావంతో.
‘‘నా కోసం ఉన్నత ధామాలు విడిచి వొచ్చి, నీతో స్వర్గ రహస్యాన్నే కిందికి తెచ్చి, నాలో నించి భూమికీ, ఆకాశానికీ నేనెక్కడానికై నీ లావణ్య ఇంద్ర ధనుస్సును కట్టావు. నువ్వు కాక నాకీశ్వరు డెవరు?’’
అంటాడు. అవును ఊర్వశే ఈశ్వరుడు. నారాయణుని పాదాల నుండి వచ్చిన గంగ ముక్తి దాయిని అయినప్పుడు, ఊరు సంభూత అయిన ఊర్వశి ముక్తి ప్రదాయిని కాదా?

ఊర్వశి చెప్పిన వేదాంతం :
ఊర్వశీ పురూరవ సంయోగం ఆత్మ పరమాత్మల సంయోగం. ప్రకృతి పురుషుల సంయోగం. ముక్తికాంతా మానవ సంయోగం. ముక్తి ఎలా సాధ్యమవుతుంది?
సాధన చతుష్టయాన్ని అనుష్ఠించాలి. శంకరాచార్యుడు ‘తత్త్వ బోధ’లో ఇలా చెప్పాడు:

నిత్యా నిత్య వస్తు వివేక:
ఇహాముత్రార్థ ఫల భోగ విరాగ:
శమాది షట్క సంపత్తి:
ముముక్షుత్వం చేతి 

ఊర్వశి చెప్తుంది  నేను చాలా సత్యం, నీ దాన్ని, నీ జీవితం ఒక్క క్షణం. ఊర్వశితో అనుభవం అనంతం. ‘బ్రహ్మ సత్యం, జగన్మిథ్య’ అని నమ్మడం అవసరం. బ్రహ్మయే ఊర్వశి అనుకుంటే ఆమె సత్యం. ఇక
పురూరవుని రాజ్యాధికారం, అంత:పురం స్త్రీలు, ప్రతాపం, యుద్ధాలు, రాజసాలు, పరివారం ఇదంతా అతని బాహ్య జగత్తు. దీనిని మిథ్యగా తలచాలి. అందుకే అడుగడుగునా ఆజ్ఞలు విధించింది ఊర్వశి.
తాను అనంత ప్రేమనని పరి పరి చెప్పింది.

ఇక రెండవది: ఇహలోక పర లోక భోగముల యందు, కర్మ ఫలముల యందు నైరాశ్యం కలిగి ఉండడం (ఇహాముత్రార్థ ఫలభోగ విరాగ:)
‘అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అనగలగాలి. మనో వాక్కాయ కర్మలా అలాంటి అభిప్రాయాల్ని అలవరచుకోవాలి. ఊర్వశి తాను రక్షణ దైవాన్ననీ, ఇతర వ్యాసంగాల నన్నిటినీ వదలి, తననే
ఉపాసించమనీ చెప్పింది. కానీ పురూరవుడికి ఇహలోక విషయాలపై మమకారం చావలేదు. వైరాగ్యం ప్రాప్తించలేదు. అందుకనే చేజిక్కిన దైవం చేజారిపోయింది.

శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము వీటినే శమాది షట్క సంపత్తి అంటారు. శమమంటే మనో నిగ్రహము. శమదమములు లోపించి, ఊర్వశి వంటి అపురూప లావణ్యవతి, స్వర్గ
సౌఖ్యాలు కూర్చే పెన్నిధానాన్ని ఒడిలో పెట్టుకొని అల్పమైన ఇహలోక విషయాలలో వెంపరలాడి ఆనందధామాన్ని ఆవలకు నెట్టాడు పురూరవుడు. తాను ఉద్ధరించేందుకు వచ్చిన దైవాన్నని చెప్తున్నా,
ముముక్షుత్వాన్ని మాని, ఐహికమైన అధికారాలు, భయాలు, శోకాలకు బానిస అయాడు.

ఇక జగత్తు మిథ్య అని ఊర్వశి ఎలా చెప్పిందో చూద్దాం  ‘‘కలకీ జీవితానికీ భేదమేమిటి? మేలుకున్నావు గనుక ఆ కలలోని అనుభవాన్ని కల అంటున్నావు. వాస్తవం కాదని దిగులు పడుతున్నావు. కాని
అట్లానే కల లోనే అంతమైనావనుకో. ఆ కల వాస్తవం కాదని, నీకు తెలీదు కదా! వెయ్యేళ్ళు మృణాళినితో జీవించినా, అది ఒకప్పటికి వుత్త జ్ఞాపకం, కలా అయి తీరుతుంది కదా!

మరణం తర్వాత ఎక్కడో మేలుకుంటే ఇది కల అనుకోవా మరి! కల తరవాత మేలుకున్నప్పుడు నిద్ర ముందు జీవితాన్ని ఎక్కడ వొదిలావో, మేలుకొని ఆ కొనని అందుకో గలుగుతున్నావు గనుక జీవితం
నిజమయింది. నిద్రలో జరిగింది కల, అబద్ధం అయింది. ఎందుకూ? కల జరిగిన తరవాతి కొనని అందుకోలేవు గనక. మళ్ళీ యీ జీవితం కొన అందకుండా ఎక్కడో మేలుకున్న రోజున, యీ జీవితం కల
కాదా?

జీవితమంటే ప్రతి అడుగుకీ కదలిక. కదలిక అంటే త్యాగం, తోవ పొడగునా వొదలడం. అందులో ప్రేమ జీవితమంటే చాలా వేగమైన కదలిక. క్షణక్షణానికీ తీవ్రమైన పరిత్యాగం.
వెనక్కి చూడడం చాలా మూర్ఖం. ముందు అనంత కాల దివ్యానుభవాలు పెట్టుకుని, ఏ విషాదం, ఆనందం కలగనీ, అనంతకాల పరంపరలో ఒక్క ముహూర్తం అనుకుంటూ వుండగా గడచిపోతాము.’’
ఇదీ ఊర్వశి వేదాంతం.

అనిత్యమైన ఐశ్వర్యం, అధికారం, అహంకారాలను నమ్ముకుని నిత్యమైన, సత్యమైన ఊర్వశినే సంశయించాడు పురూరవుడు. అల్ప జ్ఞానంతో నీచంగా ఆలోచించాడు. అందుకనే శాశ్వతంగా
దూరమయ్యాడు ఆ అలౌకిక అనుభవానికి.

మానవులందరూ అంతే. ఊర్వశి పరిష్వంగం వంటి విశ్వాత్మ పరిరంభంలో అప్రమేమానందాన్ని చవిచూచిన వారే. మానుషత్వపు మబ్బులు గమ్మి, స్వర్గానికి దూరమై ఆ విశ్వ ప్రేమికుని విరహంలో
అనాదిగా అలమటిస్తున్నారు.
విముక్తి ఎప్పుడో, ఆ అనంత, అమందానందంలో లీనమయేది ఎప్పుడో...
-పచ్చిపులుసు వెంకటేశ్వర్లు
(వివిధ భారతీయ సాహిత్యాలలో ఊర్వశి పాత్ర చిత్రణను తరచిచూస్తూ వ్యాసకర్త ‘ఊర్వశి’ రాశారు. ప్రచురణ: చలం ఫౌండేషన్‌ ఫోన్‌: 9951033415)

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు