Kumbhajadala Samhitha: బిజినెస్‌కు ఈజీ మ్యాప్‌

19 Nov, 2022 14:30 IST|Sakshi

చాలా మంది మహిళలు తమ సొంత కాళ్లమీద నిలబడటానికి ఉద్యోగమో, వ్యాపారమో చేయాలనుకుంటారు. ఉద్యోగానికైతే కొన్ని అర్హతలు ఉండాలివ్యాపారం చేయాలంటే.. పెట్టుబడి ఉంటే చాలనుకుంటారు. కానీ, కుటుంబం నుంచి అందుకు తగిన మద్దతు రాకపోతే .. నైపుణ్యాలు లేవని వెనకడుగువేస్తేపెట్టుబడి లేదని చతికిలపడితే.. హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో ఉన్న కుంబజాడల సంహితను కలవచ్చు. 

చార్టర్డ్‌అకౌంటెంట్‌ అయిన సంహిత దిగువ, మధ్యతరగతి మహిళలు  వ్యాపారంలో రాణించడానికి కావల్సిన అవగాహన తరగతులను ఉచితంగా ఇస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులచేత వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తున్నారు. అనుకున్న బిజినెస్‌కు ఈజీ మ్యాప్‌ డిజైన్‌ చేసిస్తున్నారు.. ‘మహిళలు ఎవ్వరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు’ అని చెప్పే సంహితను తనకు కలిగిన ఈ ఆసక్తి గురించి అడిగినప్పుడు ఎన్నో విషయాలు పంచుకున్నారు. 

‘‘సాధారణంగా చాలామంది చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అంటే కంపెనీ అకౌంటింగ్, ఆడిటింగ్‌ పనులు చూస్తారు, అంతవరకే వారి డ్యూటీ అనుకుంటారు. కానీ, ‘మీ బిజినెస్‌ను ఇలా ముందుకు తీసుకువెళ్లచ్చు’ అని గైడెన్స్‌ ఇవ్వాలనుకోరు. నేను ఉద్యోగరీత్యా ముంబై, ఢిల్లీ, చెన్నై, యు.ఎస్‌ లలో వర్క్‌ చేశాను. అన్ని చోట్లా మహిళల పని సామర్థ్యాల పట్ల అవగాహన ఉంది. వివిధ రంగాల్లో నైపుణ్యం గల స్నేహితులున్నారు.

వీరితో కలిసి ‘మహిళలు వ్యాపార రంగంలో రాణించడం’ అనే అంశాల మీద చర్చిస్తున్నప్పుడే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి సరైన గైడెన్స్‌ ఇస్తే బాగుంటుందనే ఆలోచన చేశాను. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ప్రోస్క్వాడ్‌ కన్‌సల్టింగ్‌ను ఏర్పాటు చేసి, నా వర్క్‌కు సంబంధించిన పనులు చూస్తున్నాను.  

అవగాహనే ప్రధానంగా..
రెండేళ్ల క్రితం ఆంధ్రాలో ఒకమ్మాయి తొక్కుడు లడ్డు 2/– రూపాయలకు ఒకటి అమ్మడం చూశాను. వాళ్లమ్మగారు ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె మరొక అమ్మాయితో కలిసి ఈ చిన్న బిజినెస్‌ చేస్తోంది. ఆ రోజు వాళ్లిద్దరూ 150 లడ్డూలు అమ్మారు. అంత మంచి స్వీట్, తక్కువ ధరకు అమ్ముతున్నారు. వారికి ఆ స్వీట్స్‌ను ఎలా మార్కెటింగ్‌ చేయాలో చెప్పాలనుకున్నాను.

దాంతోపాటు బ్యాంకుల నుంచి పెట్టుబడులు తెచ్చుకోవడం, ప్యాకేజీ సిస్టమ్, మార్కెటింగ్‌ ఐడియాలు ఇవ్వడంతో ఇప్పుడు వారి వ్యాపారం లక్షల్లో నడుస్తోంది. ఆ అమ్మాయిలిద్దరూ చదువుకున్నవారు కాదు. ఒకరు టైలరింగ్‌ చేసేవారు, ఇంకొక అమ్మాయి ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు వారిని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. అదిలాబాద్‌కు చెందిన ఒకరి బిజినెస్‌ దాదాపు మూతపడిపోయే దశలో ఉన్నప్పుడు మమ్మల్ని కలిశారు. ఇప్పుడు వారి వ్యాపారంలో ఏ చిన్న సందేహం వచ్చినా ఫోన్‌ చేసి సలహా అడుగుతుంటారు. 

ప్రతి ఒక్కరికీ సొంతంగా ఎదగాలనే ఆలోచన ఉంటుంది. కానీ, సరైన అవగాహన లేక వెనకబడిపోతుంటారు. లేదంటే ఫెయిల్యూర్స్‌ చూస్తుంటారు. ఇలాంటప్పుడు సరైన గైడెన్స్‌ ఇచ్చేవారుంటే తిరిగి నిలదొక్కుకుంటారు. ఈ ఉద్దేశ్యంతోనే రెండేళ్ల నుంచి చిన్న, మధ్య తరగతి మహిళా వ్యాపారులకు అవగాహనా తరగతులను నిర్వహిస్తున్నాం. అందుకు విధి విధానాలను రూపొందించాను. మొదలుపెట్టిన యేడాదిలోనే వందకు పైగా రిజిస్ట్రేషన్స్‌ వచ్చాయి. ఆ తర్వాత యేడు ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. 

రిస్క్‌ అని వద్దనుకుంటారు..
ఏదైనా సొంతంగా వర్క్‌ స్టార్ట్‌ చేద్దామని వచ్చినవారిని ‘ముందు మీ ఇంట్రస్ట్‌ ఏంటి?’ అనే ప్రశ్నతో  మొదలుపెడతాం. ఆ తర్వాత వారితో 2–3 సెషన్స్‌ నడుస్తాయి. ఎందుకంటే, ఏ చిన్న బిజినెస్‌ మొదలుపెట్టాలన్నా రెండు, మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇలాంటప్పుడు వారిలో ఎన్నో సందేహాలు ఉంటాయి. కుటుంబం అంత పెట్టుబడి పెట్టలేకపోవచ్చు.

పైగా ‘మార్కెట్‌ గురించి ఏమీ తెలియకుండా పెట్టుబడి పెడితే, ఫెయిల్యూర్‌ వస్తే తట్టుకోలేం’ అనేది ఉంటుంది. ఇవన్నీ వారితో చర్చిస్తాం. వారిలో ఉన్న స్కిల్స్‌ని పరిగణనలోకి తీసుకొని, ఆ తర్వాత బిజినెస్‌లో ప్రోత్సహిస్తాం. ఇందుకు కన్సల్టేషన్‌ ఫీజు ఉండదు. బిజినెస్‌ చేయాలనుకునేవారి ఆలోచనకు మా గైడెన్స్‌ ఒక సులువైన రోడ్‌ మ్యాప్‌లా ఉంటుంది. 

నెమ్మదిగా ప్రయాణం..
ఇప్పటి వరకు మా దగ్గరకు వచ్చే వారి నుంచి ఇంకొంత మందికి తెలిసి, వారి ద్వారా మరికొంతమంది చేరుతున్నవారే ఉన్నారు. అలా ఇప్పటి వరకు 350 మంది క్లయింట్స్‌ ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది స్లో ప్రాసెస్‌. ‘మీరెందుకు ఫ్రీ సర్వీస్‌ ఇస్తారు..’ అనేవారూ ఉన్నారు. ఈ సందేహం నిజమే.. మార్కెట్లో మా గైడెన్స్‌తో నిలదొక్కుకున్నాక వాళ్లు ఇంకా పై స్థాయికి చేరుకోవాలనుకున్నప్పుడు ఛార్జ్‌ ఉంటుంది.

ఈ మొత్తం మరికొందరికి గైడెన్స్‌ ఇవ్వడానికి సహాయపడుతుంది. మార్కెట్లో ఏ ప్రొడక్ట్‌కైనా ఎమ్‌ఆర్‌పీ ఉంటుంది. కానీ, మా వర్క్‌కి అలా ఉండదు. ఈ వర్క్‌కి ఎంత చార్జ్‌ చేయచ్చు అనేది కూడా తెలియదు. కొందరికి వారి బిజినెస్‌ను బట్టి ఛార్జ్‌ ఉంటుంది.  

స్వతంత్రంగా ఎదగడం, ఆర్థికంగా నిలబడాలనే విషయంలో మహిళల ఆలోచన పెరుగుతోంది. చాలా మంది మహిళలు నా కోసం నేను ఏ కొంచెమైనా డబ్బు సంపాదించుకోగలనా అని ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా మహిళల్లో మల్టీటాస్కింగ్‌ చేసే శక్తి ఉంటుంది కాబట్టి, వారికి కొంత ప్రోత్సాహమిస్తే చాలు అనుకున్న స్థాయికి చేరుకోగలరు. ఆ ప్రోత్సాహమే నేను ఇవ్వాలనుకున్నది’’ అని వివరించారు ఈ చార్టర్డ్‌ అకౌంటెంట్‌. – నిర్మలారెడ్డి 

మరిన్ని వార్తలు