డబ్బు లెక్క... ఓ కొలిక్కి వస్తోంది

31 Mar, 2022 00:24 IST|Sakshi
శుభ్రా మహేశ్వరి

ఇటీవల ఒక సర్వేలో వెల్లడైన నిజాలు ఆశ్చర్యం కలిగించాయి. ఈ డిజిటల్‌ యుగంలో కూడా మహిళ బ్యాంకు పోపుల డబ్బానే! ఆర్థిక వ్యవహారాలకు మహిళలు దూరంగానే ఉంటున్నారు. ఉద్యోగం చేసే మహిళల ఏటీఎమ్‌ కార్డుల నిర్వహణ భర్తదే! అందుకే... ఫైనాన్షియల్‌ లిటరసీ అవసరం అంటారు శుభ్రా మహేశ్వరి.

‘‘చాలామంది మహిళలకు ఆర్థిక వ్యవహారాల పట్ల ఏ మాత్రం అవగాహన ఉండడం లేదు. ఇది గ్రామీణ మహిళలు, నిరక్షరాస్యులైన మహిళల విషయం కాదు. బాగా చదువుకున్న వాళ్లు కూడా కనీస అవగాహన లేకుండా జీవితాన్ని గడిపేస్తున్నారు. నగరంలో ఇంటిని నిర్వహించే గృహిణి నెల ఖర్చులకు ముప్పై – నలభై వేల వరకు ఆమె చేతుల మీదుగా ఖర్చు చేస్తుంటుంది. కానీ ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఇన్‌వెస్ట్‌ చేయమంటే చేయలేదు. మన దగ్గర ఉన్న డబ్బును బ్యాంకులో దాస్తే డబ్బే డబ్బును రెట్టింపు చేస్తుందనే చిన్న లాజిక్‌ని మిస్‌ అవుతున్నారు. ఇది వెల్త్‌ క్రియేషన్‌లో వెనుకబాటుతనమేనంటారు శుభ్ర.

అక్షరాలు వచ్చు! లెక్క తేలదు!!
ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే... పెద్ద చదువులు చదువుకున్న మహిళలు కూడా బంగారాన్ని ఆభరణం రూపంలో కొని బీరువాలోనో, బ్యాంకు లాకర్‌లోనో దాచుకుంటున్నారే తప్ప గోల్డ్‌బాండ్‌ కొనుగోలు చేయాలనే ఆలోచన చేయడం లేదు. బాండ్‌ రూపంలో ఉన్న బంగారం విలువను అర్థం చేసుకోవడంలో నిరక్షరాస్యతలో ఉన్నారనే చెప్పాలి. బ్యాంకులు గ్రామాల్లోకి కూడా విస్తరించాయి. కానీ చిన్న మొత్తమైనా సరే బ్యాంకులో దాచుకుని బ్యాంకు ద్వారా కానీ యాప్‌ ద్వారా కానీ లావాదేవీ నిర్వహించడం నేర్చుకోవడంలో బాగా వెనుకబడి ఉన్నారు. కాలేజీల్లో కూడా విద్యార్థులకు డబ్బు సంపాదించడం గురించి మాత్రమే నేర్పిస్తారు.

డబ్బును ఎలా నిర్వహించాలో నేర్పించడం మీద దృష్టి వెళ్లడం లేదు. ‘‘పరిశ్రమలు స్థాపించిన మహిళలు, చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టిన మహిళలు శ్రమించడంలో ఏ మాత్రం అలసత్వం ఉండదు. నూటికి నూరు శాతం ఎఫర్ట్‌ పెడుతున్నారు. కానీ మనీ మేనేజ్‌మెంట్‌ తెలియకపోవడం వల్లనే లాభాల బాట పట్టాల్సిన పరిశ్రమలు పట్టాలు తప్పుతున్నాయి. ఒక చార్టెడ్‌ అకౌంటెంట్‌గా నేను గమనించింది ఒక్కటే. పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించిన మహిళలు అంకితభావంతో పని చేస్తున్నప్పటికీ వారికి సరైన మార్గదర్శనం చేసే వారు లేకపోవడంతో ఆ మహిళల శ్రమ వృథా అవుతోంది. వర్క్‌లో డెడికేషన్‌ ఎంత ముఖ్యమో, రైట్‌ డైరెక్షన్‌లో చేయడం కూడా అంతే ముఖ్యం.

అందుకే నా వంతు సామాజిక బాధ్యతగా మహిళల్లో ఆర్థిక చైతన్యం తీసుకురావడానికి ఫైనాన్షియల్‌ లిటరసీ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాను. ఇటీవల మనదేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు గణనీయంగా పెరిగారు. ఈ దశలో ఈ చైతన్యం చాలా అవసరం. ఇందుకోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో వర్క్‌ షాపులు చేపడుతున్నాం. భారీ సమావేశాలకు బదులు చిన్న చిన్న క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఇంత పెద్ద విషయాన్ని సరళంగా వివరించడానికి స్థానిక బ్యాంకులతో కలిసి పని చేస్తున్నాం. సమావేశంలోనే బ్యాంకు అకౌంట్‌ ఓపెన్‌ చేయించడం కూడా జరుగుతుంది’’ అన్నారు శుభ్రా మహేశ్వరి.

కలను దర్శించాలి!
ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ చైర్‌ పర్సన్‌గా ఆమె మహిళను మానసికంగా శక్తిమంతం చేయడానికి ‘స్ట్రాంగర్‌ షీ’ అనే కార్యక్రమం రూపొందించారు. అందులో భాగంగా ఈ ఏడాది చేపట్టిన అంశం ‘ఫైనాన్షియల్‌ లిటరసీ’. దేశంలోని గ్రామీణ, పేద మహిళ నుంచి మధ్య తరగతి మహిళలు, వైట్‌ కాలర్‌ జాబ్‌లో ఉన్న మహిళలను కూడా కలుసుకుంటారు. డబ్బు సంపాదించడం మాత్రమే తెలిస్తే సరిపోదు, డబ్బును ఎలా ఇన్‌వెస్ట్‌ చేయాలో కూడా నేర్పించడం, డబ్బుతో డబ్బును ఎలా పెంపొందించుకోవాలో తెలియచేయడం ఇందులో ప్రధాన ఉద్దేశం.

‘‘భూమ్మీద నీకంటూ ఒక స్థానం ఉంది. ఆకాశంలోనూ నీ కంటూ కొంత భాగం ఉంది. ఈ రెండింటినీ కలుపుతూ ఎదగడానికి నీకంటూ ఒక కల ఉండాలి. నీ జ్ఞానంతో ఆ కలను దర్శించగలగాలి. ఆ కలను నిజం చేసుకోవడానికి నీ శ్రమను అనుసంధానం చేసుకోవాలి. నీ కలను నిజం చేసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నీదే. కుటుంబ సభ్యులు, స్నేహితులు సహాయంగా ఉండే వారే, ఫలితం పూర్తిగా నీదే. అది విజయం అయినా అపజయం అయినా పూర్తి బాధ్యత నీదేననే విషయాన్ని మర్చిపోకూడదు’’ మహిళలకు నా సందేశం ఇదేనన్నారు శుభ్రా మహేశ్వరి.

రోజూ తెల్లకాగితమే!
శుభ్రా మహేశ్వరి పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే. తండ్రి పారిశ్రామికవేత్త. ఆమె మాత్రం చార్టెడ్‌ అకౌంటింగ్‌ వైపు ఆసక్తి చూపించింది. పెళ్లి తర్వాత ఇరవై ఏళ్ల కిందట భర్తతో హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. బ్లూ స్టోన్స్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల డైరెక్టర్‌గా విధులు నిర్వహణతోపాటు చార్టెడ్‌ అకౌంటెంట్‌గా తిరుమల తిరుపతి దేవస్థానమ్, ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్, నేషనల్‌ హైవేస్‌తోపాటు దాదాపుగా మూడు వందల కార్పొరేట్‌ కంపెనీలకు ఆడిటర్‌గా సేవలందించిన, అందిస్తున్న అనుభవం ఆమెది. ‘‘మన జీవితంలో ప్రతి రోజూ ఒక కొత్త రోజే. డైరీలో కొత్త పేజీనే. ఏమీ రాయని తెల్లకాగితమే. జీవితంలో విజయం సాధించాలంటే ప్రతి కాగితాన్నీ మంచి విషయంతో నింపాలి. అదే అందమైన కథ అవుతుంది. అంటే ఏ ఒక్క రోజునూ నిరుపయోగంగా గడపవద్దు. ప్రయోజనకరంగా గడపాలి’’ అంటారు శుభ్రా మహేశ్వరి.

    – వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు